‘ఉపాధి’ కూలీలకు ఊతం | Boost for 'Employment' Coolies | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీలకు ఊతం

Published Sat, Dec 12 2015 5:40 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’ కూలీలకు ఊతం - Sakshi

‘ఉపాధి’ కూలీలకు ఊతం

సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 రోజులపాటు ఈ పథకం పనులను పూర్తి చేసిన కూలీలకు ఆయా అంశాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచాలని, తద్వారా వారి ఆదాయం పెంచాలని భావిస్తోంది. ఆయా కుటుంబాల్లోని సభ్యులకు నైపుణ్యాల పెంపుదల, స్వయం ఉపాధి కల్పన నిమిత్తం లైవ్లీహుడ్ ఇన్ ఫుల్ ఎంప్లాయిమెంట్(లైఫ్) ప్రాజెక్ట్ కింద శిక్షణ ఇవ్వనుంది. లైఫ్ ప్రాజెక్ట్‌కు అర్హులైన కుటుంబాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎంపిక చేశారు.
 
 ఏఏ అంశాల్లో శిక్షణ అంటే..
  స్కిల్ డెవలప్‌మెంట్:  వ్యవసాయ రంగ సంబంధిత నైపుణ్యాలు, వైద్య, ఆరోగ్య అనుబంధిత రంగాలు, వాహన మరమ్మతులు, బ్యాంకింగ్, అకౌంటింగ్, కేశాలంకరణ, తోలు ఆట వస్తువులు, నిర్మాణ రంగంలో నైపుణ్యాల పెంపు, ఆతిథ్యం, సమాచారం, కమ్యూనికేషన్, బీమా సంబంధిత రంగాలు, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ముద్రణ తదితర రంగాల్లో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఆపై ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలను అందిస్తారు.
 
 స్వయం ఉపాధి
 పాడి పరిశ్రమ, వ్యవసాయం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, బయోగ్యాస్ ప్లాంట్లు, పూల పెంపకం, కంప్యూటర్ హార్డ్‌వేర్, హోమ్ నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, ఏసీ రిపేరింగ్, సెక్యూరిటీ గార్డులు, బ్యూటీ పార్లర్, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, ఆల్బమ్‌ల తయారీ, మొబైల్ రిపేరింగ్ అంశాల్లోనూ శిక్షణ ఇస్తారు.
 
  జీవనోపాధుల పెంపుదల
  వ్యవసాయ అనుబంధ(హార్టికల్చర్, సెరికల్చర్, కూరగాయల పెంపకం) రంగాలు, సేంద్రియ ఎరువుల తయారీ తదితర రంగాల్లో శిక్షణకు అవకాశం కల్పిస్తారు. కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను చూపుతారు.
 
 ‘లైఫ్’ ముఖ్యాంశాలు...
►18 నుంచి 35 ఏళ్ల లోపున్న కూలీలకు లైఫ్ కింద శిక్షణ
►మహిళలు, గిరిజనులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు తదితర కేటగిరీల వారికి 45 ఏళ్ల వరకు అవకాశం
► ప్రస్తుతం పొందుతున్న దాని కన్నా అధికంగా ఆదాయం కల్పించడం
► తగిన అర్హతలున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ కల్పన
► వివిధ చేతి వృత్తులవారికి నైపుణ్య శిక్షణనిచ్చి స్వయం ఉపాధి కల్పించడం  
► రాష్ట్రవ్యాప్తంగా(హైదరాబాద్ మినహా) తొమ్మిది జిల్లాల నుంచి  2,05,393 మంది కూలీలు ఎంపిక
► 41 అంశాల్లో నైపుణ్య శిక్షణ
► ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, పల్లె ప్రగతి నిధులు, స్త్రీనిధి బ్యాంకు నుంచి వడ్డీలేని రుణాలు
► సుమారు రూ.1,100 కోట్లతో లైఫ్ ప్రాజెక్ట్ అమలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement