ఉపాధి అమలులో నిర్లక్ష్యం వద్దు
పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
కోస్గి: కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించడంలో నిర్లక్ష్యం వద్దని అధికారులు, సిబ్బందికి కలెక్టర్ టీకే శ్రీదేవి సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే అధికార యంత్రాంగం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి ఫలాలు కూలీలకు అందకుండా పోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆమె గురువారం మండలంలోని నాచారం గ్రామంలో ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులకు రాకపోయినా కూలీల పేర్లను మస్టర్‌లో నమోదుచేసి హాజరువేయడంపై ఫీల్డ్ అసిస్టెంట్ అబ్దుల్‌ఖదీర్‌ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోవడంతో పనులకు రాని కూలీల పేర ఎన్ని డబ్బులు అక్రమాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీడీ నీళ్లు నమలడంతో అప్పటికప్పుడు పీడీ దామోదర్‌రెడ్డిని నివేదిక అందించాలని కోరారు.
పనిచేయడం ఇష్టం లేని అధికారులు స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉపాధి పనులు జరిగే చోటకు వెళ్లి తాగేందుకు నీళ్లెక్కడున్నాయని కూలీలను అడగ్గా ఇంటినుంచి తెచ్చుకుంటున్నామని కలెక్టర్‌కు తెలిపారు. తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతుల కోసం ఒక కూలీకి ప్రభుత్వం ప్రతిరోజు రూ.9 అదనంగా చెల్లిస్తుందని ఈ విషయంలో కూలీలకు అవగాహన లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వారికి నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పనిచేస్తున్న గ్రూపులు, చేపట్టిన పనులు, చెల్లించిన బిల్లులు, కూలీల వివరాలతోపాటు సమగ్ర నివేదికను అందజేయాలని పీడీని ఆదేశించారు.