ఊపందుకున్న ‘ఉపాధి’
⇒ ఉపాధి పనుల్లో రోజుకు ఏడు లక్షల మంది కూలీలు!
⇒ ఇక కనిష్ట కూలీ రూ.130, గరిష్టం రూ.310
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. జనవరిలో ఉపాధి పనులకు లక్ష మంది లోపే హాజరు కాగా, ఫిబ్రవరి నుంచి ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. గత వారంలోనైతే రోజుకు సగటున 5.78 లక్షల మంది చొప్పున కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా శుక్రవారం నాడైతే ఏకంగా 6.99 లక్షల మంది కూలీలు పనులకు రావడం విశేషం! గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు బాగా తగ్గడం, ప్రభుత్వం 20 శాతం నుంచి 35 శాతం దాకా సమ్మర్ అలవెన్స్ పెంచడంతో జాబ్ కార్డులున్న కూలీలంతా ఉపాధి పనుల వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉపాధి కూలీలకు రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను కూడా ప్రభుత్వం తాజాగా సవరించింది. దాదాపు 21 విభాగాల్లో వివిధ రకాల పనులకు రేట్లను 28 శాతం దాకా పెంచుతూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఉపాధి హామీ కింద గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతం కూలీలకు చెల్లిస్తున్న రోజువారీ వేతన సగటు రూ.137 కాగా, తాజా పెంపుదలతో పూర్తిస్థాయిలో రోజువారీ వేతనం (రూ.194) అందే అవకాశం ఏర్పడిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీ కూలీలందరికీ తాజా ఉత్తర్వుల మేరకు పెరిగిన వేతనాలందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 8,182 గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతుండగా, పని కోరిన కూలీలందరికీ ఉపాధి కల్పించే నిమిత్తం రూ.14 వేల కోట్ల విలువైన 11లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం చేశారు.
సవరించిన రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు
► కొండ ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల్లో భూమి తవ్వకం, భూమిని చదును చేసే పనులకు ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు రూ.114 ఇస్తుండగా రూ.145.82కు పెంచారు
► చెక్‌డ్యామ్‌లు, చిన్న కుంటల్లో పూడికతీత పనులకు కూలీ రూ.114 నుంచి 130కి పెంపు
► సరిహద్దు కందకాలు, కరకట్టల పనులకు కూలీ క్యూబిక్ మీటరుకు రూ.157.39 నుంచి రూ.173.13కు పెంచారు
► ఫీడర్ ఛానళ్లలో పూడికతీత, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ కాలనీల్లో నీరు నిలిచే ప్రాంతాలను పూడ్చడం, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల్లో క్యూబిక్ మీటరుకు రూ.114 నుంచి రూ.145.82కు పెంచారు
► వ్యవసాయ కుంటలు, బావులు, నీటి సంరక్షణ కందకాల తవ్వకం, డంపింగ్ యార్డులలో పనులకు రూ.194 నుంచి రూ.246.30కు పెంచారు
► గరప నేలల్లో పనులకు క్యూబిక్ మీటరుకు రూ.140.6 నుంచి రూ.180కి పెంచారు
► పలు పనులకు క్యూబిక్ మీటర్‌కు కనిష్టంగా రూ.130, గరిష్టంగా రూ.310 అందనుంది