మరమ్మతులతో సరిపెడుతున్నారు!
- ఉపాధిహామీ కింద సీసీరోడ్ల నిర్మాణంలో కొన్నిచోట్ల అవకతవకలు
- గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రహదారుల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామీణాభి వృద్ధి శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంతకు మునుపే వివిధ ప్రభుత్వ పథకాల కింద వేసిన సీసీరోడ్లనే తాజాగా కొద్దిపాటి మరమ్మతులు చేసి, కొత్త సిమెంట్ రోడ్ల మాదిరిగా చిత్రీకరిస్తున్నట్లు ఉన్నతాధి కారుల పరిశీలనలో తేలింది. ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నందున, గత నెలరోజు లుగా గ్రామాల్లో హడావిడి వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసేందుకు అవసరమైన మేస్త్రీలు దొరకకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
రూ.300 కోట్లకు మించే పరిస్థితి లేదు...
ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 7,564 పనులు మాత్రమే కొనసాగుతున్నాయని, వీటికి రూ.259.09కోట్లు మాత్రమే ఖర్చయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తమ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా పనుల వివరాలను నమోదు చేయలేదని, మొత్తంగా రూ.300 కోట్లకు మించి సీసీ రోడ్లకు ఖర్చయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో పాత సిమెంట్ రోడ్లనే కొత్త రహదారులుగా చూపి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో కొత్త సీసీరోడ్లు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుయూయులకు సీసీరోడ్ల బిల్లులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
పూర్తి చేసిన వాటికే బిల్లులు..
మార్చి 31లోగా సీసీరోడ్లు నిర్మించకుండా బిల్లులు పొందేందుకు అస్కారం లేదని, పూర్తిచేసిన రహదారులకు మాత్రమే బిల్లులు మంజూరవుతాయని ఉన్నతాధికారులు అంటున్నారు. నిర్మించిన ప్రతి సీసీరోడ్‌ను తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా రహదారుల వద్ద ఉపాధిహామీ నిధులతో నిర్మించిన రహదారిగా శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నామని అధికారులు చెబుతున్నారు.