ఉపాధి కూలీలకు నేరుగా వేతనాలు!
వారి ఖాతాల్లోనే జమ చేయనున్న కేంద్రం
సామగ్రి ఖర్చు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇకపై వేతన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్రం నిర్ణరుుంచిం ది. కేంద్రం నుంచి ఉపాధి సొమ్ము రాష్ట్ర ఖజానాకు జమ కావడం, ఆ సొమ్మును వెంటనే గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడం వంటివాటితో కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు మానేయడం, వలస పోయిన దుస్థితి ఏర్పడడంతోపాటు కొన్నిసార్లు ఉపాధి నిధులను విడుదల చేరుుంచడానికి రాష్ట్ర గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తాము అప్రదిష్ట పాలుకావాల్సి వస్తోందని భావించిన కేంద్రం... నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్ ద్వారా..
ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనాలను చెల్లించేందుకు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉపాధి పనులు చేసిన కూలీల పేరు, ఆధార్, జాబ్‌కార్డ్ నంబర్, చెల్లించాల్సిన వేతనం తదితర వివరాలను ‘తెలంగాణ పేమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(టీపీఎంఎస్)’ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రానికి పంపుతారు. ఆ వివరాలను ఎన్ ఈఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించి, కూలీ లకు వేతనాలు చెల్లిస్తారు. దీనికి సంబంధిం చి రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో.. రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణరుుంచారు. దీంతో ఉపాధి కూలీలకు ఇకపై వేతన సమస్యలు ఉండవని ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు పేర్కొంటున్నారు.
రూ.202 కోట్లు విడుదల
రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పనుల చెల్లింపుల కోసం మూడో విడత కింద కేంద్రం రూ.202 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఏకే సంబ్లీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం సొమ్ములో రూ.152.23 కోట్లను వేతన చెల్లింపులకు, రూ.50 కోట్లను మెటీరియల్ కాంపొనెంట్ కింద అవసరమైన సామగ్రికి వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. కూలీల కు వేతన చెల్లింపులను ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని.. మెటీరియల్ కాంపొనెంట్ సొమ్మును త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు.