- గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి కీలకం
- పీవోలుగా మళ్లీ ఎంపీడీవోలు
నూజివీడు : ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో అమలైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్) ఇక నుంచి పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో అమలుకానుంది. ఈ పథకం నిర్వహణపై ప్రభుత్వం ఇటీవల జీవో 139 జారీ చేస్తూ అందులో సిబ్బంది విధివిధానాలను పేర్కొంది. ఈ జీవో ప్రకారం ఈ పథకం అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఇక నుంచి కీలకపాత్రం వహించనున్నారు.
గతంలో జిల్లా స్థాయిలో డ్వామా పీడీ, డివిజన్ స్థాయిలో ఏపీడీ, మండల స్థాయిలో ఎంపీడీవో ప్రొగ్రామింగ్ అధికారి(పీవో)గా ఉండేవారు. అయితే ఎంపీడీవోలు ఈ పథకం నిర్వహణ నుంచి తప్పుకోవడంతో అప్పటి నుంచి అసిస్టెంట్ ప్రొగ్రామింగ్ అధికారి(ఏపీవో)లు ఈ పథకం నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో గ్రామసభ ద్వారా ఎంపిక చేసిన పనులను ఈ పథకం కింద కూలీలతో చేయించి, వారి కూలి చెల్లించేవారు. గ్రామస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అవకతవకలు ఎక్కువగా చోటుచేసుకునేవి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం మళ్లీ ఎంపీడీవోలు ఉపాధిహామీ పథకం నిర్వహణలో మండల స్థాయిలో ప్రధానపాత్ర పోషించనున్నారు.
ఏపీవో వీరికి సహాయకారిగా ఉంటారు. ఈసారి ఎంపీడీవో కార్యాలయాల్లోని సిబ్బందిని కూడా ఈ పథకంలో కీలకం చేశారు. గతంలో ఈవోఆర్డీలకు ఈ పథకం నిర్వహణపై ఎలాంటి బాధ్యత ఉండేది కాదు. తాజా జీవోలో మాత్రం వారికి కూడా విధులు కేటాయించారు. మండల పరిషత్ కార్యాలయాలన్నింటికీ నూతన జీవోకు సంబంధించి పలు విధివిధానాలు ఇప్పటికే చేరాయి. వీటిపై అధికారులు, ఏపీవోలు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోలు ప్రోగ్రామింగ్ అధికారిగా ఉన్నందుకు గాను ప్రభుత్వం కారు, ఇతర అలవెన్సులు కల్పించింది.
కార్యదర్శే కీలకం..
గతంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించని పంచాయతీ కార్యదర్శులకు ఈ నూతన విధానంలో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేసే ప్రధాన బాధ్యతను కార్యదర్శులకే అప్పగించారు. గ్రామసభల నిర్వహణ, పనుల గుర్తింపు, నూతన జాబ్‌కార్డుల కోసం పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ తదితర పనులన్నీ కార్యదర్శే చూసుకోవాలి. ఉపాధిహామీలో పనిచేసే క్షేత్ర సహాయకు(ఎఫ్‌ఏ)లు కార్యదర్శి పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది.
వ్యతిరేకిస్తున్న కార్యదర్శులు..
ఇదిలా ఉండగా ఉపాధిహామీ పథకం పనుల బాధ్యతలను తమకు అప్పగించడంపై చాలాచోట్ల కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. అసలే ఒకవైపు రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు వర్కులోడ్ అధికంగా ఉండి సతమతమవుతుంటే, మరోవైపు ఉపాధి పనులు అప్పగించడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పనిభారం పెరగడంతో ఇంటిపన్ను వసూలుకే సమయం చాలక బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న పరిస్థితులలో ఉపాధి పనుల బాధ్యతలను కూడా తీసుకుంటే పంచాయతీలను గాలికొదిలేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.