‘ఉపాధి’కి ఎసరు?
- కేరళ తరహాలో నిర్వహణకు సర్కారు సన్నాహాలు
- ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించే యత్నం
ఉపాధి పనుల పర్యవేక్షణతో పాటు నిర్వహణ తీరు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేరళ తరహాలో రాష్ట్రంలో సైతం ప్రభుత్వ సిబ్బందితో ఈ పథకాన్ని కొనసాగించి, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తప్పించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నర్సీపట్నం రూరల్ : పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో 2008 నుంచి ప్రారంభించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌పై ఏపీవోతో పాటు ఇంజినీరింగు, సాంకేతిక సిబ్బందిని, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. వీటి పర్యవేక్షణ బాధ్యత అప్పట్లో ఎంపీడీవోలకు అప్పగించింది. పనుల ఎంపికతో పాటు ఇతర నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించి, పథకం పర్యవేక్షణతో పాటు నిధులు చెల్లించే అధికారం ఎంపీడీవోలకు ఇచ్చింది. సామాజిక తనిఖీల్లో ఎంపీడీవోలను సైతం బాధ్యులను చేయడంతో గత ఏడాది జనవరిలో బాధ్యతల నుంచి ఎంపీడీవోలు తప్పుకున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పథకం నిర్వహణలో మార్పులు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీడీవోలకు గతంలో మాదిరిగా బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగష్టు 5 నుంచి వీరికి డిజిటల్ కీ అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు కేరళ తరహాలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ అధికారులతో కొనసాగించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అక్కడ జడ్‌పీ సీఈవో పర్యవేక్షణలో ఎంపీడీవో, ఈవో పీఆర్‌డీ, ఇంజినీరింగు అధికారులతో పనులు చేపడుతున్నారు. దీని మాదిరిగా రాష్ట్రంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ విధంగానే పనులు నిర్వహించి, ఔట్ సోర్సింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం సుమఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉపాధి పనుల నిర్వహణకు జిల్లాలో సుమారుగా 930 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 500 మంది వరకు సాంకేతిక సిబ్బంది, ఇంజినీరింగు ప్రతినిధులు 50, ఏపీవోలు మరో 39 మంది పనిచేస్తున్నారు. కేరళ తరహా విధానాన్ని అమల్లోకి తెస్తే వీరంతా ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అవినీతి సాకుతో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోంచి తప్పించాలని చూస్తుండగా, కేరళ తరహా విధానాన్ని అమల్లోకి తెస్తే మిగిలిన ఔట్ సోర్సింగ్ కుటుంబాలన్నీ రోడ్డున పడనున్నాయి.