ఐఏఎంసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు.
కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్‌టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్‌టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment