
ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని వ్యాఖ్య
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి.
ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.