ప్రతిభ ఉన్నా చంద్రబాబు పాలనలో అవకాశాలు లేక దాదాపు మరుగున పడిన మహిళలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అత్యంత ప్రాధాన్యం దక్కడంతో అన్నింటిలో సగంగా మారారు. దశాబ్దాలుగా పోరాడుతున్నా 33 శాతం రిజర్వేషన్ దక్కించుకోవడమే కష్టంగా మారిన తరుణంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలకు ఉద్యోగాలు, రాజకీయాలు, రాజకీయంగా సంక్రమించే నామినేటెడ్ పోస్టుల్లో సైతం 50 శాతం వాటా అందేలా చూస్తోంది. పేరుకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అని చెబుతున్నా.. ఓపెన్ కేటగిరీ కలుపుకుంటే 50 శాతం మహిళలకే దక్కుతున్నాయి. వైఎస్ జగన్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యం.
సాక్షి , కడప: వైఎస్ జగన్ సర్కార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు పెద్ద పీట వేయడమే కాక ఆయా వర్గాలలో మహిళలకు సగం పదవులు కట్టబెట్టి సముచిత స్థానం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా చదువుకున్న యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదిగా ఉండడంతో వారు సంతోషిస్తున్నారు.అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం లభించక రోడ్డున పడ్డామని,జగన్ ప్రభుత్వం నిర్ణయంతో బతుకుపై భరోసా కలిగిందని,రాజకీయంగా ప్రాధాన్యం లభించిందని పలువురు మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తన మంత్రివర్గంలో సీఎం జగన్ మహిళలకు పలు శాఖలు కేటాయించి వారికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పారు.ఎన్నికల్లో చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం వలంటీర్లు, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను తెరపైకి తెచ్చింది.
ఇందులో పనిచేసేందుకు ఉద్యాగాలను కల్పించింది. నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా ఉద్యోగులను ఎంపిక చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 789 పంచాయతీల్లోని 5,36,321 గృహాల పరిధిలో 10,557 మంది వలంటీర్లను ప్రభుత్వం ఎంపిక చేయగా ఇందులో దాదాపు 50 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించారు. ఈ నెల 15 నుంచి వీరు విధుల్లో చేరనున్నారు.ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ పాలన అందించేందుకు గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా 791 గ్రామపంచాయతీలు ఉండగా వాటి పరిధిలో 873 గ్రామసచివాలయాల ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నమాట.
ఇవికాక 300 వరకు అర్బన్ పరిధిలో వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 8 వేలకు పైగా ఉద్యోగాలు నియామకం జరగనుంది. మొత్తంగా జిల్లాలోనే 19 వేల ఉద్యాగాలు భర్తీ కానున్నాయి. ఇందులో అధికారికంగా 33 శాతం మహిళలకు ఉద్యోగాలు అని చెబుతున్నా .. ఓపెన్ కేటగిరీ కలుపుకుంటే దాదాపు వేల ఉద్యాగాలు మహిళలకే దక్కనున్నాయి. వీటికి డిగ్రీ,బీటెక్ అర్హతగా నిర్ణయించారు. అక్టోబర్ 2 నాటికి ఈ ఉద్యాగాల భర్తీ జరగనుంది. ఇందులో మహిళా పోలీసు ,ఏఎన్‌ఎం తదితర పోస్టులు నూరు శాతం మహిళలకే కేటాయించడం గమనార్హం.
రాజకీయ పదవులూ మహిళలకే ...
రాజకీయంగా ఇచ్చే నామినేటెడ్ పదవులను జగన్ ప్రభుత్వం 50 శాతం మహిళలకే కేటాయించింది.160 కి పైగా కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో 50 శాతం పదవులు మహిళలకే ఇస్తున్నారు. దేవాలయాల కమిటీలోనూ ఇదే పరిస్థితి.ఒక్కో కమిటీలో చైర్మన్,డైరెక్టర్లు కలిపి 10 మందికి తగ్గకుండా ఉంటారు. దీంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలకు పదవులు దక్కనున్నాయి. ఇక స్థానిక సంస్థలలోనూ మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. దీంతో 50 శాతం వరకు పదవులు వారికే లభించనున్నాయి.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటి తదితర బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో అన్నింటిలోనూ 50 శాతం మహిళలకు కేటాయించి సరికొత్త పాలనకు తెరతీసింది.జిల్లాలో 30,93,953 మంది జనాభా ఉండగా ఇందులో 15,45,828 మంది పురుషులు కాగా 15,48,125 మంది మహిళలు ఉన్నారు.వీరిలో 9.50 లక్షలమంది చదువుకున్న వారు ఉన్నారు. ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేయడంతో వారికి ఉద్యోగాలతోపాటు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత లభించనుంది. తద్వారా మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందనున్నారు.
ఉద్యోగ విప్లవం
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగవిప్లవం సృష్టిస్తోంది. గత పాలకులు నిరుద్యోగులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమానికి కృషి చేయలేదు. నిరుద్యోగుల కష్టాలను కళ్లారా చూసిన ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం, అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయం.
– కె.పద్మజ, సంగసముద్రం, గోపవరం
మహిళల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామవలంటీర్, గ్రామ సెక్రటేరియట్ పోస్టులతో పాటు నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయం. గత పాలకులు మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాననడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం.
– పి.కృష్ణవేణి, బద్వేలు
హామీ నిలబెట్టుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. డిగ్రీలు చదివి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో నేనున్నానంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– పి.శశికళ, 13వ వార్డు వలంటీర్, బద్వేలు
Comments
Please login to add a commentAdd a comment