పేదల ‘ఉపాధి’పై రోడ్డు రోలర్ | Poor 'Employment' on the road roller | Sakshi
Sakshi News home page

పేదల ‘ఉపాధి’పై రోడ్డు రోలర్

Published Sat, Mar 12 2016 3:12 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

పేదల ‘ఉపాధి’పై రోడ్డు రోలర్ - Sakshi

పేదల ‘ఉపాధి’పై రోడ్డు రోలర్

♦ ఒకవైపు దుబారా..మరోవైపు పేదల ఉపాధికి గండి
♦ ఉపాధి హామీ నిధులు భారీ ఎత్తున మళ్లింపు
♦ పేదలకు పనులు కల్పించకుండా..అధికార పార్టీ నేతల పరం
♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,458 కోట్లు మళ్లింపు
♦ 2016-17లో ఉపాధి కింద రూ.4,764 కోట్ల ఖర్చుకు నిర్ణయం
♦ ఏకంగా రూ.3,500 కోట్లు మళ్లింపునకు కార్యాచరణ
 
 
 సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్ఫూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పేదల జీవనోపాధికి ఉపయోగపడేలా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను.. నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీయెత్తున ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు, ప్రచారార్భాటాలకు వందలాది కోట్లు దుబారా చేస్తున్న ప్రభుత్వం.. దుబారా తగ్గించుకుని, ఆ నిధులతో పథకాలు చేపట్టాల్సిందిపోయి, నిధుల మళ్లింపుతో నిరుపేద కూలీల ఉపాధికి గండి కొడుతోంది.

మరోవైపు ఆయా పనులను దక్కించుకుంటున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు యంత్రాలను వినియోగించి పనులు చేయిస్తూ కూలీల పేరుతో నిధులు కైంకర్యం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,458 కోట్లను ఇతర కార్యక్రమాలకు మళ్లించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఏకంగా రూ. 3,500 కోట్లను మళ్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఒకపక్క రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 359 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో గ్రామాల్లో కూలీలకు వ్యవసాయ పనులు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఆ పథకం నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించడంతో ఉపాధి పనులకు నిధులు లేకుండా పోతున్నాయి. దీంతో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉపాధి నిధుల మళ్లింపునకు మొగ్గు చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 నిరుపేదలకు దూరంగా ఉపాధి
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 20.62 లక్షల కుటుంబాల్లో దాదాపు 50 లక్షల మంది కూలీలుగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్నారు. అయితే అందులో కేవలం 14 లక్షల మందికే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించారు. ఇక ఎస్టీ సామాజికవర్గంలో 7.06 లక్షల కుటుంబాలకు చెందిన 15 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకోగా.. అందులో కేవలం 6.81 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పనికల్పించింది. మొత్తంగా రాష్ట్రంలో 83,29,881 కుటుంబాల్లోని 1.76 కోట్ల మంది ఉపాధి కూలీలుగా నమోదు చేసుకోగా.. ప్రభుత్వం కేవలం 58 లక్షల మందికే పనులు కల్పిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్రంలో కేవలం కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేయడం కారణంగా నిరుపేద కూలీలకు పనులు అందకుండా పోతున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. భూమి లేని నిరుపేదలకు పని కల్పించే పనులకు అనుమతివ్వడం దాదాపుగా తగ్గిపోవడంతో నిరుపేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం గగనంగా మారిందని అంటున్నారు.  

 సబ్ ప్లాన్‌ల నిధుల వ్యయంపై నిర్లక్ష్యం
 ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఉప ప్రణాళికల వ్యయం తీరే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికల్లో ఏకంగా రూ.5,500 కోట్లు ఖర్చుకు నోచుకోకుండా మురిగిపోయాయి. ఎస్సీ ఉప ప్రణాళిక కింద బడ్జెట్‌లో రూ.5,800 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.4,045 కోట్లకు సవరించడం గమనార్హం. అంటే రూ. 1,755 కోట్లకు కోతపడినట్లైంది. అలాగే ఎస్టీ ఉప ప్రణాళిక కింద బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.1234 కోట్లే వ్యయం చేశారు. అంటే రూ.766 కోట్లు ఖర్చు కాలేదన్నమాట. ఇక బీసీ ఉప ప్రణాళికకు రూ.6,644 కోట్లు కేటాయింగా ఇప్పటివరకు సుమారు రూ.3,000 కోట్లు మాత్రమే వ్యయం చేశారు.
 
 కూలీల పేరుతో స్వాహా చేస్తున్న టీడీపీ నేతలు
 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సీసీ రోడ్ల నిమిత్తం రూ.500 కోట్ల ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం మళ్లించింది. అదే సమయంలో ఈ పనులను నామినేషన్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలకు అప్పగిస్తోంది. వారు అరకొర పనులు చేసి జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు సీసీ రోడ్ల పనుల్లో కూలీలకు ఉపాధి కల్పించే అవకాశం దాదాపుగా ఉండకపోవడం గమనార్హం. ఇక నీరు-చెట్టు కార్యక్రమానికి సైతం ప్రభుత్వం ఉపాధి నిధులు మళ్లిస్తోంది. ఆ పనులను కూడా టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలు, సాగునీటి సంఘాలకు అప్పగించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నీరు-చెట్టు పనుల కోసం ఉపాధి హామీ నుంచి ఏకంగా రూ.1,958 కోట్లను మళ్లించారు. 2015-16లో ఇప్పటివరకు ఉపాధి హామీ కింద రూ.3,527 కోట్లను వ్యయం చేయగా అందులో 60 శాతం నిధులను నీరు-చెట్టుకు మళ్లించడం గమనార్హం. చెరువుల్లో పూడికతీతకు టీడీపీ నేతలు యంత్రాలను వినియోగిస్తూ కూలీల పేరిట నిధులు స్వాహా చేస్తుండగా.. కూలీలకే వ్యయం చేస్తున్నామంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. 2016-17లో ఉపాధి హామీ కింద రూ.4,764 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో ఏకంగా రూ.3,500 కోట్లు నీరు-చెట్టు (రూ.2,500 కోట్లు), సీసీ రోడ్లకు (రూ.1,000 కోట్లు) మళ్లించాలని నిర్ణయించింది.
 
 150 పనిదినాలు కల్పించిన వైఎస్
 ఉపాధి హామీ కింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 100 పనిదినాలకే అవకాశం ఉండేది. అయితే దేశంలోనే తొలిసారిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో.. 100 పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకు అదనంగా మరో 50 పనిదినాలకు అవకాశం కల్పించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే నిధులు ఖర్చు పెట్టారు. తర్వాత అనేక రాష్ట్రాలు వైఎస్ విధానాన్ని అనుసరించి 150 వరకు పనిదినాలు సొంత నిధులతో కల్పిస్తున్నాయి. తాజాగా కేంద్రం కూడా ఈ ఏడాది నుంచి కరువు ప్రాంతాల్లో 100 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనపు పనిదినాలకు అవకాశం కల్పించడం గమనార్హం. ఈ పథకంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విషయం గుర్తించిన వైఎస్ ప్రభుత్వం.. దేశంలోనే మొదటిసారిగా డీబీటీ (అర్హులకే నేరుగా నిధులు అందేలా) విధానాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తం చేసేందుకు కేంద్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement