సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు.
తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది.
అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు.
ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు
కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు..
కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్‌మెంట్‌లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్‌లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్‌మేట్స్ వేధించడం ప్రారంభించారు.
దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.
సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది
సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్‌నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్‌లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా.
ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం
విజయగాథలతో స్ఫూర్తి పొంది..
కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్‌జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్‌పాల్‌ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది.
తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది.
చిన్నచూపు పోవాలి..
నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్‌లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి.
– నక్కా సింధు
Comments
Please login to add a commentAdd a comment