స్వయం ఉపాధిలో రాణించాలి
స్వయం ఉపాధిలో రాణించాలి
Published Mon, Sep 19 2016 11:20 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
–మహిళలకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపు
– ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, రుణ మంజూరు పత్రాల పంపిణీ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వృత్తి విద్యలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. ఎన్‌బీసీఎఫ్‌డీసీ సౌజన్యంతో, అపిట్కో ఆధ్వర్యంలో నగరంలోని మురికివాడలకు చెందిన వంద మంది మహిళలకు ఆధునిక దుస్తుల తయారీలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. విజయవంతంగా ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్‌లో సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుక అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో సాధించిన నైపుణాన్ని వస్తువు తయారీలో చూపించాలన్నారు. అలాగే మార్కెటింగ్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తన వంతుగా మొదటి దశలో ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పారు.
కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఎంపీ చొరవతో ముస్లిం మహిళలు ఇంట్లోనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. మహిళలు ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నేర్చుకున్న అంశంపై ఉత్తమ వర్క్‌బుక్‌లు తయారు చేసిన ఇద్దరు మహిళలకు హఫీజ్‌ఖాన్ ట్రస్టు ద్వారా నగదు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందిన మహిళలను వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు శిక్షణ పొందిన ఒక్కో మహిళకు రూ. 25 వేల చొప్పున ముద్ర రుణాల మంజూరు పత్రాలను ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమానికి అపిట్కో ఇన్‌చార్జి మోహన్‌రాజు అధ్యక్షత వహించగా, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, నాయకులు డి.కె.రాజశేఖర్, ఎస్.ఎ.అహ్మద్, పి.వి.రాఘవ, సఫియా ఖాతూన్, అన్వర్‌బాషా, కేడీసీసీ బ్యాంక్ డైరక్టర్ లోక్‌నాథ్ యాదవ్, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement