
కొన్ని బిరుదులు కోరుకోకపోయినా వస్తాయి. అనురాధరావు(Anuradha Rao)కు ‘డీర్ ఉమన్’ బిరుదు అలా వచ్చిందే. ‘జింక కనిపిస్తే కచ్చితంగా వేటాడాల్సిందే’ అన్నట్లుగా ఉండే ఆ దీవుల ప్రజలలో మార్పు తెచ్చింది అనురాధ. ఆమెకు జింకలు జంతువులు కాదు. కుటుంబ సభ్యులు. వాటితో ఆడుతుంది,పాడుతుంది. కబుర్లు చెబుతుంది. మేత నుంచి సంరక్షణ వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ఆమె డీర్ ఉమెన్.
అండమాన్ నికోబార్ దీవులలో ఉంటున్న అనురాధరావుకు జింకలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ విశిష్ఠ అనుబంధమే ఆమెను ‘డీర్ ఉమెన్’(Deer Woman) అని పిలుచుకునేలా చేసింది. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు అనురాధ పూర్వీకుల్ని అండమాన్‌కు బందీలుగా తీసుకెళ్లారు. ఈ ద్వీపంలో ఆమె నాల్గవ తరం నివాసి.
‘చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. బాల్యం నుంచి జింకలు అంటే ఇష్టం. అవి మా కుటుంబ సభ్యులలాగే భావించేదాన్ని. ఈ ద్వీపంలోని జింకలతో నాకు మంచి అనుబంధం ఉంది’ అంటుంది అనురాధ. ఆహారం ఇవ్వడం నుంచి సంరక్షణ వరకు జింకల పట్ల ఆమె ఎంతో చొరవ చూపుతుంది. జింకల గురించి ఆమె చూపుతున్న ప్రేమ మనుషులు, జంతువుల మధ్య పరస్పర నమ్మకాన్ని నెలకొల్పేలా ఉంది.
‘ఒకప్పుడు మనుషులను చూడగానే జింకలు భయపడిపారిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాటి నమ్మకాన్ని చూరగొనడానికి చాలా ఓపికగా పనిచేశాను. వాటితో ఎంతో సమయం గడిపాను. వాటికి దగ్గరై వాటి మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నాను’ అంటుంది అనురాధరావు. జింకల సంక్షేమం పట్ల ఆమె అంకితభావం ద్వీపంపై బలమైన ప్రభావాన్ని చూపించింది. జంతువుల పట్ల దయగల ద్వీపంగా అండమాన్‌ను మార్చివేసింది.
Comments
Please login to add a commentAdd a comment