నిశ్శబ్దాన్ని ఛేదించారు! | Self employment in Kamareddy: HIV victims | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దాన్ని ఛేదించారు!

Published Sun, Dec 1 2024 6:08 AM | Last Updated on Sun, Dec 1 2024 6:08 AM

Self employment in Kamareddy: HIV victims

స్వశక్తితో నిలబడుతున్న హెచ్‌ఐవీ బాధితులు 

సంఘాలు ఏర్పాటు చేసుకొని పరస్పర సహకారం 

కామారెడ్డిలో ‘స్వయంకృషి’.. నిజామాబాద్‌లో ‘విజేత’ 

నెలనెలా రూ.100 చొప్పున పొదుపు 

సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం 

సహకారం అందిస్తున్న ‘వర్డ్‌’స్వచ్ఛంద సంస్థ  

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లంతా కాలం కాటేసిన అభాగ్యులు.. చేయని తప్పులకు సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న బాధితులు.. నిత్యం దేహంలోని శత్రువుతోపాటు సమాజంతోనూ పోరాడుతున్న ధీరులు. కుంగిపోతే సమాజం మరింత తొక్కేస్తుందని గుర్తెరిగి.. ధైర్యంగా తలెత్తుకొని నిలబడే ప్రయత్నం చేస్తూ ఇప్పుడిప్పుడే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు. ఒక్కొక్కరుగా సంఘటితమవుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎయిడ్స్, హెచ్‌ఐవీ బాధితులు కష్టాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.

రెండు జిల్లాల్లో సొసైటీలు...
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులు నిశ్శబ్దాన్ని ఛేదించారు. మండలాలవారీగా సంఘాలుగా ఏర్పడుతున్నారు. జిల్లా స్థాయిలో సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకుని నెలనెలా కొంత డబ్బు పొదుపు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ‘వర్డ్‌’అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ‘స్వయం కృషి’పేరుతో, నిజామాబాద్‌లో ‘విజేత’పేరుతో 2021 సంవత్సరంలో మ్యూచ్‌వల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (మాక్స్‌)లు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో సభ్యత్వ రుసుముగా రూ.50తోపాటు రూ.100 చెల్లించి రూ.10 ముఖ విలువగల 10 షేర్లు కొని సభ్యులుగా చేరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని స్వయంకృషి సంఘంలో 1,393 మంది సభ్యులు చేరగా, 63 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,330 మంది సభ్యులున్నారు. నిజామాబాద్‌ విజేత సంఘంలో 1,169 మంది సభ్యులకుగాను 82 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,087 మంది సభ్యులున్నారు.  

ప్రతినెలా సమావేశం.. 
 ఈ సంఘాల్లోని సభ్యులంతా నెలకోసారి మండల స్థాయిలో నిర్వహించు కునే సమావేశంలో కలుస్తారు. ఆ సమయంలో అందరూ తలా రూ.100 చొప్పున సంఘంలో జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు జమ చేసిన సొమ్ము ప్రస్తుతం స్వయంకృషి సొసైటీలో రూ.8.55 లక్షలకు, విజే త సొసైటీలో రూ.8.44 లక్షలకు చేరింది. ఈ సొసైటీలు ఏర్పా టు చేసి హెచ్‌ఐవీ బాధితులను చైతన్యపరుస్తున్న వర్డ్‌ స్వచ్ఛ ంద సంస్థ ఒక్కో సొసైటీలో రూ.2.50 లక్షల చొప్పున కార్పస్‌ ఫండ్‌ను ముందుగానే జమ చేసింది. దీంతో ఆయా సంఘాల్లో ఇప్పుడు రూ.10 లక్షలకు పైగానే డబ్బు జమయ్యింది.  

ప్రభుత్వ పథకాలు పొందుతూ..
ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌ను తీసుకోవడంతోపాటు వారికి కావలసిన మందులు, వైద్య సేవలు పొందడానికి హెచ్‌ఐవీ బాధితులకు వర్డ్‌ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చాలామంది మంది వివిధ రకాల ప్రభుత్వ పథకాలు పొందారు. ఈ సంఘాల్లోని 12 మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లభించాయి. పది మందికి దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరింది. మిషన్‌ వాత్సల్య ద్వారా హెచ్‌ఐవీతో చనిపోయిన వారి పిల్లలు 27 మందికి నెలనెలా ప్రభుత్వ సాయం అందుతోంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.40 వేల చొప్పున పూర్తి సబ్సిడీపై మేకలు, గొర్రెలను 39 మందికి అందించారు. తొమ్మిది మంది రుణాలు పొంది కిరాణా దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా పది మందికి రూ. 50 వేల చొప్పున సాయం అందింది.

మానసిక స్థైర్యం కలి్పస్తూ... 
ప్రతినెలా బాధితులంతా మండలాలవారీగా ఒక చోట చేరతారు. ఆ సమావేశాల్లో సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం, వారికి కావలసిన వైద్య సాయం అందించడం, మానసిక స్థైర్యం నింపటానికి కౌన్సెలింగ్‌ చేయడం వంటివి కొనసాగిస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు ధైర్యంగా తమతమ పనులు చేసుకుంటున్నారు. హెచ్‌ఐవీ బాధితులం అనే బాధ నుంచి బయటపడి సాధారణంగా ఉండే ప్రయత్నంలో సక్సెస్‌ అవుతున్నారు.

టైలరింగ్‌ చేస్తున్నా: నా భర్త చనిపోయాడు. స్వచ్ఛంద సంస్థ టైలరింగ్‌ నేరి్పంచి మిషన్‌ కూడా అందించింది. నేను బట్టలు కుడుతూ కొడుకును పెంచి పెద్ద చేశాను. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా వచ్చింది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా క్రమంతప్పకుండా మందులు వాడుతూ సంతోషంగా ఉన్నాను.   
– కామారెడ్డికి చెందిన హెచ్‌ఐవీ బాధితురాలు

మేకల పెంపకంతో ఉపాధి..: మేకల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అప్పుడు 4 మేకలు ఉండేవి. ఇప్పు డు మంద తయారైంది. వాటితో జీవనం సాగి స్తున్నాను. మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అందాయి. ఏ ఇబ్బందీ లేదు. నెలనెలా సంఘం మీటింగ్‌కు హాజరవుతున్నా.  – కామారెడ్డి జిల్లాకు చెందిన హెచ్‌ఐవీ బాధితుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement