HIV Victims
-
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
హెచ్ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు. -
మృత్యు ఘోష!
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్‌సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్ (ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా మందులకు రాలేకపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
ఎయిడ్స్ రూటు మారింది!
సాక్షి, సిటీబ్యూరో: ‘పులి రాజా...’ వచ్చే మార్గం మారింది. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కుల ద్వారా ఎయిడ్స్ ఎక్కువగా వ్యాపిస్తుందని చాలా మంది భావిస్తుంటారు కానీ...ప్రస్తుతం ఆయా వర్గాల్లో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పురుషుల్లో హెచ్ఐవీ బాధితులు పెరిగినట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. లైంగిక సంబంధాల ద్వారా వచ్చిన దానికంటే...ఇతర మార్గాల్లో (కలుషిత రక్త మార్పిడి..ఒకరికి వాడిన సిరంజ్‌లు, షేవింగ్ బ్లేడ్లు మరొకరికి వాడటం) ఎయిడ్స్ బారినపడిన వారే అధికంగా ఉన్నట్లు తేలింది. తప్పని చీదరింపులు.. చీత్కారాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్ఐవీ రోగులకు ఆదరణ కరువైంది. చికిత్స కోసం వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఆర్టీ(యాంటి రెట్రల్ వైరల్ సెంటర్) వైద్య సిబ్బంది వారిని సూటి పోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చికిత్సకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తెలంగాణలో 1,80, 937 మంది పేర్లు నమోదు చేసుకోగా, ప్రస్తుతం వీరిలో 90,156 మంది ఆయా ఏఆర్టీ సెంటర్లలో చికిత్సలు పొందుతున్నారు. 71,651 మంది మందులు వాడుతున్నారు. మరో 37,732 మంది చికిత్సకు రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. అవమానాలు, వేధింపులు భరించలేక కొంత మంది ఇతర ఏఆర్టీ సెంటర్లకు బదిలీ చేయించుకుంటున్నారు. బోధనాసుపత్రుల్లో కిట్స్ కొరత బోధనాసుపత్రుల్లో ఎయిడ్స్ కిట్స్ సరఫరా అధ్వానంగా ఉంది. ప్రతి చిన్న వస్తువు రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నాపెద్ద కలిపి ప్రతి రోజు సగటున 200–250 వరకు, గాంధీలో 200పైగా చికిత్సలు జరుగుతుంటాయి. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజు సగటున 25–30, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 60–70 ప్రసవాలు జరుగుతున్నాయి. చికిత్సలకు ముందు రోగ నిర్థారణలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు హెచ్ఐవీ టెస్టు తప్పని సరి. ఆస్పత్రిలో కిట్స్ కొరత వల్ల వాటిని రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.150 వెచ్చిస్తున్నారు. చికిత్సల్లో కీలకమైన సర్జికల్ కిట్స్(సూది, దారం, బ్లేడ్, దూది, గ్లౌజు)లేక పోవడంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500–700 వరకు ఖర్చు అవుతోంది. గర్భిణుల్లో తగ్గుముఖం అక్వైర్డ్ ఇమ్యూనో డెఫీషియన్సీ సిండ్రోమ్(ఎయిడ్స్)నగరంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరంలోని 25 ఐసీటీసీ కేంద్రాల్లో ఇప్పటి వరకు సేకరించిన నమూనాలను పరిశీలిస్తే.. 2004–05లో 16.99 శాతం హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. 2016 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 40395 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయగా, వీరిలో 1024 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34,861 మంది గర్భిణులను పరీక్షించగా, కేవలం 43 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 21587 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 39 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గర్భిణుల్లో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టిందనడానికి ఇదో నిదర్శనం. -
ప్రాణాంతక రోగం.. పట్టించుకోరు.. పాపం
ప్రాణాంతక హెచ్ఐవీ బాధితులు వారు. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం.. చిక్కిశల్యమవుతున్న శరీరం.. సమాజం నుంచి చీదరింపులు.. వెరసి ప్రాణభయంతో నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి ఏఆర్టీ కేంద్రాల్లోనూ నిరాదరణ ఎదురవుతోంది. అక్కరకురాని పెన్షన్లు, అరకొర మందులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక హెచ్ఐవీ సోకిన బాధితులకు చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏఆర్టీ కేంద్రాలకు అవసరమైన మందులు సరఫరా చేయకుండా, పింఛన్లు అందించకుండా మొండిచేయి చూపుతోంది. దీంతో ప్రతినెలా మందుల కోసం ఏఆర్టీ సెంటర్లకు రావడమే పేద బాధితులకు కష్టంగా మారింది. క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను ఉచితంగా ఇస్తున్నా చార్జీలకు డబ్బు లేక ఏఆర్టీ కేంద్రాలకు రాలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు. ఆసరా లేక.. హెచ్ఐవీ వైరస్ సోకినవారు మందుల కోసం ఏఆర్టీ కేంద్రాలకు వెళ్లేందుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన నాటి ప్రభుత్వం 2008వ సంవత్సరంలో వృద్ధులు, వికలాంగులతో పాటు హెచ్ఐవీ బాధితులకు నెలనెలా పింఛన్ మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈ పింఛన్ డబ్బుతోనైనా మందుల కోసం ఏఆర్టీ సెంటర్లకు వస్తారనే సదుద్ధేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఆర్టీ కేంద్రాల్లో మందులు వాడటం మూడు నెలలు పూర్తయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని నిర్ణయించారు. బాధితులు ఏఆర్‌టీలోనే దరఖాస్తు చేసుకునేలా, బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము జమయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. ఆశ నిరాశే.. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 20వేల మంది ఉన్నారు. వారిలో కేవలం 3వేల మంది మాత్రమే పింఛన్లు అందుకుంటున్నారు. పింఛన్ దరఖాస్తులు 10వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వారందరూ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదు. పింఛన్లు తీసుకునే వారిలోనూ కొంతమంది ప్రతినెలా అందడం లేదని చెబుతున్నారు. పింఛన్లు పెంచితే ప్రతినెలా ఆసరాగా ఉంటుందని భావించామని, కానీ, ఇలా నిరాశకు గురిచేస్తారనుకోలేదని వాపోయారు. పర్యవేక్షణ నిల్ హెచ్ఐవీ బాధితులు సక్రమంగా మందులు వాడేలా చూడాల్సిన ప్రోగ్రామ్ ఆఫీసర్లు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల రెగ్యులర్‌గా మందులు వాడే వారి సంఖ్య తగ్గి, మరణాలు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా మందులు వాడని వారిని గుర్తించి, ఏఆర్టీ సెంటర్‌కు తీసుకురావాల్సి∙ఉంది. కానీ, అవేమి పట్టించుకోకపోవడంతో డెత్‌రేట్ పెరిగిందని సమాచారం. మందులూ కొరతే.. మన జిల్లాలో విజయవాడలో రెండు, గుడివాడ, మచిలీపట్నంలో ఒక్కోటి చొప్పున ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో మందుల కొరత ఏర్పడింది. దీంతో నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు 15 రోజులకే ఇస్తున్నారు. దీంతో రెండుసార్లు మందుల కోసం రావడం వల్ల ఖర్చు అదనంగా అవుతోందని బాధితులు చెబుతున్నారు. హెచ్ఐవీ నిర్ధారణ కిట్లకు సైతం కొరత ఏర్పడుతోంది. గర్భిణుల పరిస్థితి దారుణం గర్భం దాల్చినప్పుడు, ప్రసవ సమయంలో హెచ్ఐవీ బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరూ వారికి ప్రసవాలు చేయకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. ఒకప్పుడు వారికి డెలివరీ, సిజేరియన్ చేసేందుకు ప్రత్యేక కిట్లను ఏపీ సాక్స్ అందజేసేది. మూడేళ్లుగా కిట్ల సరఫరా లేక బాధితులే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కిట్‌కు రూ.2వేలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. జిల్లాలో 10వేల మంది హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు అందించాల్సి ఉంది. వారిలో కనీసం ఐదువేల మందికైనా మంజూరు చేయమని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదు. గర్భిణులకు ప్రసవం కిట్లు తొలుత సరఫరా చేశారు. ఇప్పుడు వాటిని ఏపీ శాక్స్ నిలుపుదల చేసింది. – డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పులిరాజా కబళిస్తోంది!
రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)’ భూతం చాప కింద నీరులా మెల్లమెల్లగా కబళిస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతుండగా.. మన రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 12 వేల మందికిపైగా హెచ్ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇక హెచ్ఐవీ ముదిరిపోయి ‘ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్)’ దశకు చేరిన వేలాది మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ బాధితులు 36.70 కోట్లు భారత దేశంలో హెచ్ఐవీ బాధితులు 21.17లక్షలు తెలంగాణలో హెచ్ఐవీ బాధితులు 2.01లక్షలు చికిత్స పొందుతున్న వారు 69,901 చికిత్స పొందుతున్న వారిలో పిల్లలు 2,804 ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు 134 హెచ్ఐవీకి కారణమయ్యే హైరిస్క్ గ్రూపు 1,87,864 సెక్స్ వర్కర్లు,ట్రాన్స్ జెండర్లు 66,588 సమగ్ర అవగాహన, చికిత్స కేంద్రాలు 852 పరీక్షలు,మందుల పంపిణీ కేంద్రాలు 101 చాప కింద నీరులా... హెచ్ఐవీ సోకిన వారిలో చాలా మందికి తగిన చికిత్స అందడం లేదు. తమకు హెచ్ఐవీ ఉన్నట్లు బయటికి తెలిస్తే వెలివేతకు గురవుతామన్న ఆందోళన, హెచ్ఐవీ మందులు అత్యంత ఖరీదు కావడం, పేదరికం, హెచ్ఐవీ సోకినా కొంతకాలం వరకూ గుర్తించకపోవడం వంటి కారణాలతో.. చికిత్స చేసుకునే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో వారి ద్వారా హెచ్ఐవీ మరింత మందికి సోకుతోంది. పదేళ్ల కిందటితో పోల్చితే హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గినా... ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉండడం ఆందోళనకరం. హెచ్ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. చికిత్స అందుతున్నది కొందరికే.. తెలంగాణలో 2,01,167 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు అంచనా. కానీ అందులో 69,901 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఏటా కొత్తగా 12 వేల మంది వరకు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో హెచ్ఐవీ బాధితులకు చికిత్స కేంద్రాలు ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల రూ.వెయ్యి పింఛనుగా అందిస్తోంది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. హెచ్ఐవీ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందుకోసం భారీగా నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏసీఎస్)లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ప్రజల్లో హెచ్ఐవీపై అవగాహన కల్పన, మందుల పంపిణీ, చికిత్స అందిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాప్తికి కారణమయ్యే సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కుల వివరాలను నమోదు చేస్తున్నాయి. ప్రతి రక్త నమూనా పరిశీలన హెచ్ఐవీ వ్యాప్తిలో రక్త మార్పిడి ప్రక్రియ కూడా కీలకంగా మారింది. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రక్తం, బ్లడ్ బ్యాంకులకు చేరుతున్న రక్తం వంటివాటిని ఎవరికైనా ఎక్కించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరీక్షించక పోతుండ డంతో హెచ్ఐవీ సంక్రమిస్తోంది. దీంతో ఇటీవల ప్రతి రక్త నమూనానూ తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేసేలా చర్యలు చేపట్టారు. ఇలా ఏటా సగటున 20 లక్షల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. తెలంగాణలో హెచ్ఐవీ పరిస్థితి.. (2016–17లో) నిర్ధారణ కోసం మొత్తం రక్త పరీక్షలు 19,32,987 ఏసీఎస్ ఆధ్వర్యంలో సేకరించిన నమూనాలు 6,74,324 అవసరార్థం ఇచ్చిన రక్త నమూనాలు 4,05,527 రక్తదానం చేసిన వారి నమూనాలు 2,68,797 హెచ్‌ఐవీగా నిర్ధారించినవి 11,403 గర్భిణుల రక్త నమూనాలు 6,71,925 హెచ్‌ఐవీగా నిర్ధారణ అయినవి 655 పంపిణీ చేసిన కండోమ్‌లు 38,70,276 -
తగ్గిన హెచ్ఐవీ కేసులు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హెచ్ఐవీ కేసుల సంఖ్య 1.14 శాతానికి తగ్గింది. గురువారం ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్లతో పాటు మొత్తం 105 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింకుడ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నారుు. వీటి ద్వారా ఎరుుడ్‌స పాజిటీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సెలింగ్, వ్యక్తిగత కౌన్సెలింగ్‌లను నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 13 ప్రై వేటు ఆస్పత్రుల్లో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్లలో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటీవ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్, సూర్యాపేటలోని ఏఆర్టీ సెంటర్లకు పంపిస్తారు. ఏఆర్టీ సెంటర్లోని వైధ్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలను నిర్వహించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను చేసి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. వేలాది మంది హెచ్ఐవీ పాజిటీవ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సెలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. వలస కార్మికులు, లారీ డ్రైవర్లు అధికంగా ఉండే మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో కేసుల నమోదు అధికంగా ఉంటుంది. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమంతో పాటు నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్చంద సంస్థలు, జిల్లా ఎరుుడ్‌స నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు. హెచ్ఐవీ బాధితులకు పెన్షన్లు జిల్లా వ్యాప్తంగా 1371 మంది హెచ్ఐవీ బాధితులకు పెన్షన్లను అందజేస్తున్నారు. మరో 1200 మందికి పెన్షన్ల కోసం ప్రతిపాదనలను పంపించారు. 1721 మందికి ఉచిత బస్‌పాస్‌లను ప్రభుత్వం అందజేసింది. 2012 నుంచి మమత ప్లస్ 2012 సంవత్సరం నుంచి హెచ్ఐవీ ఉన్న ప్రతి గర్భిణికి మమత ప్లస్ అనే కార్యక్రమం ద్వారా పుట్టే ప్రతి చిన్నారికి హెచ్ఐవీ రాకుండా కొత్తగా మం దులను ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా కేంద్రలోని గడియారం సెంటర్‌నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వరకు ర్యాలీని నిర్వహిస్తారు. ర్యాలీని ఉదయం 9 గంటలకు గడియారం సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభిస్తారు. అనంతరం ఆస్పత్రిలో సమావేశం నిర్వహిస్తారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. నర్సింగ్ విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. -
రోగుల ప్రాణాలు.. గాల్లో దీపాలు!
* ఆంధ్రాలో వైరల్ లోడ్ మిషన్ లేక హెచ్ఐవీ బాధితుల అగచాట్లు * పరీక్షల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిందే * శరీరంలో హెచ్ఐవీ వైరస్ శాతం తెలియక ప్రాణాలు కోల్పోతున్న వైనం సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా హెచ్ఐవీ బాధితుల వైద్య పరీక్షల కోసం ఇక్కట్లు తప్పడం లేదు. వ్యాధి నిర్ధారణ పరికరం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం హైదరాబాదులోనే ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో హెచ్ఐవీ బాధితులు వైద్య పరీక్షల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోలేక.. ఏ మందులు వాడాలో తెలీక పలువురు హెచ్ఐవీ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసరమైన వైద్య పరికరాన్ని ఏర్పాటు చేయటంలో శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు పడుతున్న ఇబ్బందులను పరిశీలిస్తే... రోగులకు వ్యయప్రయాసలు... హెచ్ఐవీ సోకిన బాధితునికి శరీరంలో హె^Œ ఐవీ వైరస్ శాతం ఎంత మేరకు ఉందనే విషయాన్ని వైరల్ లోడ్ మిషన్ ద్వారా తెలుసుకుని అందుకు అవసరమైన మందులను బాధితునికి సూచించాల్సి ఉంటుంది. దీనివల్ల వైరస్ పెరగకుండా నియంత్రణలో ఉండి హెచ్ఐవీ బాధితులకు అవకాశవాద జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా వైరల్ లోడ్ మిషన్ వైద్య పరికరం లేకపోవడంతో హెచ్ఐవీ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈ పరికరం ఉన్నప్పటికీ ఏడాది కాలంగా వీరు కూడా పరీక్షలు చేయకపోవడంతో చెన్నై, ముంబైలలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను వీరు ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరీక్షకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వ్యయం అవుతుండటంతో బాధితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపేద బాధితులు అంత ఖర్చు చేయలేక వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఇష్టానుసారంగా మందులు వాడుతుండటంతో వారిలో వైరస్ పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న బాధితులు... వైరల్ లోడ్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా, గుంటూరు జిల్లాలో 2,500 మంది హెచ్ఐవీ బాధితులు ఎదురు చూస్తున్నారు. ఏఆర్టీ మందులు వాడుతున్న హెచ్ఐవీ బాధితులకు ప్రతి ఆరు నెలలకూ ఒకసారి ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. వైరల్ లోడ్ పరీక్ష అనంతరం ఏఆర్టీ ఫస్ట్ లైన్ మందులు వాడాలా లేక, సెకండ్ లైన్ మందులు వాడాలా అనేది వైద్యులు నిర్ధారించి మందులు ఇస్తారు. అలా నిర్ధారణ జరగకుండా ఇష్టానుసారంగా మందులు వాడటంతో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో హెచ్ఐవీ బాధితులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైరల్ లోడ్ మిషన్ కొనుగోలు చేసి ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని హెచ్ఐవీ బాధితులు కోరుతున్నారు. -
విజృంభిస్తున్న ఎయిడ్స్
* జిల్లాలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు * ఇప్పటివరకు మొత్తం 3,012 మంది మృత్యువాత * అవగాహన కార్యక్రమాలు అంతంతమాత్రమే * బాధితులకు పింఛన్లు అందని వైనం సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ రోగాలున్న వంద మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఆరుగురికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు. అవగాహన లోపం, ఆరోగ్యంపై అశ్రద్ధతోనే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో హెచ్ఐవీ సోకి ఇప్పటి వరకు 3,012 మంది చనిపోయారు. వీరిలో అధిక శాతం 40 లోపు వయసు వారు ఉండటం గమనార్హం. పలు వ్యాపారాలకు చిత్తూరు జిల్లా అనుకూలంగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం కూడా ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్యుతు చెబుతున్నారు. జిల్లాలో ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 324 అభంశుభంతెలియని పిల్లలు దీని బారిన పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. రెండేళ్లనుంచి నిధులు నిల్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం నామమాత్రపు కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. ప్రధాన కూడళ్లలో ఎయిడ్స్ నియంత్రణపై సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఐసీటీసీ అండ్ డీఆర్పీసీయూ కేంద్రాలకు అరకొర నిధులిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రతినెలా ఖర్చుల నిమిత్తం రూ.18,000 ఈ సెంటర్లకు విడుదల చేయాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడం లేదు. దీంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తమకు జీతాలే సరిగా రావడం లేదని ఇంకా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపట్టుతామని ప్రశ్నిస్తున్నారు. పింఛన్లకు దూరం జిల్లాలో సుమారుగా 17,326 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది అధికారికంగా ఏఆర్టీ కేంద్రాల్లో నమోదైన సంఖ్య. వీరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరందరికి పింఛన్లు మంజూరు చేస్తోంది. అయితే గత మూడేళ్లలో పింఛన్ తీసుకున్న వారు ఐదు శాతం కంటే తక్కువే. సమాజం తమను చులకనగా చూస్తుందని రోగులు కూడా పింఛన్లకు దూరంగా ఉంటున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో హెచ్ఐవీ బాధితులకు అందుతున్న పింఛన్లు.. 2013 ఏప్రిల్ వరకు 1,300 2014ఏప్రిల్ వరకు 2,144 2015 ఏప్రిల్ వరకు 2,215 అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం ఎయిడ్స్నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు చెబుతాం. దీనిపై జిల్లా వ్యా ప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ఇలాంటి వ్యాధులను అరికట్టలేం. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, చిత్తూరు -
మందుల్లేవ్.. మళ్లీ రండి
విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గేదలవానిపాలేం గ్రామానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు హెచ్ఐవీ మందుల కోసం జిల్లా కేంద్రాస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రానికి రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు వచ్చాడు. మందులు లేవని సిబ్బంది అతన్ని తిప్పి పంపించారు. నాలుగు సార్లు విజయనగరం వచ్చి వెళ్లడానికి రూ.600 ఖర్చు అయింది.. మందులు మాత్రం దొరకలేదు. ఈ పరిస్థితి నిత్యం హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఏఆర్టీ కేంద్రంలో ఎదురవుతోంది. ప్రభుత్వం మందులు సరఫరా చేయకపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేక మందులు లేవని తిప్పి పంపించేస్తున్నారు. ఇది ఎయిడ్స్ వాధిగ్రస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. జీవితకాలాన్ని పెంచుకోవడానికి అవసరమైన మందులు రెండు నెలలుగా లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. హెచ్ఐవీతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడాలని, లేదంటే రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని పదే పదే చెప్పే ప్రభుత్వం మందుల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మందులు వీరు వాడాలి సిడిఫోర్ కౌంట్ (రోగ నిరోధకశక్తి) 350 కంటే తక్కువగా ఉన్నవారు మందులు వాడాలి. ఏఆర్టీ మందులను వాడటం ఒకసారి ప్రారంభించాక జీవితాంతం వాడాలి. మధ్యలో మానేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యువాత పడే అవకాశం ఉంది. హెచ్ఐవి రోగుల వివరాలు జిల్లాలో 13 వేల మంది హెచ్ఐవీ రోగులున్నారు. వీరిలో 10,493 మంది ఏఆర్టీ కేంద్రంలో నమోదవగా 7634 మంది మందులు తీసుకుంటున్నారు. వీరిలో 263 మంది పిల్లలున్నారు. జిల్లాలో 2071 మంది హెచ్ఐవి రోగులు చనిపోగా వారిలో 42 మంది పిల్లలున్నారు. జెడ్‌ఎల్‌ఎన్-60, ఏబీసీ-3టీసీ, ఎన్వీపీ మందులను పిల్లలకు ఏఆర్టీ కేంద్రంలో అందజేస్తారు. ఇందులో హిమోగ్లోబిన్( హెచ్బి) 9గ్రాముల కంటే తక్కువగా ఉన్నవారికి ఎన్వీపీ, ఏబీసీ-3టీసీ మందులు అందజేస్తారు. తొమ్మిది గ్రాములు, అంతకంటే ఎక్కువగా హెచ్‌బీ ఉన్న వారికి జెడ్‌ఎల్‌ఎన్ -60 మందులను అందజేస్తారు. ఈ మందులను 80 మంది పిల్లలు వరకు వాడేవారు. ప్రస్తుతం వీటిలో జెడ్‌ఎల్‌ఎన్ -60 మందుల కొరత ఏర్పడింది. రెండు నెలలుగా ప్రభుత్వం ఈ మందులను సరఫరా చేయలేదు. జెడ్‌ఎల్‌ఎన్-60 మందు సరఫరా కాలేదు. దీంతో ఏఆర్టీ కేంద్రానికి వచ్చిన వారికి ఫోన్ చేసి రమ్మంటున్నాం. నాలుగు, ఐదు రోజుల్లో మందులు వచ్చే అవకాశం ఉంది. -ఆర్.శంకర్రావు, సీనియర్ వైద్యాధికారి -
హెచ్ఐవీ బాధితుడినీ వదల్లేదు!
వివాహం పేరుతో రాజస్థాన్ ముఠా టోకరా ఓ నిందితుడిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో పంజా విసిరే సైబర్ నేరగాళ్లు చివరకు హెచ్ఐవీ బాధితులనూ వదలకుండా ఆన్లైన్లో వలవేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ రోగి నుంచి రూ.16 లక్షల కాజేసిన రాజస్థాన్ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం నలుగురిలో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ గురువారం తెలిపారు. నగరంలోని పద్మారావునగర్‌కు చెందిన హెచ్ఐవీ సోకిన వ్యక్తి తన భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. మరో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ‘పాజిటివ్షాదీ.కామ్’ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని, తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. అప్పుడు శివానీ శర్మ నుంచి తన ప్రొఫైల్‌కు లైక్ వచ్చింది. సోదరుడు రోహిత్ శర్మ రంగప్రవేశం చేశాడు. సోదరితో మాట్లాడిస్తూనే వివాహం తర్వాత తమ వద్దకే రావాలని హైదరాబాద్‌లో అతనికి గల ఆస్తిపాస్తులు విక్రయించుకు రావాలని కోరారు. బాధితుడు పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిని రూ.16 లక్షలకు విక్రయించాడు. ఈలోపు ఆ నగదు తమ ఖాతాలో జమచేసి, ఢిల్లీకి రావాలని కోరారు. బాధితుడు అలాగే చేయడంతో ఆ నగదును ముఠా స్వాహా చేసింది. ఆ తర్వాత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో వెబ్సైట్ నుంచి ప్రొఫైల్ తీసేయాలని అతణ్ని కోరారు. తనకు ఎలా తొలగించాలో తెలియదనడంతో ముఠా సభ్యులే ప్రొఫైల్ డిలీట్ చేశారు. ఆపై సంప్రదింపులు పూర్తిగా మానేయడంతో పాటు ఫోన్ చేస్తే బెదిరించడం మొదలెట్టారు. దాంతో బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా అది రాజస్థాన్‌లోని కుమ్హార్ ప్రాంతానికి చెందినదని తెలుసుకుని అక్కడకు వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో సీసీఎస్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ డాక్టర్ బి.అనురాధ సిబ్బందితో సాంకేతికంగా దర్యాప్తు చేయించారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించిన ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం కుమ్హార్ వెళ్లి అవధేష్ లవణ్య అనే నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ మోసానికి అతడి సోదరి సీమ సూత్రధారని తేలింది. ఆమె పథకం ప్రకారం తనను రోహిత్ శర్మగా, మరో సోదరుడైన అనిత్ లవణ్యను బంధువుగా, ఇతడి భార్య సుమన్‌ను శివానీ శర్మగా బాధితుడికి ఫోనులో పరిచయం చేసి మోసం చేసినట్లు వెల్లడించాడు. అవధేష్‌ను నగరానికి తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన వారిని పట్టుకోవడంతో పాటు నగదు రికవరీకీ ప్రయత్నాలు ప్రారంభించారు. -
పెళ్లితో ఒక్కటైన హెచ్ఐవీ బాధిత జంట
రిమ్స్ క్యాంపస్: వాళ్లిద్దరూ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకొని తోటి వ్యాధిగ్రస్తులకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించారు. విషయాన్ని తాము చికిత్స పొందుతున్న సీఆర్ఎం సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా వీరి నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. దీంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు సీఆర్ఎం సెంటర్లో చిట్టి, కల్యాణిలు హెచ్ఐవీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాల సభ్యుడు వీరి ప్రేమను అంగీకరించారు. దీంతో మంగళవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వివాహాన్ని సీఆర్ఎం సెంటర్ నిర్వాహకుడు సింతు సూర్యనారాయణ దగ్గర ఉండి జరిపించారు. ఈ సందర్భంగా నవ దంపతులు మాట్లాడుతూ ఓ శిశువుకు జన్మనిచ్చి మా కుటుంబాల్లో ఆనందం నింపాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి వ్యాధి సోకకుండా వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.