హెచ్‌ఐవీ బాధితుడినీ వదల్లేదు!
వివాహం పేరుతో రాజస్థాన్ ముఠా టోకరా
ఓ నిందితుడిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో పంజా విసిరే సైబర్ నేరగాళ్లు చివరకు హెచ్‌ఐవీ బాధితులనూ వదలకుండా ఆన్‌లైన్లో వలవేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ రోగి నుంచి రూ.16 లక్షల కాజేసిన రాజస్థాన్ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం నలుగురిలో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ గురువారం తెలిపారు. నగరంలోని పద్మారావునగర్‌కు చెందిన హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి తన భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. మరో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ‘పాజిటివ్‌షాదీ.కామ్’ అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. అప్పుడు శివానీ శర్మ నుంచి తన ప్రొఫైల్‌కు లైక్ వచ్చింది.
సోదరుడు రోహిత్ శర్మ రంగప్రవేశం చేశాడు. సోదరితో మాట్లాడిస్తూనే వివాహం తర్వాత తమ వద్దకే రావాలని హైదరాబాద్‌లో అతనికి గల ఆస్తిపాస్తులు విక్రయించుకు రావాలని కోరారు. బాధితుడు పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిని రూ.16 లక్షలకు విక్రయించాడు. ఈలోపు ఆ నగదు తమ ఖాతాలో జమచేసి, ఢిల్లీకి రావాలని కోరారు. బాధితుడు అలాగే చేయడంతో ఆ నగదును ముఠా స్వాహా చేసింది. ఆ తర్వాత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో వెబ్‌సైట్ నుంచి ప్రొఫైల్ తీసేయాలని అతణ్ని కోరారు. తనకు ఎలా తొలగించాలో తెలియదనడంతో ముఠా సభ్యులే ప్రొఫైల్ డిలీట్ చేశారు. ఆపై సంప్రదింపులు పూర్తిగా మానేయడంతో పాటు ఫోన్ చేస్తే బెదిరించడం మొదలెట్టారు.
దాంతో బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా అది రాజస్థాన్‌లోని కుమ్హార్ ప్రాంతానికి చెందినదని తెలుసుకుని అక్కడకు వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో సీసీఎస్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ డాక్టర్ బి.అనురాధ సిబ్బందితో సాంకేతికంగా దర్యాప్తు చేయించారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించిన ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం కుమ్హార్ వెళ్లి అవధేష్ లవణ్య అనే నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ మోసానికి అతడి సోదరి సీమ సూత్రధారని తేలింది. ఆమె పథకం ప్రకారం తనను రోహిత్ శర్మగా, మరో సోదరుడైన అనిత్ లవణ్యను బంధువుగా, ఇతడి భార్య సుమన్‌ను శివానీ శర్మగా బాధితుడికి ఫోనులో పరిచయం చేసి మోసం చేసినట్లు వెల్లడించాడు. అవధేష్‌ను నగరానికి తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన వారిని పట్టుకోవడంతో పాటు నగదు రికవరీకీ ప్రయత్నాలు ప్రారంభించారు.