ప్రాణాంతక రోగం.. పట్టించుకోరు.. పాపం | pensions pending on HIV victims | Sakshi
Sakshi News home page

ప్రాణాంతక రోగం.. పట్టించుకోరు.. పాపం

Published Sat, Oct 21 2017 8:16 AM | Last Updated on Sat, Oct 21 2017 8:16 AM

pensions pending on HIV victims

ప్రాణాంతక హెచ్‌ఐవీ బాధితులు వారు. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం.. చిక్కిశల్యమవుతున్న శరీరం.. సమాజం నుంచి చీదరింపులు.. వెరసి ప్రాణభయంతో నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి ఏఆర్‌టీ కేంద్రాల్లోనూ నిరాదరణ ఎదురవుతోంది. అక్కరకురాని పెన్షన్లు,  అరకొర మందులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక హెచ్‌ఐవీ సోకిన బాధితులకు చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏఆర్‌టీ కేంద్రాలకు అవసరమైన మందులు సరఫరా చేయకుండా, పింఛన్లు అందించకుండా మొండిచేయి చూపుతోంది. దీంతో ప్రతినెలా మందుల కోసం ఏఆర్‌టీ సెంటర్‌లకు రావడమే పేద బాధితులకు కష్టంగా మారింది. క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను ఉచితంగా ఇస్తున్నా చార్జీలకు డబ్బు లేక ఏఆర్‌టీ కేంద్రాలకు రాలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు.

ఆసరా లేక..
హెచ్‌ఐవీ వైరస్‌ సోకినవారు మందుల కోసం ఏఆర్‌టీ కేంద్రాలకు వెళ్లేందుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన నాటి ప్రభుత్వం 2008వ సంవత్సరంలో వృద్ధులు, వికలాంగులతో పాటు హెచ్‌ఐవీ బాధితులకు నెలనెలా పింఛన్‌ మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈ పింఛన్‌ డబ్బుతోనైనా మందుల కోసం ఏఆర్‌టీ సెంటర్‌లకు వస్తారనే సదుద్ధేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఆర్‌టీ కేంద్రాల్లో మందులు వాడటం మూడు నెలలు పూర్తయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందించాలని నిర్ణయించారు. బాధితులు ఏఆర్‌టీలోనే దరఖాస్తు చేసుకునేలా, బ్యాంకుల్లో పింఛన్‌ సొమ్ము జమయ్యేలా ఆదేశాలు ఇచ్చారు.

ఆశ నిరాశే..
జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 20వేల మంది ఉన్నారు. వారిలో కేవలం 3వేల మంది మాత్రమే పింఛన్లు అందుకుంటున్నారు. పింఛన్‌ దరఖాస్తులు 10వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వారందరూ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదు. పింఛన్‌లు తీసుకునే వారిలోనూ కొంతమంది ప్రతినెలా అందడం లేదని చెబుతున్నారు. పింఛన్లు పెంచితే ప్రతినెలా ఆసరాగా ఉంటుందని భావించామని, కానీ, ఇలా నిరాశకు గురిచేస్తారనుకోలేదని వాపోయారు.

పర్యవేక్షణ నిల్‌
హెచ్‌ఐవీ బాధితులు సక్రమంగా మందులు వాడేలా చూడాల్సిన ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌లు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల రెగ్యులర్‌గా మందులు వాడే వారి సంఖ్య తగ్గి, మరణాలు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా మందులు వాడని వారిని గుర్తించి, ఏఆర్‌టీ సెంటర్‌కు తీసుకురావాల్సి∙ఉంది. కానీ, అవేమి పట్టించుకోకపోవడంతో డెత్‌రేట్‌ పెరిగిందని సమాచారం.

మందులూ కొరతే..
మన జిల్లాలో విజయవాడలో రెండు, గుడివాడ, మచిలీపట్నంలో ఒక్కోటి చొప్పున ఏఆర్‌టీ సెంటర్‌లు ఉన్నాయి. వాటిలో మందుల కొరత ఏర్పడింది. దీంతో నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు 15 రోజులకే ఇస్తున్నారు. దీంతో రెండుసార్లు మందుల కోసం రావడం వల్ల ఖర్చు అదనంగా అవుతోందని బాధితులు చెబుతున్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ కిట్‌లకు సైతం కొరత ఏర్పడుతోంది.

గర్భిణుల పరిస్థితి దారుణం
గర్భం దాల్చినప్పుడు, ప్రసవ సమయంలో హెచ్‌ఐవీ బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరూ వారికి ప్రసవాలు చేయకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. ఒకప్పుడు వారికి డెలివరీ, సిజేరియన్‌ చేసేందుకు ప్రత్యేక కిట్‌లను ఏపీ సాక్స్‌ అందజేసేది. మూడేళ్లుగా కిట్‌ల సరఫరా లేక బాధితులే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కిట్‌కు రూ.2వేలు వెచ్చించాల్సి వస్తోంది.

ప్రభుత్వాన్ని అడుగుతున్నాం..
జిల్లాలో 10వేల మంది హెచ్‌ఐవీ బాధితులకు పింఛన్లు అందించాల్సి ఉంది. వారిలో కనీసం ఐదువేల మందికైనా మంజూరు చేయమని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదు. గర్భిణులకు ప్రసవం కిట్‌లు తొలుత సరఫరా చేశారు. ఇప్పుడు వాటిని ఏపీ శాక్స్‌ నిలుపుదల చేసింది.
– డాక్టర్‌ టీవీఎస్‌ఎన్‌ శాస్త్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement