Free medicine
-
క్యాన్సర్ బాధితులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంకు చెందిన వంకాయల శ్రీనివాస్ కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవించేవారు. ఆయనకు భార్య సాయిపద్మశ్రీ, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2022 డిసెంబర్లో సాయిపద్మశ్రీ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారినపడింది. దీంతో శ్రీనివాస్ వైద్య పరీక్షలు చేయించగా ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. వైద్యులు చికిత్స కోసం ఏదైనా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే అప్పటికే వ్యాపారంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన శ్రీనివాస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి అండగా నిలిచింది. తెలిసిన వాళ్లు చెప్పడంతో శ్రీనివాస్ తన భార్యను విజయవాడలోని ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రి హెచ్సీజీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే వైద్యులు వైద్య పరీక్షలన్నీ చేసి సాయిపద్మశ్రీకి చికిత్సను అందించారు. ఈ ఏడాది జనవరిలో చికిత్స పూర్తి కావడంతో ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. ఆరోగ్యశ్రీ వల్లే తన భార్య ప్రాణాలతో బయటపడిందని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. .. ఇది ఒక్క శ్రీనివాస్ ఆనందమే కాదు.. రాష్ట్రంలో ఎంతోమంది ఆరోగ్యశ్రీ తమ ప్రాణాలను కాపాడిందని చెబుతున్నారు. గతంలో ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఆశలు వదులుకోవాల్సిందే. రూ.లక్షల ఖర్చయ్యే వైద్యాన్ని తలుచుకుని బాధిత కుటుంబాలు భీతిల్లేవి. ఇల్లు, వాకిలి తెగనమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం క్యాన్సర్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. బాధితులు తమ చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే పనిలేకుండానే మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తోంది. 3.03 లక్షల క్యాన్సర్ బాధితులకు ఉచిత వైద్యం టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పెరిగాయి. లుకేమియా బాధితులకు నిర్వహించే రూ.10 లక్షలు, ఆ పై ఖర్చయ్యే బోన్‌మారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సైతం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి ఈ పథకం కింద 3,03,899 మంది క్యాన్సర్ బాధితులకు 10,43,556 ప్రొసీజర్స్‌లో ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.2,165.74 కోట్లు ఖర్చు చేసింది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. క్యాన్సర్‌కే కాదు.. ఒక్క క్యాన్సర్‌కే కాకుండా హృద్రోగాలు, కిడ్నీ, లివర్.. ఇలా వివిధ రకాల బాధితులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి ఉచితంగా అందుతున్నాయి. టీడీపీ హయాంలో క్యాన్సర్, గుండె జబ్బు, తదితర పెద్ద రోగాల బారినపడితే పేదలు తమ తల తాకట్టు పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితులను మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రొసీజర్లను 3,257కు, వైద్యం ఖర్చు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.12,150 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసింది. ఉచిత వైద్య సేవలే కాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగులకు విశ్రాంత భృతిగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకు 22.88 లక్షల మందికి రూ.1,366 కోట్ల సాయాన్ని అందించింది. ఆరోగ్యశ్రీ ఆదుకుంది.. మాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాం. బస్టాండ్‌లో స్టాల్ నడిపేవాడిని. 2021లో నాకు క్యాన్సర్ సోకింది. కరోనా, ఇతర కారణాలతో వ్యాపారాలు సాగని దుస్థితిలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే పనిలేకుండానే పూర్తి ఉచితంగా చికిత్స లభించింది. మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. – పి.మధుసూదనరావు, విజయవాడ నా ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోంది నేను లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నా. క్యాన్సర్ నిర్ధారణ కావడంతో విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుతోంది. వైద్యం, మందులకు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. – ఎన్.రాంబాబు, విజయవాడ రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు అన్ని రకాల క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు ఉన్నాయి. అర్హులైన నిరుపేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. చికిత్సల భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. – డి.కె. బాలాజీ, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
పిల్లలకు పునర్జన్మ
♦ దుర్గావరప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులది కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామం. ప్రసాద్ గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరి మూడేళ్ల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెజబ్బు ఉంది. మూడేళ్లు పైబడ్డాక ఆపరేషన్ చేయడానికి వీలుంటుందని అప్పట్లో వైద్యులు చెప్పారు. ఇంతలో గత నెలలో తాళ్లరేవులో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. దీంతో ఆదిలక్ష్మి జాహ్నవిని ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకెళ్లింది. వైద్యులు కాకినాడ జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి(డీఈఐసీ) రిఫర్ చేశారు. 25న పాపను డీఈఐసీకి తీసుకుని వెళ్లగా పలు వైద్య పరీక్షల అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వెళ్లాల్సిందిగా సూచించి ప్రయాణ ఖర్చుల కోసం డబ్బులిచ్చారు. 29న పాపను హృదయాలయానికి తీసుకెళ్లగా ఈనెల 2న గుండెకు ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ‘ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వమే నా బిడ్డకు గుండె ఆపరేషన్ చేయించింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుంది. ఆస్పత్రికి రానుపోను డబ్బులు కూడా ఇచ్చారు. పాప విశ్రాంత సమయంలో భృతి కింద వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద కూడా సాయం ఖాతాలో జమవుతుందన్నారు. ఈ మేలును జన్మలో మరువలేం’.. అని ఆదిలక్ష్మి ఎంతో సంతోషంతో అంటోంది. ♦ నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె మధుప్రియకు గ్రహణం మొర్రి సమస్య ఉండటంతో పుట్టిన వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధారించారు. పాప పెద్దయ్యాక ఆపరేషన్ చేయడానికి వీలుంటుందని చెప్పారు. ప్రస్తుతం పాపకు మూడేళ్లు దాటాయి. దీంతో పాప గుండెకు ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించింది. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేలో పాప సమస్యను తల్లిదండ్రులు వివరించారు. దీంతో వైద్య శిబిరానికి హాజరుకావాలని సిబ్బంది చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇక్కడి నుంచి మధుప్రియను హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. ‘మా కోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష పెట్టిందా అనిపిస్తోంది. రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే మాకు ఆపరేషన్ చేయించడం స్థోమతకు మించిన అంశం’.. అని అనిల్ చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ..జాహ్నవి, మధుప్రియల తరహాలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల భవితకు సీఎం జగన్ ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుట్టుకతో న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధిలోపం, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, మేథోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్ సహా ఇతర 30 రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను వైద్యశాఖ గుర్తిస్తోంది. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 7.12 లక్షల పీడియాట్రిక్ ఓపీలు.. గతనెల సెప్టెంబర్ 30 నుంచి మంగళవారం (ఈనెల ఆరో తేదీ) వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12,138 సురక్ష శిబిరాలు నిర్వహించగా ఏకంగా 58.81 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ఇందులో 7,12,639 పీడియాట్రిక్ ఓపీలున్నాయి. వీటిలో 1,247 మంది పుట్టుకతో గుండె జబ్బులు, వినికిడి లోపం, గ్రహణం మొర్రి, ఇతర పెద్ద సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరినీ సురక్ష శిబిరంలోని వైద్యులు డీఐఈసీలకు రిఫర్ చేశారు. మిగిలిన చిన్నచిన్న సమస్యలున్న పిల్లలందరికీ శిబిరాల్లోనే వైద్యంచేసి, ఉచితంగా మందులు అందజేశారు. మరోవైపు.. ప్రయాణ ఛార్జీలతో సహా మెరుగైన వైద్యం కోసం డీఐఈసీలకు రిఫర్ చేసిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్యం చేయిస్తోంది. అంతేకాక.. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500లను కూడా అందిస్తోంది. రూ.లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న వారికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయిస్తున్నారు. ఇలా.. ఆస్పత్రులకు రిఫర్ చేసిన 1,247 మంది చిన్నారుల్లో 646 మందికి ఇప్పటికే చికిత్స పూర్తయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 165 మంది చిన్నారులను రిఫర్ చేయగా వంద శాతం పిల్లలకు చికిత్సలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అండ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల ఆరోగ్యాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వినికిడి లోపం ఉన్న చిన్నారుల రెండు చెవులకు బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. రూ.12 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇక 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నాటికి వినికిడి లోపంతో బాధపడుతున్న 566 మంది చిన్నారులకు రూ.34 కోట్ల నిధులతో ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించింది. గుండె జబ్బులున్న పిల్లల కోసమైతే సీఎం జగన్ తిరుపతిలో ప్రత్యేకంగా హృదయాలయం ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇప్పటివరకు రెండు వేల మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించారు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్యసేవలు.. ఆరోగ్య సురక్ష ద్వారా రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులపై ఎలాంటి ఆర్థిక భారంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోంది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ప్రయాణ ఛార్జీల కింద రూ.500 చొప్పున కూడా అందిస్తోంది. రిఫరల్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది ద్వారా ప్రతి రిఫరల్ కేసును ఆస్పత్రికి తరలిస్తున్నాం. అక్కడ పూర్తి ఉచితంగా పరీక్షలు, చికిత్సలు, మందులు అందించేలా చూస్తున్నాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
జీవితాంతం ఉచిత మందులు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి చేయించుకునే పేద రోగులకు జీవితాంతం ఉచితంగా మందులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించింది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు అవసరమైన మందులకు ఆర్థిక ప్యాకేజీ ప్రక టించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత అవయవ మార్పిడి చేయించుకున్న పేద రోగులు ఏడాది వరకు సర్కారు ఇచ్చే ఉచిత మందులతో ఆరోగ్యంగానే ఉంటున్నారు. ఆ తర్వాత రెండో ఏడాది నుంచి జీవితాంతం మందులు కొనలేని దుస్థితి ఏర్పడుతుంది. మధ్యలోనే మందులు మానేస్తున్నారు. దీంతో అనేకమంది మధ్యలోనే మరణిస్తున్నారు. దీన్ని గ్రహించిన ప్రభుత్వం జీవితాంతం మందులివ్వాలని నిర్ణయించింది. ఆర్థిక ప్యాకేజీలు ఇలా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించిన వివరాల ప్రకారం ప్యాకేజీలో భాగంగా కాడవర్ కాలే య మార్పిడి శస్త్రచికిత్సకు ప్రస్తుతం రూ. 10.50 లక్షలు, మరో రూ.2.64 లక్షలు మొద టి ఏడాది ఇమ్యునో సప్రెసివ్ థెరపీకి 4 విడత లుగా ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది. తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏడాదికి రూ.1.52 లక్షల విలువైన మందులను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లైవ్ లివర్ మార్పిడికి ప్రభుత్వం ప్రస్తుతం రూ.10.88 లక్షల ప్యాకేజీ ఇస్తుంది. మరో రూ.2.62 లక్షలు ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందుల కోసం ఏడాది కాలానికి ఇస్తుంది. తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి రోగికి జీవితాంతం సంవత్సరానికి రూ.1.52 లక్షల విలువైన మందులు ఉచితంగా ఇస్తారు. కాడవర్ గుండె మార్పిడి కోసం ప్యాకేజీలో రూ.11.40 లక్షలు ఇస్తున్నారు. మరో రూ.2.20 లక్షలు కాడవర్ గుండె మార్పిడి కాంప్లికేషన్ ప్యాకేజీకి ఇస్తున్నారు. పోస్ట్ ఇండక్షన్ థెరపీ కోసం రూ.1.50 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందుల కోసం మొదటి ఏడాదికి రూ.1.40 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏటా రూ.1.10 లక్షల విలువైన ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందులు ఇస్తారు. అలాగే మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అవయవ మార్పిడి విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం రూ.1.61 లక్షల ప్యాకేజీ ఇస్తుంది. దీంతోపాటు మొదటి 6 నెలలు నెలకు రూ.21 వేల చొప్పున మొత్తం ఇమ్యునో సప్రెసివ్ థెరపీ కోసం రూ.1.26 లక్షల విలువైన మందులు ఇస్తుంది. ఇకపై 6 నెలల తర్వాత నుంచి జీవితాంతం నెలకు రూ.9,500 చొప్పున ఏడాదికి రూ.1.14 లక్షల విలువైన మందులు ఇస్తారు. అలాగే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసుకున్న రోగులకు తొలి ఏడాది యథావిధిగా మందులు ఉచితంగా ఇస్తారు. రెండో ఏడాది నుంచి రూ.1.10 లక్షల విలువైన మందులు 4 విడతల్లో ఇస్తారు. అలాగే గుండె, ఊపిరితిత్తులు రెండూ మార్పిడి చేశాక తొలి ఏడాది ఉచితంగా మందులు ఇస్తారు. రెండో ఏడాది నుంచి ఇమ్యునో సప్రెసివ్ థెరపీ కింద రూ.1.10 లక్షల విలువైన మందులు ఇస్తారు. అవయవ మార్పిడి చేసిన ఆస్పత్రుల్లోనే మందులను నిర్ణీత ప్యాకేజీ మేరకు అందజేస్తారని ఆరోగ్యశ్రీ వర్గాలు తెలిపాయి. -
ఉచిత వైద్యం.. కొంచెం కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: ఉచిత వైద్యం కొంచెం ఖరీదుగా మారనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)లో మార్పులు, చేర్పులకు సర్కారు నడుం బిగించింది. ఈ పథకం కింద నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రకాల ఆపరేషన్లు తప్ప ఇతర వైద్య సేవలు అందించడంలో ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీని పై సర్కారుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పథకంలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. పథకం సక్రమంగా నడిచేందుకుతాము కొంత నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగైతే అంగీకారం తెలుపుతూ ఒక లేఖ ఇవ్వాలని శాంతికుమారి సూచించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఉద్యోగుల నుంచి ఏడాదికి 330 కోట్లు.. పథకం ప్రారంభ సమయంలో ఉద్యోగులు తమ వాటాగా కొంత చెల్లిస్తామని చెప్పినా ఉచిత సేవలకు సర్కార్ మొగ్గుచూపింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లో కలపకుండా ప్రత్యేకంగా ఈజేహెచ్ఎస్ పథ కాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులను ఈజేహెచ్‌ఎస్‌లో చేర్చా రు. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రు లు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అవి ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. సాధారణ వైద్య సేవలను అందించడంలేదు. కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నాయి. నగదు రహిత సేవలకు వచ్చేవారిని గౌరవప్రదంగా చూడడంలేదన్న విమర్శ లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాము నెలకు రూ.500 చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని రవీందర్‌రెడ్డి అంటున్నారు. ఆ ప్రకారం 5.50 లక్షలమంది ఉద్యోగుల నుంచి ఏడాదికి రూ.330 కోట్లు వసూలు కానుంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వైద్యం కోసం చేస్తున్న ఖర్చు కూడా రూ.300 కోట్లు మాత్రమే. సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలన్నీ సక్రమంగా చేసేట్లయితే మరో రూ.100 కోట్లు ఖర్చు కానుంది. అంటే ప్రభుత్వంపై పడే భారం కేవలం రూ.100 కోట్ల లోపే ఉంటుంది. అయితే, అందరి నుంచి రూ. 500 వసూలు చేస్తారా? లేక కేడర్‌ను బట్టి నిర్ణయిస్తారా? అన్న దానిపై స్పష్టతలేదు. జర్నలిస్టుల నుంచీ భాగస్వామ్యం కోరుతారా లేదా అన్నదానిపైనా స్పష్టత రాలేదు. రెండు, మూడు రోజుల్లో లేఖ ఉద్యోగుల భాగస్వామ్యంపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో మాట్లాడాను. నెలకు రూ.500 భరించడానికి సిద్ధంగా ఉన్నా మని చెప్పాను. భాగస్వామ్యంపై లేఖ ఇవ్వాలని ఆమె కోరారు. రెండు, మూడు రోజుల్లో దానిని ఇస్తాం. –కారెం రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, టీఎన్జీవో -
సిబ్బంది లేక ఇబ్బంది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించే పథకం (ఈహెచ్ఎస్) మొదలై ఏడాది గడిచిపోయినా ఇంకా బాలారిష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ పథకంపై వైద్యారోగ్య శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ఇప్పటికే ఈ పథకం కింద వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకోవడంతో వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు విముఖత వ్యక్తం చేస్తుండగా.. పథకం అమలుకు అవసరమైన సిబ్బంది కూడా లేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈహెచ్ఎస్ మొత్తానికి ఒక ఉన్నతాధికారి, ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ ఒకరు ఆరోగ్యశ్రీ ట్రస్టులో కొన్ని రోజులు, ఈహెచ్ఎస్లో కొన్ని రోజుల చొప్పున పనిచేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగుల వైద్యసేవల ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యసేవలు, శస్త్రచికిత్సలకు అనుమతి, బిల్లుల తయారీ ప్రక్రియ వెంటవెంటనే పూర్తి కావడం లేదు. ఉద్యోగుల ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు, ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలు అంశాలు కూడా ఇబ్బందికరంగా తయారయ్యాయి. పోస్టులు మంజూరు చేసినా.. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్/జర్నలిస్ట్స్ ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్/జీహెచ్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం పర్యవేక్షణ కోసం సీఈవో నేతృత్వంలో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసింది. 15 మంది రెగ్యులర్, 13 మంది ఔట్సోర్సింగ్ పోస్టులను మంజూరు చేసింది. రెగ్యులర్ పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. వైద్యారోగ్య శాఖ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని డిప్యుటేషన్‌పై నియమించాలని స్పష్టం చేసింది. సీఈవో ఒక్కరినే నియమించారు. పథకం మొదలై ఏడాది గడిచిపోయినా ఇతర అధికారులు, సిబ్బందిని నియమించలేదు. అసలు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక ఆ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది మూడు నెలలుగా పెండింగ్‌లోనే ఉండడంతో ఉద్యోగులకు సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతా గందరగోళమే.. కీలకమైన ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ పథకం పర్యవేక్షణ విషయంలో గందరగోళం నెలకొంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ప్రత్యేకంగా సీఈవో ఉన్నారు. ఈహెచ్ఎస్/జేహెచ్‌ఎస్‌కు మరో సీఈవో ఉన్నారు. వీరిద్దరి విధుల విషయంలో ప్రభుత్వపరంగా స్పష్టత లేదని, ఈ కారణంగానే పరిపాలనా ఇబ్బందులు వస్తున్నాయని సచివాలయంలోని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు సీఈవోల స్థాయి అధికారులను నియమించినప్పుడు వారి విధుల విషయంలోనూ స్పష్టత ఇస్తే ఉద్యోగుల సేవల పథకం ప్రారంభించిన ప్రభుత్వ స్ఫూర్తి నెరవేరేదని అభిప్రాయపడుతున్నాయి. ఇక సిబ్బంది లేక మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షల మందికి సేవలు.. ఈహెచ్ఎస్ సేవలు 2016 డిసెంబర్ 17న మొదలయ్యాయి. అదే నెల 19 నుంచి ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం అమల్లోకి వచ్చింది. పథకం కోసం వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ద్వారా ఓపీ సేవలను, వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందిస్తోంది. ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పథకం కింద 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 మంది పెన్షన్‌దారులు, 32,210 జర్నలిస్టులు నమోదయ్యారు. హైదరాబాద్‌లో రెండు చోట్ల, వరంగల్‌లో ఒక వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ మూడు సెంటర్లలో రోజూ సగటున 1,500 మంది సేవలను పొందుతున్నారు. -
ప్రాణాంతక రోగం.. పట్టించుకోరు.. పాపం
ప్రాణాంతక హెచ్ఐవీ బాధితులు వారు. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం.. చిక్కిశల్యమవుతున్న శరీరం.. సమాజం నుంచి చీదరింపులు.. వెరసి ప్రాణభయంతో నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి ఏఆర్టీ కేంద్రాల్లోనూ నిరాదరణ ఎదురవుతోంది. అక్కరకురాని పెన్షన్లు, అరకొర మందులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక హెచ్ఐవీ సోకిన బాధితులకు చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏఆర్టీ కేంద్రాలకు అవసరమైన మందులు సరఫరా చేయకుండా, పింఛన్లు అందించకుండా మొండిచేయి చూపుతోంది. దీంతో ప్రతినెలా మందుల కోసం ఏఆర్టీ సెంటర్లకు రావడమే పేద బాధితులకు కష్టంగా మారింది. క్రమం తప్పకుండా వాడాల్సిన మందులను ఉచితంగా ఇస్తున్నా చార్జీలకు డబ్బు లేక ఏఆర్టీ కేంద్రాలకు రాలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు. ఆసరా లేక.. హెచ్ఐవీ వైరస్ సోకినవారు మందుల కోసం ఏఆర్టీ కేంద్రాలకు వెళ్లేందుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన నాటి ప్రభుత్వం 2008వ సంవత్సరంలో వృద్ధులు, వికలాంగులతో పాటు హెచ్ఐవీ బాధితులకు నెలనెలా పింఛన్ మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈ పింఛన్ డబ్బుతోనైనా మందుల కోసం ఏఆర్టీ సెంటర్లకు వస్తారనే సదుద్ధేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఆర్టీ కేంద్రాల్లో మందులు వాడటం మూడు నెలలు పూర్తయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని నిర్ణయించారు. బాధితులు ఏఆర్‌టీలోనే దరఖాస్తు చేసుకునేలా, బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము జమయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. ఆశ నిరాశే.. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 20వేల మంది ఉన్నారు. వారిలో కేవలం 3వేల మంది మాత్రమే పింఛన్లు అందుకుంటున్నారు. పింఛన్ దరఖాస్తులు 10వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వారందరూ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదు. పింఛన్లు తీసుకునే వారిలోనూ కొంతమంది ప్రతినెలా అందడం లేదని చెబుతున్నారు. పింఛన్లు పెంచితే ప్రతినెలా ఆసరాగా ఉంటుందని భావించామని, కానీ, ఇలా నిరాశకు గురిచేస్తారనుకోలేదని వాపోయారు. పర్యవేక్షణ నిల్ హెచ్ఐవీ బాధితులు సక్రమంగా మందులు వాడేలా చూడాల్సిన ప్రోగ్రామ్ ఆఫీసర్లు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల రెగ్యులర్‌గా మందులు వాడే వారి సంఖ్య తగ్గి, మరణాలు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా మందులు వాడని వారిని గుర్తించి, ఏఆర్టీ సెంటర్‌కు తీసుకురావాల్సి∙ఉంది. కానీ, అవేమి పట్టించుకోకపోవడంతో డెత్‌రేట్ పెరిగిందని సమాచారం. మందులూ కొరతే.. మన జిల్లాలో విజయవాడలో రెండు, గుడివాడ, మచిలీపట్నంలో ఒక్కోటి చొప్పున ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో మందుల కొరత ఏర్పడింది. దీంతో నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు 15 రోజులకే ఇస్తున్నారు. దీంతో రెండుసార్లు మందుల కోసం రావడం వల్ల ఖర్చు అదనంగా అవుతోందని బాధితులు చెబుతున్నారు. హెచ్ఐవీ నిర్ధారణ కిట్లకు సైతం కొరత ఏర్పడుతోంది. గర్భిణుల పరిస్థితి దారుణం గర్భం దాల్చినప్పుడు, ప్రసవ సమయంలో హెచ్ఐవీ బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరూ వారికి ప్రసవాలు చేయకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. ఒకప్పుడు వారికి డెలివరీ, సిజేరియన్ చేసేందుకు ప్రత్యేక కిట్లను ఏపీ సాక్స్ అందజేసేది. మూడేళ్లుగా కిట్ల సరఫరా లేక బాధితులే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కిట్‌కు రూ.2వేలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. జిల్లాలో 10వేల మంది హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు అందించాల్సి ఉంది. వారిలో కనీసం ఐదువేల మందికైనా మంజూరు చేయమని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదు. గర్భిణులకు ప్రసవం కిట్లు తొలుత సరఫరా చేశారు. ఇప్పుడు వాటిని ఏపీ శాక్స్ నిలుపుదల చేసింది. – డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
ఉచిత వైద్యమెక్కడ ?
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న వరాలు నోరూరిస్తున్నాయి. అందనంత ఎత్తులో ఉండి రారమ్మంటున్నాయి. చేతికి మాత్రం అందడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఉచిత వైద్యం. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో అధిక శాతం ప్రజలు కూలీలే. వీరికి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందిస్తానంటూ హామీలు గుప్పించింది. భూములు సమీకరించిన ఏడాది అనంతరం ఉచిత విద్యపై జీవో విడుదల చేసింది. ఉచిత వైద్యం మీద మాత్రం ఎటువంటి సూచనలు చేయలేదు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పింది. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీనే ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంగా మార్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిన వైద్యం ఇప్పుడు ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో రైతులు వ్యవసాయం చేసే సమయంలో 29 గ్రామాల్లో 9 వేల మందికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం అందినట్టు ప్రభుత్వ వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద రాజధాని ప్రాంతంలో ఒక్కరి నాడీ పట్టిన దాఖలాలు మాత్రం లేవు. సరైన వైద్యశాల లేదు తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో సరైన వైద్యశాలే లేదు. ఈ నేపథ్యంలో ఉచిత వైద్యం ఎంతమేర అందుతుందోనని బాధితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉచిత వైద్యం ఎక్కడ చేయించుకోవాలి, ఏ అధికారిని సంప్రదించాలి, అనారోగ్యం వచ్చిన వారి వివరాలు ఎవరు సేకరిస్తారు? ఎవరి ద్వారా చికిత్స పొందవచ్చు అనే అంశాలపై స్పష్టత లేదు. సీఆర్డీఏ అధికారులు కానీ, ఇతర శాఖలవారుగానీ దీనిపై సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెల్లకార్డు ఉన్న వారికి కొన్ని జబ్బులకే వైద్యం అందిస్తున్న ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అనే ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల నుంచి భూములు తీసుకుని ఏడాది కావస్తున్నా నేటికీ విద్య, వైద్యంపై నిర్ణయం తీసుకోలేదు. రాజధాని నిర్మాణంతో రైతుల బిడ్డలు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. 29 గ్రామాల్లో అన్నదాతల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే అరకొర లబ్ధి వారి హాస్టల్ ఖర్చుకు కూడా రాదు. - ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి ఇదంతా ప్రభుత్వ కుట్ర రాజధానిలో ప్రభుత్వ అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు హామీల వర్షం కురిపించింది. భూములు ప్రభుత్వం చేతికి వచ్చిన తరువాత వారి గురించి ఆలోచించడమే మానేసింది. భవిష్యత్తులో భూములిచ్చిన రైతులు రాజధానిలో ఉండకూడదనే లక్ష్యంతో విద్య, వైద్యం అందుబాటులో లేకుండా ప్రభుత్వ కుట్ర పన్నుతోంది. - ఎం రవి, సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ సభ్యుడు -
ఇదీ మా అజెండా..
⇒ తమను గుర్తించేవారికే ఓటు అంటున్న సీనియర్ సిటిజన్స్ ⇒ జగమంత కుటుంబం నాది.. ⇒ ఏకాకి జీవితం నాది.. ⇒ సంసార సాగరం నాదే.. ⇒ సన్యాసం శూన్యం నాదే.. నాదే.. గ్రేటర్ జనాభా 80లక్షలు వృద్ధులు 8 లక్షలు ఓ రచయిత రాసిన గొప్ప పాట. వృద్ధుల కన్నీటి కష్టం. ఇది చాలదూ వృద్ధుల కన్నీటి కష్టాల కడలిని తడిమేందుకు.. ‘ఆసరా’ లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. అందరూ ఉన్నా ఆదరణ లేని జీవితం.. భద్రత లేని బతుకులు.. కుంగదీసే ఒంటరితనం.. ఎటూ వెళ్లలేని దుస్థితి.. ఏమీ చేయలేని నిస్సహాయత.. ఓ వైపు వయోభారం.. మరోవైపు అనారోగ్యం.. ఎన్ననీ చెప్పేది.. ఏమనీ చెప్పేది వయోవృద్ధుల కష్టాలు. గ్రేటర్ ఎన్నికల వేళ తమ సంక్షేమం పట్టని పాలకుల నిర్లక్ష్యంపై సీనియర్ సిటిజన్లు గళమెత్తుతున్నారు. తమ బతుకులకు భరోసానిస్తూ.. సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే పట్టం కడతామంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో, సనత్‌నగర్ నగరంలో సీనియర్ సిటిజన్లకు రక్షణ కరవైంది. సామాజిక భద్రత కొరవడి.. దొంగతనాలు, మోసాలు.. చివరకు హత్యలు సిటీలో నిత్యకృత్యంగా మారింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. అందరూ ఉన్నా వయోవృద్ధులు ఒంటరి జీవితం గడుపుతున్నారు. దీనికి తోడు అనారోగ్యం.. సమాజంలోనూ చులకన భావం, వివక్ష. వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది. భద్రత కరవు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కారణంగా వివిధ ప్రాంతాలకు వలసలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు వేరే చోటుకు వెళ్లినవారి తల్లిదండ్రులు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోతున్నారు. దీంతో వారి రక్షణ గాలిలో దీపంగా మారుతోంది. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ యోగక్షేమాలు చూసుకొనేవారు లేక అనాథల్లా బతుకుతున్నారు. గ్రేటర్లో 8 లక్షలకు పైగా వృద్ధులుంటే.. వీరిలో సగం మంది పరిస్థితి ఇదే. సంక్షేమం.. ఓ ప్రహసనం.. సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టాలూ మొక్కుబడిగానే అమలవుతున్నాయి. వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. వీటిలో కనీస వైద్య సదుపాయాలు కూడా ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో చిన్నవి, పెద్దవి కలిపి 500 వరకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిలో సుమారు 10 వేల మంది వృద్ధులు ఉంటున్నారు. డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుమతితో ఏర్పడిన కొన్ని ఆశ్రమాల్లో మినహా చాలా చోట్ల వృద్ధాశ్రమాల నిర్వహణ కమర్షియల్‌గా మారింది. వారిని ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారే తప్ప.. సేవలు అందించడం లేదు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృద్ధుల సంక్షేమార్థం ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభిస్తే ప్రస్తుతం ఇది నామమాత్రమైంది. వృద్ధుల కోసం ప్రారంభించిన హెల్ప్‌లైన్ (1253) పనిచేయడం లేదు. డేకేర్ సెంటర్లు మెరుగుపర్చాలి సీనియర్ సిటిజన్స్ కోసం నెలకొల్పిన డేకేర్ సెంటర్ల నిర్వహణ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పేపర్ కూడా రావడం లేదు. నిర్వహణకు నెలకు రూ.3 వేల ఇచ్చేవారు. గత ఏప్రిల్ నుంచి నిలిపేశారు. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసే వారికే నా ఓటు. - జేఎస్టీ సాయి, మోడల్ కాలనీ ఉచిత వైద్యం అందజేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. కానీ అనేక రంగాల్లో ఉన్నతమైన సేవలందించిన సీనియర్ సిటిజన్లను మాత్రం విస్మరిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన గౌరవ ం ఇవ్వడం లేదు. వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే నా ఓటు. - రామ్మోహనరావు, సనత్‌నగర్ బస్సుల్లో రెండు సీట్లేనా..? సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో కేవలం రెండే సీట్లు కేటాయించారు. అవి కూడా పూర్తి స్థాయిలో వారికి దక్కడం లేదు. బస్సుల్లో సీట్ల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచాలి. వృద్ధులే కూర్చునేలా చూడాలి. ఇండోర్‌గేమ్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకునే వారికే నా ప్రాధాన్యం. - మురళి, సనత్‌నగర్ రైల్వేలో రాయితీ తగ్గిస్తే ఊరుకోం.. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలో కోత విధించే ఆలోచనను విరమించుకోవాలి. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 50 శాతం రాయితీని మరింత పెంచాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించే పార్టీకే పట్టం కడతాం. - ప్రసాద్‌రావు, సనత్‌నగర్ ఇవి అవసరం.. ►సీనియర్ల కోసం సిటీలో 50 డేకేర్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలి. ►డేకేర్ సెంటర్లలో క్రీడా వస్తువులు, పత్రికలు, ఫిజియో థెరపీ సదుపాయం ఉండాలి. ►వైద్య పరీక్షల నిమిత్తం వృద్ధుల నుంచి స్థానికంగా నమూనాలు సేకరించి లేబోరేటరీలకు తరలించే అవకాశం, అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. ►అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రాయితీపై వైద్య సేవలు చేయాలి. ►పిల్లలు, బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సత్వరమే న్యాయం జరిగేలా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ►నడవలేని వారికి చక్రాల కుర్చీలు, ఇతర పరికరాలు అందజేయాలి. -
వైద్యం.. చోద్యం..!
- ఉద్యోగుల ఆరోగ్యానికి తూట్లు - రిమ్స్‌లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం మొదలు కాని వైనం - వైద్యుల కొరతే కారణమంటున్న అధికారులు - ఆసుపత్రిలో ప్రారంభించాలని ఆర్నెళ్ల కిందటే సర్కారు ఆదేశం - అటకెక్కిన రూ.30 లక్షలకుపైగా విలువైన మందులు - గడువుకు దగ్గరలో ఉండడంతో వృథా కానున్న మందులు ఆదిలాబాద్ : వైద్య కళాశాల ఉన్నచోట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు సర్కారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఇహెచ్ఎస్)ను ప్రారంభించేందుకు ఆర్నెళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించాలి. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నా రిమ్స్ అధికారులు అటువైపు చూడడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు, శస్త్ర చికిత్సలకు సంబంధించి ఉద్యోగులకు రిమ్స్‌లో సేవలందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించి.. అందులో ఔట్ పేషెంట్ సేవలు కూడా అందించాలి. ఇది అదనపు భారం అనుకుంటున్నారో ఏమో గానీ.. పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. వైద్యుల కొరతే దీనికి కారణమని చెబుతున్నారు. కాగా, రూ.30 లక్షల విలువైన మందులు ఆర్నెళ్ల కిందట మంజూరై ఇక్కడకు వచ్చాయి. అవి ఎక్స్పైరీ డేట్ (గడువు తేదీ)కి సమీపంలో ఉండడంతో మందులు వృథా కానున్నాయి. ఉద్యోగులకు ఉచిత సేవలు.. మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలలో అవినీతి, తదితర పరిణామాల దృష్ట్యా వైద్య కళాశాలలు ఉన్నచోట ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలందించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్సకు సంబంధించి రేట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో కార్పొరేట్ వైద్యం ఇంకా కొలిక్కిరాలేదు. కాగా, ప్రతి చిన్న వ్యాధికి కార్పొరేట్ ఆస్పత్రుల దారి పట్టకుండా మొదట అన్ని వసతులు ముఖ్యంగా రెడియోలాజీ, సిటీస్కాన్, ఫిజియోథెరాఫీ వంటి సదుపాయాలు ఉన్న వైద్య కళాశాలల్లోనే ఉద్యోగులకు చికిత్స అందజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఒకవేళ అక్కడ వ్యాధి నయం కాని పక్షంలో కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసే వీలుంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేం దుకు ముందడుగు పడడం లేదు. ఇటీవల డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) నుంచి ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని రిమ్స్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓపీ సేవలు అందించేందుకు ప్రత్యేక గదులు, ఇన్‌పేషెంట్ల కోసం ఏసీ రూమ్‌లు తదితర ఏర్పాట్లు చేయాలి. బీపీ, షుగర్, హృద్రోగ, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతోపాటు ఔషధాలను ఉచితంగా అందించాలి. కీళ్లకు (అర్థోపెడిక్) సంబంధించి శస్త్ర చికిత్సలకు కూడా ఇందులో అవకాశముంది. ఆసుపత్రిలో సాధారణ పేషెంట్లకు ఓపీ ముగిసిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఓపీ సేవలు అందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాలి. ఏవీ లేక అటు కార్పొరేట్ వైద్యానికి, ఇటు సర్కారు వైద్యం ఉద్యోగులకు దిక్కులేని పరిస్థితైంది. మందులు వృథా.. ఉద్యోగులకు ఇహెచ్ఎస్ కింద ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్నెళ్ల కిందటే జిల్లాకు రూ.30 లక్షలకుపైగా విలువైన ఔషధాలను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పంపిణీ చేసింది. ఇందులో 40 రకాల మందులు ఉన్నాయి. అవి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నిల్వ ఉంచారు. అందులో షుగర్ పేషెంట్లకు ఇచ్చే హ్యుమన్ ప్రిమిక్సైడ్ ఇన్సులిన్ పది వేలకుపైగా వాయిలిన్లు ఉన్నాయి. ఇవి బయట ఒక్కో వాయిలిన్ రూ.175కుపైగా ఉంటుంది. బీపీకి సంబంధించిన మందులు లక్షల రూపాయల విలువైనవి ఇందులో ఉన్నాయి. ఇవి కూడా బయట మార్కెట్లో రూ. 100కుపైగా షీట్ లభ్యమవుతోంది. ఈ మందులు 2016-17కు ఎక్స్‌పైయిరీ కానున్నాయి. ఒకవేళ మందుల వాడకం తేదీ గడువు దాటితే లక్షలు విలువ చేసే మెడిసిన్ వృథా కానున్నాయి. ఈ మందులను ప్రత్యేక కోటాలో మంజూరు చేసినందున ఇతర పథకాలకు మళ్లించలేని పరిస్థితి. రిమ్స్‌లో విభాగం ప్రారంభం కాని పక్షంలో మందులు గడువు దాటడం ఖాయం. ఈ విషయమై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రిమ్స్‌లో 95 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 54 మంది మాత్రమే పని చేస్తున్నారని వివరించారు. ప్రత్యేక విభాగం ప్రారంభించాలంటే వైద్యులు అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.