ఇదీ మా అజెండా..
⇒ తమను గుర్తించేవారికే ఓటు అంటున్న సీనియర్ సిటిజన్స్
⇒ జగమంత కుటుంబం నాది..
⇒ ఏకాకి జీవితం నాది..
⇒ సంసార సాగరం నాదే..
⇒ సన్యాసం శూన్యం నాదే.. నాదే..
గ్రేటర్ జనాభా 80లక్షలు
వృద్ధులు 8 లక్షలు
ఓ రచయిత రాసిన గొప్ప పాట. వృద్ధుల కన్నీటి కష్టం. ఇది చాలదూ వృద్ధుల కన్నీటి కష్టాల కడలిని తడిమేందుకు.. ‘ఆసరా’ లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. అందరూ ఉన్నా ఆదరణ లేని జీవితం.. భద్రత లేని బతుకులు.. కుంగదీసే ఒంటరితనం.. ఎటూ వెళ్లలేని దుస్థితి.. ఏమీ చేయలేని నిస్సహాయత.. ఓ వైపు వయోభారం.. మరోవైపు అనారోగ్యం.. ఎన్ననీ చెప్పేది.. ఏమనీ చెప్పేది వయోవృద్ధుల కష్టాలు. గ్రేటర్ ఎన్నికల వేళ తమ సంక్షేమం పట్టని పాలకుల నిర్లక్ష్యంపై సీనియర్ సిటిజన్లు గళమెత్తుతున్నారు. తమ బతుకులకు భరోసానిస్తూ.. సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే పట్టం కడతామంటున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో, సనత్‌నగర్
నగరంలో సీనియర్ సిటిజన్లకు రక్షణ కరవైంది. సామాజిక భద్రత కొరవడి.. దొంగతనాలు, మోసాలు.. చివరకు హత్యలు సిటీలో నిత్యకృత్యంగా మారింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. అందరూ ఉన్నా వయోవృద్ధులు ఒంటరి జీవితం గడుపుతున్నారు. దీనికి తోడు అనారోగ్యం.. సమాజంలోనూ చులకన భావం, వివక్ష. వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోంది.
భద్రత కరవు..
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కారణంగా వివిధ ప్రాంతాలకు వలసలు అనివార్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు వేరే చోటుకు వెళ్లినవారి తల్లిదండ్రులు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోతున్నారు. దీంతో వారి రక్షణ గాలిలో దీపంగా మారుతోంది. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ యోగక్షేమాలు చూసుకొనేవారు లేక అనాథల్లా బతుకుతున్నారు. గ్రేటర్‌లో 8 లక్షలకు పైగా వృద్ధులుంటే.. వీరిలో సగం మంది పరిస్థితి ఇదే.
సంక్షేమం.. ఓ ప్రహసనం..
సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టాలూ మొక్కుబడిగానే అమలవుతున్నాయి. వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. వీటిలో కనీస వైద్య సదుపాయాలు కూడా ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో చిన్నవి, పెద్దవి కలిపి 500 వరకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిలో సుమారు 10 వేల మంది వృద్ధులు ఉంటున్నారు. డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అనుమతితో ఏర్పడిన కొన్ని ఆశ్రమాల్లో మినహా చాలా చోట్ల వృద్ధాశ్రమాల నిర్వహణ కమర్షియల్‌గా మారింది. వారిని ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారే తప్ప.. సేవలు అందించడం లేదు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృద్ధుల సంక్షేమార్థం ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభిస్తే ప్రస్తుతం ఇది నామమాత్రమైంది. వృద్ధుల కోసం ప్రారంభించిన హెల్ప్‌లైన్ (1253) పనిచేయడం లేదు.
డేకేర్ సెంటర్లు మెరుగుపర్చాలి
సీనియర్ సిటిజన్స్ కోసం నెలకొల్పిన డేకేర్ సెంటర్ల నిర్వహణ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పేపర్ కూడా రావడం లేదు. నిర్వహణకు నెలకు రూ.3 వేల ఇచ్చేవారు. గత ఏప్రిల్ నుంచి నిలిపేశారు. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసే వారికే నా ఓటు.
- జేఎస్‌టీ సాయి, మోడల్ కాలనీ
ఉచిత వైద్యం అందజేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. కానీ అనేక రంగాల్లో ఉన్నతమైన సేవలందించిన సీనియర్ సిటిజన్లను మాత్రం విస్మరిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన గౌరవ ం ఇవ్వడం లేదు. వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీకే నా ఓటు. - రామ్మోహనరావు, సనత్‌నగర్
బస్సుల్లో రెండు సీట్లేనా..?
సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో కేవలం రెండే సీట్లు కేటాయించారు. అవి కూడా పూర్తి స్థాయిలో వారికి దక్కడం లేదు. బస్సుల్లో సీట్ల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచాలి. వృద్ధులే కూర్చునేలా చూడాలి. ఇండోర్‌గేమ్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకునే వారికే నా ప్రాధాన్యం. - మురళి, సనత్‌నగర్
రైల్వేలో రాయితీ తగ్గిస్తే ఊరుకోం..
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలో కోత విధించే ఆలోచనను విరమించుకోవాలి. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 50 శాతం రాయితీని మరింత పెంచాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించే పార్టీకే పట్టం కడతాం. - ప్రసాద్‌రావు, సనత్‌నగర్
ఇవి అవసరం..
►సీనియర్ల కోసం సిటీలో 50 డేకేర్ సెంటర్‌లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలి.
►డేకేర్ సెంటర్లలో క్రీడా వస్తువులు, పత్రికలు, ఫిజియో థెరపీ సదుపాయం ఉండాలి.
►వైద్య పరీక్షల నిమిత్తం వృద్ధుల నుంచి స్థానికంగా నమూనాలు సేకరించి లేబోరేటరీలకు తరలించే అవకాశం, అంబులెన్స్ అందుబాటులో ఉండాలి.
►అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రాయితీపై వైద్య సేవలు చేయాలి.
►పిల్లలు, బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సత్వరమే న్యాయం జరిగేలా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
►నడవలేని వారికి చక్రాల కుర్చీలు, ఇతర పరికరాలు అందజేయాలి.