ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సీనియర్ సిటిజన్లపై ప్రభావం..
ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలా మంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వారికి సకాలంలో, తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు.
ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే తొలిసారి
ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధత
దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, అవసరమైన మందుల లభ్యతను పెంచడం, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముర్ము అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment