వైద్యం.. చోద్యం..! | Undermined the health of employees | Sakshi
Sakshi News home page

వైద్యం.. చోద్యం..!

Published Wed, Aug 12 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

వైద్యం.. చోద్యం..!

వైద్యం.. చోద్యం..!

- ఉద్యోగుల ఆరోగ్యానికి తూట్లు  
- రిమ్స్‌లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం మొదలు కాని వైనం
- వైద్యుల కొరతే కారణమంటున్న అధికారులు  
- ఆసుపత్రిలో ప్రారంభించాలని ఆర్నెళ్ల కిందటే సర్కారు ఆదేశం
- అటకెక్కిన రూ.30 లక్షలకుపైగా విలువైన మందులు  
- గడువుకు దగ్గరలో ఉండడంతో వృథా కానున్న మందులు
ఆదిలాబాద్ :
వైద్య కళాశాల ఉన్నచోట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు సర్కారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఇహెచ్‌ఎస్)ను ప్రారంభించేందుకు ఆర్నెళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించాలి. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నా రిమ్స్ అధికారులు అటువైపు చూడడం లేదు.

దీర్ఘకాలిక వ్యాధులు, శస్త్ర చికిత్సలకు సంబంధించి ఉద్యోగులకు రిమ్స్‌లో సేవలందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించి.. అందులో ఔట్ పేషెంట్ సేవలు కూడా అందించాలి. ఇది అదనపు భారం అనుకుంటున్నారో ఏమో గానీ.. పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. వైద్యుల కొరతే దీనికి కారణమని చెబుతున్నారు. కాగా, రూ.30 లక్షల విలువైన మందులు ఆర్నెళ్ల కిందట మంజూరై ఇక్కడకు వచ్చాయి. అవి ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ)కి సమీపంలో ఉండడంతో మందులు వృథా కానున్నాయి.
 
ఉద్యోగులకు ఉచిత సేవలు..
మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలలో అవినీతి, తదితర పరిణామాల దృష్ట్యా వైద్య కళాశాలలు ఉన్నచోట ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలందించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్సకు సంబంధించి రేట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో కార్పొరేట్ వైద్యం ఇంకా కొలిక్కిరాలేదు. కాగా, ప్రతి చిన్న వ్యాధికి కార్పొరేట్ ఆస్పత్రుల దారి పట్టకుండా మొదట అన్ని వసతులు ముఖ్యంగా రెడియోలాజీ, సిటీస్కాన్, ఫిజియోథెరాఫీ వంటి సదుపాయాలు ఉన్న వైద్య కళాశాలల్లోనే ఉద్యోగులకు చికిత్స అందజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.

ఒకవేళ అక్కడ వ్యాధి నయం కాని పక్షంలో కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసే వీలుంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేం దుకు ముందడుగు పడడం లేదు. ఇటీవల డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) నుంచి ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని రిమ్స్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓపీ సేవలు అందించేందుకు ప్రత్యేక గదులు, ఇన్‌పేషెంట్ల కోసం ఏసీ రూమ్‌లు తదితర ఏర్పాట్లు చేయాలి.

బీపీ, షుగర్, హృద్రోగ, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతోపాటు ఔషధాలను ఉచితంగా అందించాలి. కీళ్లకు (అర్థోపెడిక్) సంబంధించి శస్త్ర చికిత్సలకు కూడా ఇందులో అవకాశముంది. ఆసుపత్రిలో సాధారణ  పేషెంట్లకు ఓపీ ముగిసిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఓపీ సేవలు అందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాలి. ఏవీ లేక అటు కార్పొరేట్ వైద్యానికి, ఇటు సర్కారు వైద్యం ఉద్యోగులకు దిక్కులేని పరిస్థితైంది.  
 
మందులు వృథా..
ఉద్యోగులకు ఇహెచ్‌ఎస్ కింద ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్నెళ్ల కిందటే జిల్లాకు రూ.30 లక్షలకుపైగా విలువైన ఔషధాలను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పంపిణీ చేసింది. ఇందులో 40 రకాల మందులు ఉన్నాయి. అవి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నిల్వ ఉంచారు. అందులో షుగర్ పేషెంట్లకు ఇచ్చే హ్యుమన్ ప్రిమిక్సైడ్ ఇన్సులిన్ పది వేలకుపైగా వాయిలిన్‌లు ఉన్నాయి. ఇవి బయట ఒక్కో వాయిలిన్ రూ.175కుపైగా ఉంటుంది. బీపీకి సంబంధించిన మందులు లక్షల రూపాయల విలువైనవి ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా బయట మార్కెట్‌లో రూ. 100కుపైగా షీట్ లభ్యమవుతోంది. ఈ మందులు 2016-17కు ఎక్స్‌పైయిరీ కానున్నాయి. ఒకవేళ మందుల వాడకం తేదీ గడువు దాటితే లక్షలు విలువ చేసే మెడిసిన్ వృథా కానున్నాయి. ఈ మందులను ప్రత్యేక కోటాలో మంజూరు చేసినందున ఇతర పథకాలకు మళ్లించలేని పరిస్థితి. రిమ్స్‌లో విభాగం ప్రారంభం కాని పక్షంలో మందులు గడువు దాటడం ఖాయం.

ఈ విషయమై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రిమ్స్‌లో 95 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 54 మంది మాత్రమే పని చేస్తున్నారని వివరించారు. ప్రత్యేక విభాగం ప్రారంభించాలంటే వైద్యులు అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement