Employees Health Scheme
-
AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీలో ఉద్యోగులకు మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఆదేశించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విఠల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ జె.సుమన్, ఆర్‌ఎంఓలు శోభ, మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పరిధిలోకి తీసుకొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్‌కార్డుల జారీప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ కార్యాలయం మూడురోజుల కిందట ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ రాసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. ఒకేసారి రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి వాటిని భర్తీచేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే ప్రొబేషన్‌ను ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది. -
ఈహెచ్ఎస్ పరిధిలోకి జర్నలిస్టులు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకి జర్నలిస్టులు వస్తారని, ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూని యన్(ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్న లిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్యభవన్‌లో మంత్రితో సమావేశమై హెల్త్‌కార్డుల సమస్యపై వినతిపత్రా న్ని అందించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డులు తిరస్కరణకు గురవుతుండటంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్లో కేటా యించిన నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పథకం అమలును పర్యవేక్షించడానికి మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ ఉన్నారు. ఆపదలో ఉన్న జర్నలిస్టుకు అండగా నిలిచిన హరీశ్ ఆపదలో ఉన్న ఓ పాత్రికేయుడికి మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పుండరీచారి సతీమణి వినోద నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. అయితే ఆశించినస్థాయిలో ఆమెకు చికిత్స జరగడంలేదనే విషయాన్ని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందిస్తూ వినోదకు ఏఎంసీలో బెడ్ కేటాయించి, మెరుగైన చికిత్స అందించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టు సంఘాల నేతలు కె.శ్రీనివాస్‌రెడ్డి, విరాహత్ అలీ తదితరులు -
డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు : ఆరోగ్యశ్రీ ట్రస్ట్
అమరావతి : డబ్బులు కడితేనే చేర్చుకుంటామన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్ అయ్యింది. ఆరోగ్య శ్రీ ఉన్నా మొదట డబ్బులు కట్టాలని తర్వాతే రీయింబర్స్మెంట్ పెట్టుకోవాలని ఆసుపత్రులు ఉద్యోగులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసింది. డబ్బులు తీసుకోవడం, క్యాష్ పేమెంట్ డిమాండ్ చేయడం లాంటివి చేస్తే చర్యలు ఉంటాయని పేర్కొంది. రోగుల వద్ద తీసుకున్న డబ్బులకు 10 రెట్లు ఎక్కువ పెనాల్టీ వేస్తాం అని హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి ఆసుపత్రులను ప్రభుత్వం నుంచి లభించే అన్ని స్కీంల నుంచి మూడు నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి. ఈనెల 13న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 31 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే ఆసుపత్రుల బకాయిలు దాదాపు చెల్లించిన ప్రభుత్వం..మరికొద్ది రోజుల్లో మరో 16 కోట్ల రూపాయల విడుదల చేయనుంది. -
జనవరి 1 నుంచి ప్రీమియం వసూళ్లు
ప్రభుత్వ బీమా పథకంపై సీఎం చంద్రబాబు నిర్ణయం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ బీమా పాలసీకి సంబంధించిన సొమ్ము వసూళ్లను వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 28 తేదీలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పరిధిలో 1.31 కోట్ల కుటుంబాలున్నాయి. మరో 8 లక్షల కుటుంబాలు ఉద్యోగులు, పెన్షనర్ల రూపంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధి లోకి వస్తున్నారు. వీరు కాకుండా మిగిలిన వారికి కూడా.. ఒక్కొక్కరు ఏడాదికి రూ. 1,188 చెల్లిస్తే ఆరోగ్యశ్రీ తరహాలోనే మొత్తం 1,038 జబ్బులకు వైద్యమం దించాలనేది ప్రభుత్వ బీమా విధాన ఉద్దేశం. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1,188 చొప్పున నలుగురికి రూ.4,752 చెల్లించాలి. -
రిఫర్ చేస్తేనే ప్రైవేటు వైద్యం!
* ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మార్పులు * నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఎత్తివేత * జిల్లాకో రిఫరల్ క్లినిక్.. అక్కడ రిఫర్ చేస్తేనే ‘ప్రైవేటు’కు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమూల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి విడదీసి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా మరో మార్పు చేయనుంది. కిందిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక క్లినిక్‌ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తేనే పైస్థాయిలోని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది. క్లినిక్‌లలో సాధ్యం కాని మొండి జబ్బులు ఉంటే వాటిని నిర్ణీత ప్రైవేటు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. బీపీ, షుగర్, జ్వరం, ఇతరత్ర చిన్న జబ్బులకు పైస్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రాకుండా నిరోధించాలని, వాటిపై ఒత్తిడి లేకుండా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఈ నేపథ్యంలో తొలుత జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లినిక్‌లో కనీసం ముగ్గురు వైద్యులను నియమిస్తారు. వారితోపాటు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జిల్లాల్లో మరికొన్ని క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల్లో అందుబాటులోకి? రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛనుదారులు.. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. అలాగే వేలాది మంది జర్నలిస్టులున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య సేవల పథకాన్ని అమలుచేస్తోంది. రిఫరల్ క్లినికల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేశాక జిల్లా స్థాయిలో క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. ఇదంతా అమల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు, జర్నలిస్టులు చిన్న జబ్బుల కోసం సూపర్ స్పెషాలిటీలు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా చికిత్స అనంతరం రిఫరల్ క్లినిక్‌ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగులకు హెల్త్ స్కీం, రీయింబర్స్మెంట్ కూడా
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు హెల్త్ స్కీంతో పాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవో ఒకటి జారీ అయింది. ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు పథకాలు సమాంతరంగా అమలు కానున్నాయి. వాస్తవానికి ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలుచేసిన తర్వాత ఇక రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని తొలుత భావించారు. కానీ, కొన్ని ఆస్పత్రులు ఇంకా ఈహెచ్ఎస్ పథకం పరిధిలోకి రాకపోవడంతో, ఉన్న ఆస్పత్రులలో ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేయడంతో పాటు, అదే సమయంలో రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 వరకే ఈ రెండు అమలులో ఉండేలా ఇంతకుముందు ఉత్తర్వులిచ్చారు. అయితే సమస్య ఇంకా పరిష్కారం కానందున 2016 డిసెంబర్ 31 వరకు రీయింబర్స్‌మెంట్‌ను కూడా కొనసాగించేలా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. -
వైద్యం.. చోద్యం..!
- ఉద్యోగుల ఆరోగ్యానికి తూట్లు - రిమ్స్‌లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం మొదలు కాని వైనం - వైద్యుల కొరతే కారణమంటున్న అధికారులు - ఆసుపత్రిలో ప్రారంభించాలని ఆర్నెళ్ల కిందటే సర్కారు ఆదేశం - అటకెక్కిన రూ.30 లక్షలకుపైగా విలువైన మందులు - గడువుకు దగ్గరలో ఉండడంతో వృథా కానున్న మందులు ఆదిలాబాద్ : వైద్య కళాశాల ఉన్నచోట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించేందుకు సర్కారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఇహెచ్ఎస్)ను ప్రారంభించేందుకు ఆర్నెళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించాలి. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు వచ్చి నెలలు గడుస్తున్నా రిమ్స్ అధికారులు అటువైపు చూడడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు, శస్త్ర చికిత్సలకు సంబంధించి ఉద్యోగులకు రిమ్స్‌లో సేవలందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించి.. అందులో ఔట్ పేషెంట్ సేవలు కూడా అందించాలి. ఇది అదనపు భారం అనుకుంటున్నారో ఏమో గానీ.. పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. వైద్యుల కొరతే దీనికి కారణమని చెబుతున్నారు. కాగా, రూ.30 లక్షల విలువైన మందులు ఆర్నెళ్ల కిందట మంజూరై ఇక్కడకు వచ్చాయి. అవి ఎక్స్పైరీ డేట్ (గడువు తేదీ)కి సమీపంలో ఉండడంతో మందులు వృథా కానున్నాయి. ఉద్యోగులకు ఉచిత సేవలు.. మెడికల్ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలలో అవినీతి, తదితర పరిణామాల దృష్ట్యా వైద్య కళాశాలలు ఉన్నచోట ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలందించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్సకు సంబంధించి రేట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో కార్పొరేట్ వైద్యం ఇంకా కొలిక్కిరాలేదు. కాగా, ప్రతి చిన్న వ్యాధికి కార్పొరేట్ ఆస్పత్రుల దారి పట్టకుండా మొదట అన్ని వసతులు ముఖ్యంగా రెడియోలాజీ, సిటీస్కాన్, ఫిజియోథెరాఫీ వంటి సదుపాయాలు ఉన్న వైద్య కళాశాలల్లోనే ఉద్యోగులకు చికిత్స అందజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఒకవేళ అక్కడ వ్యాధి నయం కాని పక్షంలో కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసే వీలుంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేం దుకు ముందడుగు పడడం లేదు. ఇటీవల డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) నుంచి ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని రిమ్స్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓపీ సేవలు అందించేందుకు ప్రత్యేక గదులు, ఇన్‌పేషెంట్ల కోసం ఏసీ రూమ్‌లు తదితర ఏర్పాట్లు చేయాలి. బీపీ, షుగర్, హృద్రోగ, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతోపాటు ఔషధాలను ఉచితంగా అందించాలి. కీళ్లకు (అర్థోపెడిక్) సంబంధించి శస్త్ర చికిత్సలకు కూడా ఇందులో అవకాశముంది. ఆసుపత్రిలో సాధారణ పేషెంట్లకు ఓపీ ముగిసిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఓపీ సేవలు అందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాలి. ఏవీ లేక అటు కార్పొరేట్ వైద్యానికి, ఇటు సర్కారు వైద్యం ఉద్యోగులకు దిక్కులేని పరిస్థితైంది. మందులు వృథా.. ఉద్యోగులకు ఇహెచ్ఎస్ కింద ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్నెళ్ల కిందటే జిల్లాకు రూ.30 లక్షలకుపైగా విలువైన ఔషధాలను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పంపిణీ చేసింది. ఇందులో 40 రకాల మందులు ఉన్నాయి. అవి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నిల్వ ఉంచారు. అందులో షుగర్ పేషెంట్లకు ఇచ్చే హ్యుమన్ ప్రిమిక్సైడ్ ఇన్సులిన్ పది వేలకుపైగా వాయిలిన్లు ఉన్నాయి. ఇవి బయట ఒక్కో వాయిలిన్ రూ.175కుపైగా ఉంటుంది. బీపీకి సంబంధించిన మందులు లక్షల రూపాయల విలువైనవి ఇందులో ఉన్నాయి. ఇవి కూడా బయట మార్కెట్లో రూ. 100కుపైగా షీట్ లభ్యమవుతోంది. ఈ మందులు 2016-17కు ఎక్స్‌పైయిరీ కానున్నాయి. ఒకవేళ మందుల వాడకం తేదీ గడువు దాటితే లక్షలు విలువ చేసే మెడిసిన్ వృథా కానున్నాయి. ఈ మందులను ప్రత్యేక కోటాలో మంజూరు చేసినందున ఇతర పథకాలకు మళ్లించలేని పరిస్థితి. రిమ్స్‌లో విభాగం ప్రారంభం కాని పక్షంలో మందులు గడువు దాటడం ఖాయం. ఈ విషయమై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రిమ్స్‌లో 95 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 54 మంది మాత్రమే పని చేస్తున్నారని వివరించారు. ప్రత్యేక విభాగం ప్రారంభించాలంటే వైద్యులు అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
హెల్త్ స్కీం ప్రీమియం వసూలు నిలిపివేత
ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన ప్రీమియం వసూలును నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు కూడా రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం, ఉద్యోగుల పంపిణీ తదితర సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ తర్వాత హెల్త్ స్కీం ప్రీమియంను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వసూలు చేయనున్నాయి. ఈనెల నుంచే ఉద్యోగులు, పెన్షనర్ల ప్రీమియం వసూలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల కోరిక మేరకే ప్రీమియం వసూలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
పేదలకు బాధ్యతగా వైద్యం
డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ హితవు తీరు మారాలని ఏరియా ఆస్పత్రి డాక్టర్లకు సూచన ఉద్యోగుల కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నామని వెల్లడి నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మొదటగా సాధారణ విభాగంలో రోగుల కేస్‌షీట్‌ను పరిశీలించారు. కేస్‌షీట్‌లో రోగానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో వైద్యులకు హితవు చెప్పారు. కేస్‌షీట్‌లో ఉన్న కాలమ్‌లలో రోగి వివరాలను నమోదు చేయాలన్నారు. రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకోవద్దన్నారు. ఆస్పత్రికి ప్రధానంగా పేదలే వస్తారు కనుక వైద్యులు ఉద్యోగధర్మంతోపాటు సేవానిరతిని కూడా చూపాలని కోరారు. ఇకనుండి కేస్‌షీట్‌లో రోగి వివరాలు సక్రమంగా ఉండాలని సూచించారు. రోగుల వద్దకు వెళ్లి స్వయంగా పరీక్షించారు. రోగుల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్యసేవలందకపోవడంతో వైద్యులను మందలించారు. వార్డుల్లో రోగులను, ప్రసూతి విభాగాన్ని పరిశీలించారు. ప్రసూతి విభాగంలో ఫ్రిజ్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి రెండు ఫ్రిజ్‌లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయాలని జూనియర్అసిస్టెంట్ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్‌స్కీమ్ ద్వారా జిల్లాలో పలు ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. చింతపల్లిలో 15 పడకలు, అరకులో 15 పడకలు, పాడేరులో 15, నర్సీపట్నంలో 15, అనకాపల్లిలో 25, అగనంపూడి పీహెచ్సీలో 15 ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నర్సీపట్నంలో ఇప్పటికే ఉన్న గదులను రీమోడలింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. చింతపల్లిలో, అరకులో కొత్తగా ప్రత్యేక గదుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు లభిస్తాయన్నారు. ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించడంతో ఆస్పత్రికి రాష్ట్రంలో మంచిపేరు ఉందని చెప్పారు.