రిఫర్ చేస్తేనే ప్రైవేటు వైద్యం!
* ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మార్పులు
* నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఎత్తివేత
* జిల్లాకో రిఫరల్ క్లినిక్.. అక్కడ రిఫర్ చేస్తేనే ‘ప్రైవేటు’కు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమూల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి విడదీసి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా మరో మార్పు చేయనుంది. కిందిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక క్లినిక్‌ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తేనే పైస్థాయిలోని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది.
క్లినిక్‌లలో సాధ్యం కాని మొండి జబ్బులు ఉంటే వాటిని నిర్ణీత ప్రైవేటు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. బీపీ, షుగర్, జ్వరం, ఇతరత్ర చిన్న జబ్బులకు పైస్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రాకుండా నిరోధించాలని, వాటిపై ఒత్తిడి లేకుండా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఈ నేపథ్యంలో తొలుత జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లినిక్‌లో కనీసం ముగ్గురు వైద్యులను నియమిస్తారు. వారితోపాటు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జిల్లాల్లో మరికొన్ని క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు.
ఆరు నెలల్లో అందుబాటులోకి?
రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛనుదారులు.. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. అలాగే వేలాది మంది జర్నలిస్టులున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య సేవల పథకాన్ని అమలుచేస్తోంది. రిఫరల్ క్లినికల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేశాక జిల్లా స్థాయిలో క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. ఇదంతా అమల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు, జర్నలిస్టులు చిన్న జబ్బుల కోసం సూపర్ స్పెషాలిటీలు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా చికిత్స అనంతరం రిఫరల్ క్లినిక్‌ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.