Private medicine
-
రిఫర్ చేస్తేనే ప్రైవేటు వైద్యం!
* ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మార్పులు * నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఎత్తివేత * జిల్లాకో రిఫరల్ క్లినిక్.. అక్కడ రిఫర్ చేస్తేనే ‘ప్రైవేటు’కు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమూల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి విడదీసి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా మరో మార్పు చేయనుంది. కిందిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక క్లినిక్‌ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తేనే పైస్థాయిలోని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది. క్లినిక్‌లలో సాధ్యం కాని మొండి జబ్బులు ఉంటే వాటిని నిర్ణీత ప్రైవేటు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. బీపీ, షుగర్, జ్వరం, ఇతరత్ర చిన్న జబ్బులకు పైస్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రాకుండా నిరోధించాలని, వాటిపై ఒత్తిడి లేకుండా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఈ నేపథ్యంలో తొలుత జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లినిక్‌లో కనీసం ముగ్గురు వైద్యులను నియమిస్తారు. వారితోపాటు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జిల్లాల్లో మరికొన్ని క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల్లో అందుబాటులోకి? రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛనుదారులు.. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. అలాగే వేలాది మంది జర్నలిస్టులున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య సేవల పథకాన్ని అమలుచేస్తోంది. రిఫరల్ క్లినికల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేశాక జిల్లా స్థాయిలో క్లినిక్‌లను ఏర్పాటు చేస్తారు. ఇదంతా అమల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు, జర్నలిస్టులు చిన్న జబ్బుల కోసం సూపర్ స్పెషాలిటీలు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా చికిత్స అనంతరం రిఫరల్ క్లినిక్‌ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. -
వివాదం రేపుతున్న శిశువు మృతి
► తప్పు వైద్యులదే అంటున్న బాధితులు ► మా నిర్లక్ష్యం లేదంటున్న వైద్యులు కల్వకుర్తి రూరల్ : పట్టణంలో ప్రైవేట్ వైద్యం ప్రాణాల మీదికి తెస్తోంది. రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల్లో చిన్నాపెద్ద అందరూ బాధితులవుతున్నారు. కొందరు ప్రైవేటు వైద్యులు వచ్చీరాని వైద్యం చేయడం వల్లే పరిస్థితి జఠిలంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఓ హాస్పిటల్లో ఓ మహిళ గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే కిడ్నీలు దెబ్బతిన్న సంఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లిన సంగతి తెలిసిందే. అది మరువక ముందే బస్టాండ్ సమీపంలోని ఆస్పత్రి వద్ద శిశువు మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి మండలం యంగంపల్లికి చెందిన మహేష్ తనభార్యను పట్టణంలోని జీవన్ తల్లి పిల్లల ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరో నెల నుంచి ఆస్పత్రిలోనే చికిత్స చేయించినట్లు చెప్పారు. ఈనెల 13న నొప్పులు తీవ్రం కావడంతో గ్రామం నుంచి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు మోలిసకు సమస్యను విన్నవించారు. మహేష్ భార్య దీపకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు వారం తర్వాత ఆపరేషన్ చేస్తానని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు మహేష్ విలే కరులకు తెలిపారు. మరుసటి రోజు నొప్పులు తీవ్రం కావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చామని, గర్భంలోనే తమ శిశువు మృతి చెందే ప్రమాదముందని, ఆపరేషన్ చేయాలని కోరగా 23వ తేదీన చేస్తానని చెప్పి నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఎట్టకేలకు 15వ తేదీన ఆపరేషన్ చేయడంతో మగశిశువు జన్మించిందని చెప్పాడు. శిశువు పరిస్థితి బాగోలేదని, వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడని తెలిపాడు. తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చి ఇదేమిటని ప్రశ్నిస్తే తమ తప్పేమీ లేదని సమాధానమిచ్చారని అన్నాడు. ఈ విషయమై సోమవారం లాయర్ ద్వారా ఆస్పత్రికి వివరాల కోసం వస్తే ప్రైవేటు వైద్యులతో పాటు కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఏకమయ్యారని, తమనే తప్పుబడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగరాదనే ఉద్దేశంతో సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పాడు. జన్యు లోపంతోనే... జన్యులోపం వల్లే శిశువు మృతి చెందాడు. తమ తప్పేమీ లేదు. శిశువుకు చర్మం ఊడిపోతుండడంతో పాటు దవడలు సరిగా రాలేదు. చేతులపై దద్దుర్లు వచ్చాయి. ఇందులో మా నిర్లక్ష్యం ఏమీలేదు. - మోలిస, జీవన ఆస్పత్రి వైద్యురాలు -
సమస్యలు తీరేనా?
జిల్లాలోని పేద రోగులకు అనంతపురం సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారు ఈ ఆస్పత్రినే నమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది మంది ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. సిబ్బంది, పడకల కొరత, కరెటు కష్టాలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. చాలా సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశాల్లో చర్చించడం మినహా శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన జరిగే సమావేశంలోనైనా తగిన పరిష్కారం లభిస్తుందేమోనని ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ సమావేశం కోసం పది అంశాలతో అజెండా సిద్ధం చేశారు. కనీసం మూడింటిని నెరవేర్చినా కాస్త ఊరట లభిస్తుందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. కలగా 124 జీఓ నాలుగేళ్ల క్రితం 124 జీఓ విడుదలైంది. అప్పటి నుంచి జీఓ ఆచరణ అంగులం కూడా ముందుకు కదల్లేదు. ఆస్పత్రిలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు జీఓ అమలుతో తీరుతాయని యాజమాన్యం గొంతెత్తి చెబుతున్నా...పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అమలు జరిగితే సిబ్బంది కొరత తీరి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులోని 510 పోస్టుల్లో 134 స్టాఫ్‌నర్సు పోస్టులుకాగా, మిగితావి పారామెడికల్ పోస్టులు. ఈ పోస్టుల భర్తీ జరిగితే పేద ప్రజలకు వైద్యం ఆలస్యం కాదు. అటువంటిది ఈ జీఓ కలగానే మిగులుతోంది. కరెంటు కష్టాలు.. ఇటీవల ఆస్పత్రిని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్యలతో రోగులు అల్లాడిపోతున్నారు. వెంటిలేటర్లపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అంతా ఇంతా కాదు. కరెంటు తరచూ షార్ట సర్క్యూట్ గురికావడంతో ఏకంగా ఆర్థో ఓటీ థియేటర్‌నే మూసేశారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కాలిపోయింది. ఫలితంగా గైనిక్, చిన్నపిల్లల విభాగం, రేడియాలజీ విభాగంలో కరెంటు లేకుండా పోయింది. కరెంటు సరఫరాకి ఆటంకం కల్గకుండా శాశ్వత పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారు. షాట్ సర్క్యూట్‌తో రోగులు ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు. దీనిని ఏవిధంగా గట్టెక్కుతారో చూడాలి. మరమ్మతుకి నోచుకోని టాయిలెట్స్ ఆస్పత్రిలోని నాలుగు వార్డులలో టాయిలెట్స్ మరమ్మతుకు నోచుకోవడం లేదు. 23 మరుగుదొడ్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. దీంతో వాటికి తాళం వేశారు. రోగులు, వారి సహాయకులు సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రికి అధిక సంఖ్యలో పేద వారే వస్తుంటారు. అటువంటిది వారికి కనీస సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. స్వచ్చభారత్ పేరిటి అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ, ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. 500 పడకలు 700 రోగులు ఆస్పత్రిని ప్రధానంగా పీడిస్తున్న సమస్యల్లో పడకల కొరత ఒకటి. 500 పడకల సామర్థ్యం కల్గిన ఆస్పత్రిలో 700 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. వీరికి అడ్మిషన్ ఇస్తున్నారు కానీ మంచాలు మాత్రం చూపడం లేదు. దీంతో చాలా మంది రోగులు కటిక నేలపై పడుకున్న సందర్భాలు కోకొల్లలు. బాలింతలు, గర్భిణీలు నేలపై పడుకుని నానా అవస్థలు పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తే తప్ప రోగుల కష్టాలు తీరవని చెబుతున్నారు. వైద్య సేవల్లో జాప్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్ బాట పడుతున్నారు. ఏదిఏమైనా ఈ హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా...ఆస్పత్రి మెరుగుపడుతుందో లేదో వేచి చూద్దాం. నిద్రమత్తులో ఏపీఎంఎస్‌ఐడీ అధికారులు ఆస్పత్రిలో ఏ పనులు చేయాలన్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులే చేయాలి. అటువంటిది వీరు ఏమాత్రం ముందడుగు వేయడం లేదు. కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన అనేక సందర్భాలున్నా స్పందించడం లేదు. ఊరు బయట తమ కార్యాలయం ఉందని తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఆస్పత్రిని డీఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అలాంటిది ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరి కింది స్థాయి సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం పక్కన ఉన్న టీ కొట్టులో మాత్రం దర్శనమిస్తుంటారు. కరెంటు కాలిపోతోందంటే అటువైపు తొంగి చూడని అధికారులు పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు వస్తున్నారు. ఈ శాఖ నిద్రమత్తులో ఉందని వీరిని మేలుకొలిపేలా జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.