పేదలకు బాధ్యతగా వైద్యం | Responsible for poor healing | Sakshi
Sakshi News home page

పేదలకు బాధ్యతగా వైద్యం

Published Sat, Mar 1 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

పేదలకు బాధ్యతగా వైద్యం

పేదలకు బాధ్యతగా వైద్యం

  •    డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ హితవు
  •      తీరు మారాలని ఏరియా ఆస్పత్రి డాక్టర్లకు సూచన
  •      ఉద్యోగుల కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నామని వెల్లడి
  •  నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మొదటగా సాధారణ విభాగంలో రోగుల కేస్‌షీట్‌ను పరిశీలించారు. కేస్‌షీట్‌లో రోగానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో వైద్యులకు హితవు చెప్పారు. కేస్‌షీట్‌లో ఉన్న కాలమ్‌లలో రోగి వివరాలను నమోదు చేయాలన్నారు.

    రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకోవద్దన్నారు. ఆస్పత్రికి ప్రధానంగా పేదలే వస్తారు కనుక వైద్యులు ఉద్యోగధర్మంతోపాటు సేవానిరతిని కూడా చూపాలని కోరారు. ఇకనుండి కేస్‌షీట్‌లో రోగి వివరాలు సక్రమంగా ఉండాలని సూచించారు. రోగుల వద్దకు వెళ్లి స్వయంగా పరీక్షించారు. రోగుల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వైద్యసేవలందకపోవడంతో వైద్యులను మందలించారు. వార్డుల్లో రోగులను, ప్రసూతి విభాగాన్ని పరిశీలించారు. ప్రసూతి విభాగంలో ఫ్రిజ్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి రెండు ఫ్రిజ్‌లు, ఇన్వర్టర్ కొనుగోలు చేయాలని జూనియర్‌అసిస్టెంట్‌ను ఆదేశించారు.

    అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్‌స్కీమ్ ద్వారా జిల్లాలో పలు ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. చింతపల్లిలో 15 పడకలు, అరకులో 15 పడకలు, పాడేరులో 15, నర్సీపట్నంలో 15, అనకాపల్లిలో 25, అగనంపూడి పీహెచ్‌సీలో 15 ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నర్సీపట్నంలో ఇప్పటికే ఉన్న గదులను రీమోడలింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. చింతపల్లిలో, అరకులో కొత్తగా ప్రత్యేక గదుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు లభిస్తాయన్నారు. ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించడంతో ఆస్పత్రికి రాష్ట్రంలో మంచిపేరు ఉందని చెప్పారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement