చైర్మన్ బాధ్యతలకు ముగింపు
ఆయన స్థానంలో ఎస్‌ఎన్ సుబ్రమణియన్
న్యూఢిల్లీ: ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్‌టీటీఎస్) చైర్మన్‌గా తప్పుకోవాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఈ రెండు సంస్థలకు చైర్మన్‌గా ఎస్‌ఎన్ సుబ్రమణియన్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏఎం నాయక్ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కంపెనీని చురుకైన అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దినట్టు సంస్థ పేర్కొంది.
ఈ నెల 26నాటి ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 28వ ఏజీఎంతో తన బాధ్యతలకు ముగింపు పలకాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారని, దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్‌ను నూతన చైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసినట్టు, ఇది 27 నుంచి అమల్లోకి వస్తుందని ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ప్రకటించింది. కంపెనీ పురోగతికి నాయక్ అందించిన సేవలకు అభినందనలు తెలియజేసింది.
సుబ్రమణియన్ సారథ్యంలో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, కొత్త విజయశిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు నాయక్ ప్రకటించారు. అంతకుముందు ఈ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌గా కొనసాగగా, 2019లో మైండ్‌ట్రీని విలీనం చేసుకున్న అనంతరం ఎల్‌టీఐ మైండ్‌ట్రీగా మారడం తెలిసిందే. మైండ్‌ట్రీని సొంతం చేసుకోవడంలో నాయక్, సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించారు. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎల్‌టీటీఎస్ రెండింటిలోనూ ఎల్‌అండ్‌టీకి మెజారిటీ వాటాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment