చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ
పలు సమస్యలపై గ్రామాల్లో అవగాహన
వాయిస్ ఫర్ వెల్‌ఫేర్ పేరిట సంస్థ స్థాపన
నిజాం కాలేజీ కుర్రోడు సందీప్ సేవా కార్యక్రమాలు
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. రుతుస్రావం సమయంలో హైజీనిటీ.. బాల్య వివాహాలు.. గృహ హింస.. ఇలా ఎన్నో అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి కనీసం బయట మాట్లాడటానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గ్రామగ్రామానికీ, ఇంటింటికీ, ప్రతి స్కూల్‌కీ తిరుగుతూ వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డిగ్రీ కుర్రాడు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరిలా కురోళ్లలా ఫోన్లు, గేమ్స్ ఆడుకుంటూ ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా సామాజిక స్పృహతో సమస్యలపై అవగాహన పెంచుతూ.. పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఓ డిగ్రీ కుర్రాడు. అతడే నిజామ్ కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న సందీప్ నాయక్. అతడు చేస్తున్న పనిని మెచ్చి వందలాది మంది సందీప్ వెనుక నడుస్తున్నారు.
15 ఏళ్ల నుంచే..
ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సమీపంలోని జైతారం తండాలో జన్మించిన సందీప్.. 15 ఏళ్ల వయసు నుంచే సమాజంలోని సమస్యల గురించి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలను సందర్శించేవాడు. ఎన్నో సవాళ్లతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సందీప్.. వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా పాఠశాలల నుంచి పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని గర్తించాడు. ఈ సమస్యకు వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పడ్డాడు. బాల్య వివాహాలు, బాల కారి్మక వ్యవస్థ, లింగ అసమానతలు, గృహ హింస, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత, ప్యాడ్స్ వినియోగం లేకపోవడం వంటి సమస్యలు కారణమని గుర్తించాడు. వీటన్నింటినీ రూపుమాపేందుకు, వాటిపై సమాజంలో అవగాహన పెంచేందుకు గొంతెత్తాలని నడుం బిగించాడు. అనుకున్నదే తడవుగా ‘వాయిస్ ఫర్ వెల్‌ఫేర్’ పేరుతో ఓ ఎన్జీవో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు సమస్యలపై పోరాడుతున్నాడు.
మహిళల గొంతుకగా..
సంస్థ ద్వారా చిన్నారులు, మహిళల గొంతుకగా నిలిచేందుకు కృషి చేస్తున్నాడు. నిజామ్ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న సందీప్ కార్యకలాపాలకు మెచ్చి తోటి విద్యార్థులతో పాటు తెలిసిన వాళ్లు అతడి వెనుక నడుస్తున్నారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలు, చిన్నారులకు ఎన్నో విషయాలపై అవగాహన కలి్పస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లి.. చిన్నారులకు చదువు చెబుతున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే చదువు ఒక్కటే మార్గమని సందీప్
చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment