సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించే పథకం (ఈహెచ్‌ఎస్) మొదలై ఏడాది గడిచిపోయినా ఇంకా బాలారిష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ పథకంపై వైద్యారోగ్య శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ఇప్పటికే ఈ పథకం కింద వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకోవడంతో వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు విముఖత వ్యక్తం చేస్తుండగా.. పథకం అమలుకు అవసరమైన సిబ్బంది కూడా లేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈహెచ్‌ఎస్ మొత్తానికి ఒక ఉన్నతాధికారి, ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ ఒకరు ఆరోగ్యశ్రీ ట్రస్టులో కొన్ని రోజులు, ఈహెచ్‌ఎస్‌లో కొన్ని రోజుల చొప్పున పనిచేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగుల వైద్యసేవల ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యసేవలు, శస్త్రచికిత్సలకు అనుమతి, బిల్లుల తయారీ ప్రక్రియ వెంటవెంటనే పూర్తి కావడం లేదు. ఉద్యోగుల ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు, ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలు అంశాలు కూడా ఇబ్బందికరంగా తయారయ్యాయి.
పోస్టులు మంజూరు చేసినా..
ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్/జర్నలిస్ట్స్ ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్/జీహెచ్‌ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం పర్యవేక్షణ కోసం సీఈవో నేతృత్వంలో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసింది. 15 మంది రెగ్యులర్, 13 మంది ఔట్‌సోర్సింగ్ పోస్టులను మంజూరు చేసింది. రెగ్యులర్ పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. వైద్యారోగ్య శాఖ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని డిప్యుటేషన్‌పై నియమించాలని స్పష్టం చేసింది. సీఈవో ఒక్కరినే నియమించారు. పథకం మొదలై ఏడాది గడిచిపోయినా ఇతర అధికారులు, సిబ్బందిని నియమించలేదు. అసలు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక ఆ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది మూడు నెలలుగా పెండింగ్‌లోనే ఉండడంతో ఉద్యోగులకు సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
అంతా గందరగోళమే..
కీలకమైన ఈహెచ్‌ఎస్/జేహెచ్‌ఎస్ పథకం పర్యవేక్షణ విషయంలో గందరగోళం నెలకొంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ప్రత్యేకంగా సీఈవో ఉన్నారు. ఈహెచ్‌ఎస్/జేహెచ్‌ఎస్‌కు మరో సీఈవో ఉన్నారు. వీరిద్దరి విధుల విషయంలో ప్రభుత్వపరంగా స్పష్టత లేదని, ఈ కారణంగానే పరిపాలనా ఇబ్బందులు వస్తున్నాయని సచివాలయంలోని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు సీఈవోల స్థాయి అధికారులను నియమించినప్పుడు వారి విధుల విషయంలోనూ స్పష్టత ఇస్తే ఉద్యోగుల సేవల పథకం ప్రారంభించిన ప్రభుత్వ స్ఫూర్తి నెరవేరేదని అభిప్రాయపడుతున్నాయి. ఇక సిబ్బంది లేక మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.
లక్షల మందికి సేవలు..
ఈహెచ్‌ఎస్ సేవలు 2016 డిసెంబర్ 17న మొదలయ్యాయి. అదే నెల 19 నుంచి ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందం అమల్లోకి వచ్చింది. పథకం కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ద్వారా ఓపీ సేవలను, వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందిస్తోంది. ఈహెచ్‌ఎస్/జేహెచ్‌ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పథకం కింద 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 మంది పెన్షన్‌దారులు, 32,210 జర్నలిస్టులు నమోదయ్యారు. హైదరాబాద్‌లో రెండు చోట్ల, వరంగల్‌లో ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ మూడు సెంటర్లలో రోజూ సగటున 1,500 మంది సేవలను పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment