
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్యచికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం ఈ ఏడాది జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంటూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రీయింబర్స్‌మెంట్ విధానంతోపాటు ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్) సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 31తోనే మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం గడువు ముగిసింది.
ఈ నేపథ్యంలో 2018 జనవరి 1 నుంచి ఈహెచ్‌ఎస్ ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛనుదారులకు వైద్యసేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈహెచ్‌ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్యసేవల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో రీయింబర్స్‌మెంట్ విధానాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ముగియడంతో తాజాగా మరోసారి పొడిగించింది.