సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. 2017 డిసెంబరు 31తోనే మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం గడువు ముగియగా.. దాని కొనసాగింపుపై వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం 2018 జనవరి నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం ఉండబో దని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల వైద్యసేవల పథకం (ఈహెచ్‌ఎస్) ఆధ్వర్యంలోనే ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్య సేవల ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నాయి.
ఈ లెక్కన వెల్‌నెస్ సెంటర్ల ద్వారానే ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య సేవలు కొనసాగుతాయి. వెల్‌నెస్ సెంటర్లలో ఓపీ సేవలు అందిస్తారు. అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా మెరుగైన చికిత్స అవసరమని గుర్తిస్తే.. ఎంపిక చేసిన ఆస్పత్రులకు పంపుతారు. ఇందులో వీలైనంత వరకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఈహెచ్‌ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్య సేవల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
లక్షలాది మందికి ఇబ్బంది..
రాష్ట్రంలో 8,32,085 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,06,125 పింఛనుదారులు ఈహెచ్‌ఎస్ కింద నమోదయ్యారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు ఈహెచ్‌ఎస్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 200 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. 2018 జనవరి 1 నుంచి వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ఏడాదిగా చెబుతోంది. వాస్తవానికి మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం ముగిసేలోపు రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్‌నెస్ సెంటర్, 2017 ఫిబ్రవరిలో వనస్థలిపురంలో, ఇదే ఏడాది నవంబర్‌లో వరంగల్‌లో మరో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోనూ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసినా.. సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. మొత్తంగా ఈహెచ్‌ఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయకుండానే.. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఉద్యోగుల ‘రీయింబర్స్‌మెంట్’ బంద్!
Published Sun, Jan 21 2018 2:28 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment