
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది మార్చి వరకు ఉద్యోగులు, పింఛన్‌దారుల రీయింబర్స్‌మెంట్ విధానం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల వైద్య చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్ విధానం 2017 డిసెంబర్ 31తో గడువు ముగిసింది.
2018 జనవరి 1 నుంచి ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్) ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛన్‌దారులకు వైద్య సేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో రీయింబర్స్‌మెంట్ విధానాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రీయింబర్స్‌మెంట్ విధానంతోపాటు ఈహెచ్‌ఎస్ కూడా సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వెల్‌నెస్ సెంటర్లలో వైద్య సేవలు, వ్యాధి నివారణ పరీక్షలు, ఔషధాల పంపిణీ జరుగుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment