సాక్షి, హైదరాబాద్: ఉచిత వైద్యం కొంచెం ఖరీదుగా మారనుంది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్)లో మార్పులు, చేర్పులకు సర్కారు నడుం బిగించింది. ఈ పథకం కింద నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రకాల ఆపరేషన్లు తప్ప ఇతర వైద్య సేవలు అందించడంలో ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీని పై సర్కారుకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పథకంలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. పథకం సక్రమంగా నడిచేందుకుతాము కొంత నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగైతే అంగీకారం తెలుపుతూ ఒక లేఖ ఇవ్వాలని శాంతికుమారి సూచించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు.
ఉద్యోగుల నుంచి ఏడాదికి 330 కోట్లు..
పథకం ప్రారంభ సమయంలో ఉద్యోగులు తమ వాటాగా కొంత చెల్లిస్తామని చెప్పినా ఉచిత సేవలకు సర్కార్ మొగ్గుచూపింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లో కలపకుండా ప్రత్యేకంగా ఈజేహెచ్‌ఎస్ పథ కాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులను ఈజేహెచ్‌ఎస్‌లో చేర్చా రు. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రు లు, 96 ప్రభుత్వ నెట్‌వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్ నెట్‌వర్క్ ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అవి ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. సాధారణ వైద్య సేవలను అందించడంలేదు.
కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నాయి. నగదు రహిత సేవలకు వచ్చేవారిని గౌరవప్రదంగా చూడడంలేదన్న విమర్శ లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాము నెలకు రూ.500 చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని రవీందర్‌రెడ్డి అంటున్నారు. ఆ ప్రకారం 5.50 లక్షలమంది ఉద్యోగుల నుంచి ఏడాదికి రూ.330 కోట్లు వసూలు కానుంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వైద్యం కోసం చేస్తున్న ఖర్చు కూడా రూ.300 కోట్లు మాత్రమే. సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలన్నీ సక్రమంగా చేసేట్లయితే మరో రూ.100 కోట్లు ఖర్చు కానుంది. అంటే ప్రభుత్వంపై పడే భారం కేవలం రూ.100 కోట్ల లోపే ఉంటుంది. అయితే, అందరి నుంచి రూ. 500 వసూలు చేస్తారా? లేక కేడర్‌ను బట్టి నిర్ణయిస్తారా? అన్న దానిపై స్పష్టతలేదు. జర్నలిస్టుల నుంచీ భాగస్వామ్యం కోరుతారా లేదా అన్నదానిపైనా స్పష్టత రాలేదు.
రెండు, మూడు రోజుల్లో లేఖ
ఉద్యోగుల భాగస్వామ్యంపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారితో మాట్లాడాను. నెలకు రూ.500 భరించడానికి సిద్ధంగా ఉన్నా మని చెప్పాను. భాగస్వామ్యంపై లేఖ ఇవ్వాలని ఆమె కోరారు. రెండు, మూడు రోజుల్లో దానిని ఇస్తాం.
–కారెం రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, టీఎన్‌జీవో
ఉచిత వైద్యం.. కొంచెం కాస్ట్‌లీ!
Published Wed, May 8 2019 1:35 AM | Last Updated on Wed, May 8 2019 5:14 AM
Comments
Please login to add a commentAdd a comment