జీవితాంతం ఉచిత మందులు | Free Medicine For Organ Transplant Patients By Telangana Government | Sakshi
Sakshi News home page

జీవితాంతం ఉచిత మందులు

Published Sat, Jan 18 2020 2:36 AM | Last Updated on Sat, Jan 18 2020 2:36 AM

Free Medicine For Organ Transplant Patients By Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి చేయించుకునే పేద రోగులకు జీవితాంతం ఉచితంగా మందులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించింది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు అవసరమైన మందులకు ఆర్థిక ప్యాకేజీ ప్రక టించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత అవయవ మార్పిడి చేయించుకున్న పేద రోగులు ఏడాది వరకు సర్కారు ఇచ్చే ఉచిత మందులతో ఆరోగ్యంగానే ఉంటున్నారు. ఆ తర్వాత రెండో ఏడాది నుంచి జీవితాంతం మందులు కొనలేని దుస్థితి ఏర్పడుతుంది. మధ్యలోనే మందులు మానేస్తున్నారు. దీంతో అనేకమంది మధ్యలోనే మరణిస్తున్నారు. దీన్ని గ్రహించిన ప్రభుత్వం జీవితాంతం మందులివ్వాలని నిర్ణయించింది.

ఆర్థిక ప్యాకేజీలు ఇలా.. 
ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించిన వివరాల ప్రకారం ప్యాకేజీలో భాగంగా కాడవర్‌ కాలే య మార్పిడి శస్త్రచికిత్సకు ప్రస్తుతం రూ. 10.50 లక్షలు, మరో రూ.2.64 లక్షలు మొద టి ఏడాది ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీకి 4 విడత లుగా ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది. తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏడాదికి రూ.1.52 లక్షల విలువైన మందులను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లైవ్‌ లివర్‌ మార్పిడికి ప్రభుత్వం ప్రస్తుతం రూ.10.88 లక్షల ప్యాకేజీ ఇస్తుంది. మరో రూ.2.62 లక్షలు ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీ మందుల కోసం ఏడాది కాలానికి ఇస్తుంది.

తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి రోగికి జీవితాంతం సంవత్సరానికి రూ.1.52 లక్షల విలువైన మందులు ఉచితంగా ఇస్తారు. కాడవర్‌ గుండె మార్పిడి కోసం ప్యాకేజీలో రూ.11.40 లక్షలు ఇస్తున్నారు. మరో రూ.2.20 లక్షలు కాడవర్‌ గుండె మార్పిడి కాంప్లికేషన్‌ ప్యాకేజీకి ఇస్తున్నారు. పోస్ట్‌ ఇండక్షన్‌ థెరపీ కోసం రూ.1.50 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీ మందుల కోసం మొదటి ఏడాదికి రూ.1.40 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏటా రూ.1.10 లక్షల విలువైన ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీ మందులు ఇస్తారు. అలాగే మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అవయవ మార్పిడి విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం రూ.1.61 లక్షల ప్యాకేజీ ఇస్తుంది.

దీంతోపాటు మొదటి 6 నెలలు నెలకు రూ.21 వేల చొప్పున మొత్తం ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీ కోసం రూ.1.26 లక్షల విలువైన మందులు ఇస్తుంది. ఇకపై 6 నెలల తర్వాత నుంచి జీవితాంతం నెలకు రూ.9,500 చొప్పున ఏడాదికి రూ.1.14 లక్షల విలువైన మందులు ఇస్తారు. అలాగే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసుకున్న రోగులకు తొలి ఏడాది యథావిధిగా మందులు ఉచితంగా ఇస్తారు. రెండో ఏడాది నుంచి రూ.1.10 లక్షల విలువైన మందులు 4 విడతల్లో ఇస్తారు. అలాగే గుండె, ఊపిరితిత్తులు రెండూ మార్పిడి చేశాక తొలి ఏడాది ఉచితంగా మందులు ఇస్తారు. రెండో ఏడాది నుంచి ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీ కింద రూ.1.10 లక్షల విలువైన మందులు ఇస్తారు. అవయవ మార్పిడి చేసిన ఆస్పత్రుల్లోనే మందులను నిర్ణీత ప్యాకేజీ మేరకు అందజేస్తారని ఆరోగ్యశ్రీ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement