Organ transplantation
-
కాలేయ మార్పిడితో బతికిన బాలుడు.. డాక్టర్ అయ్యాడు!
Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటీగా కందసామి నిలిచాడు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు. దేశంలో మొదటి బాలుడు తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్. కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం. -
మరణించినా.. మరోసారి జీవించే అరుదైన అవకాశం..!
మనిషికి ఒకటే జన్మ.. అదే మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు. అవయవదానం చేస్తే మరణించినా మరోసారి జీవించే అవకాశం ఉంది. ఒక్క మనిషి చనిపోతే గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముకమజ్జ, మూలకణాలు దానం చేసి మరో 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు. దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. అవయవదాతలు ఆ స్థాయిలో ఉండడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహన రాహిత్యంతో చాలామంది ముందుకు రావడం లేదు. 18ఏళ్లు దాటినవారు ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రాణం పోసిన.. దాతల సహకారంతో బతుకుతున్న వారిపై.. అన్నకు తమ్ముడి కిడ్నీ సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(53) రైతు. షటిల్ ఆడేవాడు. ఉన్నట్టుండి వాంతులయ్యా యి. ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు ఫెయిలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్‌కు నెలకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చయ్యాయి. మూడు నెలలు గడిచాయి. విజయేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో ఆ స్థితిలో చూసిన అతని తమ్ముడు జితేందర్‌రెడ్డి(50) తన రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ అయింది. మృత్యువు ముంగిట అసహాయంగా నిల్చున్న అన్నకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. విజయేందర్‌రెడ్డి ప్రస్తుతం జిల్లెల్లలో వ్యవసాయం, తమ్ముడు జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తొలి డోనర్ లక్ష్మి సిరిసిల్లకల్చరల్: సిరి సిల్లలోని గాంధీనగర్‌కు చెందిన ఇప్పనపల్లి నారాయణ, లక్ష్మి దంపతులు. మిర్చి బండి పెట్టుకుని జీవించేవారు. 12 ఏళ్లక్రితం పనులు ముగించుకుని ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన తలనొప్పితో లక్ష్మి కింద పడిపోయింది. ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేర్పించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారులు సంతోష్, రమేశ్ అంగీకారం మేరకు లక్ష్మి ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు సేకరించి నలుగురు వ్యక్తులకు అమర్చారు. జిల్లాలోనే తొలి అవయవ దాతగా లక్ష్మి గుర్తింపుపొందారు. తండ్రి.. భార్య ఇద్దరూ దాతలే కోరుట్ల: తండ్రి.. భార్య ఇద్దరూ కిడ్నీ దాతలుగా నిలిచారు. కోరుట్లకు చెందిన గీత కార్మికుడు పోతుగంటి శ్రీనివాస్ 2017లో వెన్నునొప్పితో అవస్థ పడడంతో తండ్రి రఘుగౌడ్ వైద్యులతో పరీక్షలు చేయించాడు. శ్రీనివాస్‌కు కిడ్నీ సమస్య ఉందని తేలడంతో కలవరపడ్డాడు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకతప్పదని చెప్పడంతో రఘుగౌడ్ తన కిడ్నీదానం చేశాడు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది. ఐదేళ్ల తరువాత 2022లో మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. మరోసారి పరీక్షించిన వైద్యులు మళ్లీ కిడ్నీ మార్పిడి చే యాల్సిందేనని చెప్పడంతో అతడి భార్య లావణ్య కిడ్నీ ఇచ్చింది. శ్రీని వాస్ తేరుకుని ప్రస్తుతం ఏ సమస్య లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు. అవయవదాతల‘అబ్బిడిపల్లె’ ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె వాసులు మూకుమ్మడిగా అవయవదానానికి అంగీకరిస్తూ తీర్మానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ సంగీతకు లేఖ అప్పగించారు. అబ్బిడిపల్లెలో 600 జనాభా ఉంటుంది. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించగా.. సర్పంచ్ ఒజ్జ కోమలత ఆధ్వర్యంలో తీర్మానం చేసి శభాష్ అనిపించుకున్నారు. మెడికల్ కాలేజీకి మృతదేహం కోల్‌సిటీ: గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన దేవకి పార్థసారథి (85) తన మరణానంతరం అవయవాలు దానం చేస్తానని సదాశయ ఫౌండేషన్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను ఐ బ్యాంక్‌కు, పార్థివదేహాన్ని రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. బతికుండగానే.. సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన పానగంటి స్వప్న(45) అంగన్వాడీ టీచర్. తాను చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని భర్త నర్సయ్యతో చెబుతుండేది. తీవ్ర జ్వరంబారిన పడి చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె రెండు కిడ్నీలు, గుండెను దానం చేశారు కుటుంబసభ్యులు. నలుగురికి ప్రాణం కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ఎల్బీనగర్కు చెందిన మింగాని సంపత్(41) ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ డైరెక్టర్. 2019 జనవరి 14న రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మరణించారు. నలుగురికి లివర్, రెండు కిడ్నీలు, గుండె అమర్చారు. ఏడుగురికి పునర్జన్మ కోల్‌సిటీ: తాను మరణించి మరో ఏడుగురికి పునర్జన్మిచ్చారు గోదారిఖనిలోని విద్యానగర్‌కు చెందిన సిరిసిల్ల ఇమానుయేల్(33). హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసే ఆయన 2019 జనవరి 3న బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారంపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆయన కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేయగా.. ఏడుగురికి పునర్జన్మ లభించింది. దేహదానానికి నిర్ణయం కోల్‌సిటీ: గోదావరిఖని చంద్రబాబుకాలనీలో నివాసం ఉంటున్న మేరుగు లింగమూర్తి ఓసీపీ–3లోని బేస్ వ ర్క్‌షాప్‌లో ఆపరేటర్. ఎనిదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయా యి. డయాలసిస్‌పై ఉన్న భర్త లింగమూర్తిని బతికించుకోవడానికి అతని భార్య విజయ తన కిడ్నీని దానంచేసింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తమ మరణానంతరం తమ దేహాలను మెడికల్ కాలేజీ కొడుకు కళ్లు సజీవం.. కోల్‌సిటీ: నా కొడుకు విజయ్‌పాల్‌రెడ్డి 2018 సెప్టెంబర్ 27న చనిపోయాడు. నేను, భార్య సుశీలతోపాటు నా కుటుంబ సభ్యులు దుఃఖంలో కూడా విజయపాల్‌రెడ్డి నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశాం. నా భార్య, నేను కూడా మా మరణానంతరం నేత్రదానం చేస్తామని అంగీకారం తెలిపాం. చనిపోయిన వారి అవ యవాలు మరికొందరికి ఉపయోగకరంగా ఉంటాయి. వారిలో మనవారిని చూసుకోవచ్చు. – మారెల్లి రాజిరెడ్డి, యైంటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని తమ్ముడు తోడుండాలని.. కోరుట్లరూరల్: మాది మండలంలోని సంగెం. నాకు ఒక అన్న. ఇద్దరు తమ్ముళ్లు. చిన్న తమ్ముడు చీటి రాంచందర్‌రావుకు 18ఏళ్ల క్రితం అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. డయాలసిస్ చేసినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. తమ్ముడిని కాపాడుకునేందుకు ఒక కిడ్నీ ఇచ్చా. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. కిడ్నీ ఇచ్చిన నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులు చేసుకుంటున్నా. తమ్ముడే దక్కలేదు. – చీటి మురళీధర్ రావు, సంగెం, కోరుట్ల రాష్ట్రం మొదటిస్థానం కోల్‌సిటీ: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం దేశంలో అవయవదానంలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ మంది ముందకు వస్తున్నారు. 2008లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పురుడుపోసుకున్న సదాశయ ఫౌండేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవయవదాతల కుటుంబాలకు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. – టి.శ్రవణ్‌కుమార్, సదాశయ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మా ఆయన్ను దక్కించుకోవాలని.. విద్యానగర్(కరీంనగర్): మా వారు వారాల ఆనంద్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రíహీత. 2013లో ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ ఏడాదిపాటు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన్ను దక్కించుకునేందుకు నేను ఒక కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నా కిడ్నీని ఆనంద్‌కు 15 జూలై 2014లో ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. నా జీవితంలో ఆయన లేని లోటును ఊహించలేను. నాలో భాగమైన ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాను. ఇప్పుడు నేను, మావారు పిల్లలతో ఆనందంగా ఉన్నాం. – వారాల ఇందిరారాణి, గృహిణి, కరీంనగర్ కొడుకు ప్రాణం పోశాడు వేములవాడ: మాది వేములవాడ. కొన్నేళ్లక్రితం లివర్‌వ్యాధి ఉండేది. ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. నా కొడుకు మారుతి లివర్ నాకు సరిపోయింది. 17 నవంబర్ 2017న మారుతి లివర్‌లోని కొంతభాగాన్ని నా లివర్‌కు జతచేశారు. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. నా కొడుకు లివర్ ఇచ్చి నాకు ప్రాణం పోశాడు. – కుమ్మరి శంకర్, వేములవాడ -
తను మరణించినా.. ముగ్గురికి ఊపిరి పోశాడు
కాకినాడ రూరల్: తను మరణించినా.. తన అవయవాల ద్వారా పలువురికి ఊపిరి పోశారు కాకినాడకు చెందిన పెంకే గోవిందకుమార్ (50). కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన గోవిందకుమార్ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు రాజశేఖరన్, ప్రశాంత్, యు.కిషోర్‌కుమార్, కల్యాణి, శ్రీకాంత్, గణేష్ ఆదిమూలం, డీవీఎస్ సోమయాజులు, వై.కల్యాణ్ చక్రవర్తి, ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, సనా ప్రవీణ తదితరులు రాత్రి 8 గంటలకు దాత నుంచి అవయవాలు సేకరించారు. ఒక కిడ్నీని ఆస్పత్రిలోనే రోగికి విజయవంతంగా అమర్చారు. రాత్రి 10 గంటల సమయంలో మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి, కాలేయాన్ని (లివర్) గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద మణిపాల్ ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. దీనికోసం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్సులు గమ్యానికి సజావుగా చేరేలా ఎస్పీ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అవయవాల తరలింపును ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ సమన్వయం చేశారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ కో–ఆర్డినేటర్‌గా స్వాతి వ్యవహరించారు. -
అవయవ మార్పిడిని ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడిని ప్రోత్సహించాలని, బోధనాసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని బోధనాసుపత్రుల పనితీరుపై ఆదివారం ఆయన నెలవారీ సమీక్ష చేశారు. గర్భిణులకు టిఫాతో పాటు అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్లు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు. బోధనాసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని, అనవసరంగా రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ను పంపించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎయిర్ చెకింగ్‌తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చి పంపాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో మూడు నెలల బఫర్ నిల్వలు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు పాడైతే.. వెంటనే వాటిని గంటల్లోనే మరమ్మతులు చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామని వివరించారు. ప్రతి ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రి వేళ పోస్ట్‌మార్టం చేయాలని, హర్ సే వెహికిల్ అందుబాటులో ఉంచి, ఉచితంగా గమ్యానికి చేర్చాలన్నారు. బోధనాసుపత్రులకు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపామని తెలిపారు. ప్రతి ఆసుపత్రికి 25 నుండి 30 మందిని కేటాయించామని వివరించారు. ఇటీవల కాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, మరింత కచ్చి తత్వంతో సులువుగా చికిత్స అందించేందుకు అధునాతన చికిత్స విధానాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
అవయవ మార్పిడి నోడల్ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అవయవాల మార్పిడి సర్జరీల నోడల్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుకు రూ. 30 కోట్ల నిధులు కేటాయించగా, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ఓకే చెప్పారని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ సెక్టార్లో ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒకటి రెండు అవయవమార్పిడి సర్జరీలు విజయవంతంగా చేపట్టినప్పటికీ అవసరమైన ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అవయవ మార్పిడిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. గాంధీలోఅవయవ మార్పిడి ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రోబోటిక్‌తోపాటు హైఎండ్ మాడ్యులర్ థియేటర్లు.. ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదవ అంతస్తులో రోబోటిక్ థియేటర్‌తోపాటు గుండె, మూత్రపిండాలు, కాలేయం, కాక్లియర్, కీళ్లమార్పిడి తదితర తొమ్మిది హైఎండ్ మాడ్యులర్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. బాక్టీరియా, వైరస్ థియేటర్లతోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ఉస్మానియా నుంచి గాంధీకి తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు. అంతేకాక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గాంధీఆస్పత్రిని దేశంలోనే అత్యన్నతంగా తీర్చిదిద్ధుతామని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. (క్లిక్: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన) -
ఎవరివైనా.. ఎవరికైనా.. అవయవాలు అందరికీ..
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి.. అవయవాలు ఉన్నా.. అమర్చలేక.. ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు. ఏ రక్తం వారికి.. ఎలా? సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు. ►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి. ►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ పరికరంలో అమర్చి.. సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు. మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో.. ‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. ►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు. ►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే. ‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా.. ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు. ఏడాదిన్నరలో మనుషులపై.. యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం కొరత ఉండనట్టే.. రక్తం నుంచి యాంటీజెన్లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
దానం.. శరణం గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. అవయవ మార్పిడిపై మాత్రం తీవ్ర ప్రభావం పడింది. నిత్యం రోగుల సంఖ్య పెరుగుతున్నా వారికి అవయవాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు నిలిచిపోయాయి. అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతిని తాత్కాలికంగా మందులతో నెట్టుకొస్తున్న బాధితులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జీవన్ దాన్లో 8,985 మంది పేర్లు నమోదు చేసుకోగా, వీరిలో అత్యధికంగా 4,526 మంది మూత్ర పిండాల కోసం, 4,073 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రమాదాలు తగ్గి బ్రెయిన్ డెడ్స్ లేవు. నిజానికి మూత్రపిండాలు, కాలేయాలను లైవ్డోనర్ల నుంచి కూడా సేకరించే అవకాశం ఉన్నప్పటికీ.. బాధితుల కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు రాకపోవడంతో బాధితుల సంఖ్య పెరగడానికి మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే 2013 నుంచి 2021 జులై తొమ్మిది వరకు 872 మంది దాతలు 3,308 అవయవాలను దానం చేశారు. వీటితో 2,233 మందికి పునర్జన్మను ప్రసాదించారు. 43 ఆస్పత్రుల్లో.. 8,985 మంది బాధితులు.. కోవిడ్ కారణంగా సాధారణ చికిత్సలతో పాటు అవయవ మారి్పడి చికిత్సలను కూడా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇదే సమయంలో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లు లేకపోవడంతో అవయవాల కొరత ఏర్పడింది. ప్రస్తుతం జీవన్‌దాన్ నెట్‌వర్క్‌లోని 43 ఆస్పత్రుల్లో 8,985 మంది బాధితులు పేర్లు నమోదు చేసుకుని, అవయవ మారి్పడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వీరిలో ఇప్పటికే కొంత మంది మృతి చెందగా.. మరికొంత మంది ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అవయవాల కోసం.. ♦ జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 8,985 ♦ కిడ్నీల కోసం నమోదు చేసుకున్నవారు 4,526 ♦ కాలేయ చికిత్సల ఎదురుచూస్తున్న వారు 4,073 ఏ ఆస్పత్రిలో.. ఎంతమంది..? ♦ అపోలో-1494 ♦ యశోద-1772 ♦ నిమ్స్-1310 ♦ కిమ్స్-1209 ♦ గ్లోబల్-1371 ♦ ఉస్మానియా-276 ♦ కేర్-324 చిన్న వయసులోనే పెద్ద జబ్బులు మారిన జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడానికి జన్యుపరమైన సమస్యలతో చాలామంది చిన్న వయసులోనే పెద్ద జబ్బులకు గురవుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడితే నయం అయ్యే జబ్బులను.. అవగాహన లేమికి నిర్లక్ష్యం తోడై వారి పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటి వరకు అవయవాలను దానం చేసిన దాతల్లో 70 శాతం మంది 50 ఏళ్లలోపు వారే. వీరంతా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, కొన ఊపిరితో ఆస్పత్రుల్లో చేరిన క్షతగాత్రులే.. అంతేకాదు అవయవాల కోసం అనేక మంది ఎదురు చూస్తుండగా, వీరిలో 50 ఏళ్లలోపు వారు 4,491 మంది ఉండగా, ఆపై వయసు్కలు 4,494 మంది ఉండటం గమనార్హం. ఊపిరితిత్తుల కోసం కిమ్స్‌లో.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని రామ్మనోహార్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఆర్ఎంఎల్ఐఎంఎస్)కు చెందిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శారదా సుమన్‌కు ఏప్రిల్ 14న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఆమెకు వెంటిలేటర్ అమర్చి మే 1న సిజేరియన్ చేసి, కడు పులోని బిడ్డను కాపాడారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎక్మోసపోర్ట్ అవసరమైంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను నాలుగు రోజుల క్రితం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో నగరానికి తరలించారు. ప్రస్తుతం ఆమె కిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తోంది. దాతలు ముందుకు రావడం లేదు అవయవ దానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ జన్మలో అవయవాలను దానం చేస్తే.. వచ్చే జన్మలో ఆ అవయవ లోపంతో జని్మస్తారని భావించి, అవయవ దానానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి అన్ని దానాల్లో కన్నా అవయవ దానం గొప్పది. బ్రెయిన్‌డెత్ స్థితిలో ఉన్న వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించొచ్చు. పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులను కాపాడాలంటే దాతలు కూడా అదే స్థాయిలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ ఏజీకే గోఖలే, గుండె మార్పిడి నిపుణుడు -
మరణించి.. నలుగురిలో జీవించి..
అచ్యుతాపురం/అక్కిరెడ్డిపాలెం : మృత్యువు ఒడి చేరుతూ ఆ యువకుడు మరికొందరికి జీవం పోశాడు. కన్నకొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి సన్యాసినాయుడు అలియాస్ వాసు (21) అవయవాలు గుండె, ఊపిరితిత్తులను గురువారం సికింద్రాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విమానంలో తరలించారు. వీటిని 67 ఏళ్ల వ్యక్తికి అవయవ మార్పిడి చేయనున్నట్లు విశాఖలోని ఐకాన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వాసు ఈనెల 5న నల్లమారమ్మ గుడి వద్ద ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విశాఖలోని ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బతికే అవకాశం లేనందువల్ల అవయవాలను దానంచేస్తే మరికొందరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అక్కడి వైద్యులు వాసు తల్లిదండ్రులు సత్యవతి, సత్యారావులకు తెలిపారు. కుమారుడు చనిపోయాడన్న బాధను దిగమింగుకుని అవయవ దానానికి వారు ముందుకొచ్చారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు, తదితర భాగాలను తొలగించి వాసు భౌతికదేహాన్ని వైద్యులు గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వాసు ఎస్ఈజెడ్లోని పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తన చెల్లికి ఇటీవలే పెళ్లి చేశాడు. అవయవాలు దానం చేసి ఔదార్యం చాటుకున్న వాసు తల్లిదండ్రులను గ్రామస్తులు కొనియాడారు. -
జీవితాంతం ఉచిత మందులు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి చేయించుకునే పేద రోగులకు జీవితాంతం ఉచితంగా మందులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించింది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు అవసరమైన మందులకు ఆర్థిక ప్యాకేజీ ప్రక టించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత అవయవ మార్పిడి చేయించుకున్న పేద రోగులు ఏడాది వరకు సర్కారు ఇచ్చే ఉచిత మందులతో ఆరోగ్యంగానే ఉంటున్నారు. ఆ తర్వాత రెండో ఏడాది నుంచి జీవితాంతం మందులు కొనలేని దుస్థితి ఏర్పడుతుంది. మధ్యలోనే మందులు మానేస్తున్నారు. దీంతో అనేకమంది మధ్యలోనే మరణిస్తున్నారు. దీన్ని గ్రహించిన ప్రభుత్వం జీవితాంతం మందులివ్వాలని నిర్ణయించింది. ఆర్థిక ప్యాకేజీలు ఇలా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు వెల్లడించిన వివరాల ప్రకారం ప్యాకేజీలో భాగంగా కాడవర్ కాలే య మార్పిడి శస్త్రచికిత్సకు ప్రస్తుతం రూ. 10.50 లక్షలు, మరో రూ.2.64 లక్షలు మొద టి ఏడాది ఇమ్యునో సప్రెసివ్ థెరపీకి 4 విడత లుగా ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది. తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏడాదికి రూ.1.52 లక్షల విలువైన మందులను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లైవ్ లివర్ మార్పిడికి ప్రభుత్వం ప్రస్తుతం రూ.10.88 లక్షల ప్యాకేజీ ఇస్తుంది. మరో రూ.2.62 లక్షలు ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందుల కోసం ఏడాది కాలానికి ఇస్తుంది. తాజాగా ఇకపై రెండో ఏడాది నుంచి రోగికి జీవితాంతం సంవత్సరానికి రూ.1.52 లక్షల విలువైన మందులు ఉచితంగా ఇస్తారు. కాడవర్ గుండె మార్పిడి కోసం ప్యాకేజీలో రూ.11.40 లక్షలు ఇస్తున్నారు. మరో రూ.2.20 లక్షలు కాడవర్ గుండె మార్పిడి కాంప్లికేషన్ ప్యాకేజీకి ఇస్తున్నారు. పోస్ట్ ఇండక్షన్ థెరపీ కోసం రూ.1.50 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందుల కోసం మొదటి ఏడాదికి రూ.1.40 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఇకపై రెండో ఏడాది నుంచి జీవితాంతం ఏటా రూ.1.10 లక్షల విలువైన ఇమ్యునో సప్రెసివ్ థెరపీ మందులు ఇస్తారు. అలాగే మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అవయవ మార్పిడి విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం రూ.1.61 లక్షల ప్యాకేజీ ఇస్తుంది. దీంతోపాటు మొదటి 6 నెలలు నెలకు రూ.21 వేల చొప్పున మొత్తం ఇమ్యునో సప్రెసివ్ థెరపీ కోసం రూ.1.26 లక్షల విలువైన మందులు ఇస్తుంది. ఇకపై 6 నెలల తర్వాత నుంచి జీవితాంతం నెలకు రూ.9,500 చొప్పున ఏడాదికి రూ.1.14 లక్షల విలువైన మందులు ఇస్తారు. అలాగే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసుకున్న రోగులకు తొలి ఏడాది యథావిధిగా మందులు ఉచితంగా ఇస్తారు. రెండో ఏడాది నుంచి రూ.1.10 లక్షల విలువైన మందులు 4 విడతల్లో ఇస్తారు. అలాగే గుండె, ఊపిరితిత్తులు రెండూ మార్పిడి చేశాక తొలి ఏడాది ఉచితంగా మందులు ఇస్తారు. రెండో ఏడాది నుంచి ఇమ్యునో సప్రెసివ్ థెరపీ కింద రూ.1.10 లక్షల విలువైన మందులు ఇస్తారు. అవయవ మార్పిడి చేసిన ఆస్పత్రుల్లోనే మందులను నిర్ణీత ప్యాకేజీ మేరకు అందజేస్తారని ఆరోగ్యశ్రీ వర్గాలు తెలిపాయి. -
జీవన దాతలకోసం...ఎదురుచూపులే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవ మార్పిడి అవసరమైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ చేయించు కున్న వారితో పోలిస్తే, అవయవాల లభ్యత దాదాపు పావు వంతు వరకే ఉంటుంది. దీంతో అవయవ మార్పిడికి నోచుకోక అనేక మంది దీర్ఘకాలిక చికిత్సతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొందరైతే చికిత్స మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు మరింత పెరుగుతు న్న సంగతి తెలిసిందే. వారికి అవయవాలను మార్పిడి చేసేందుకు అవకాశాలు దక్కడంలేదు. ఈ పరిస్థితిపై ఇటీవల గవర్నర్‌కు ఇచ్చిన నివేదికలో వైద్య, ఆరోగ్యశాఖ పలు వివరాలు వెల్లడించింది. వెయిటింగ్ లిస్టులో 5,173 మంది.. రాష్ట్రంలో కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అటువంటి వారిని రక్షించుకోవాలం టే సాధారణ చికిత్సలతోపాటు అవయవ మార్పిడి అవసరం. దేశంలో మొన్నటి వరకు అత్యంత ఎక్కువ అవయవ మార్పిడి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానా న్ని మహారాష్ట్ర దక్కించుకుంది. దేశంలో ఏటా 5 లక్షల మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. 10 లక్షల మందికి 0.8 అవయవ దానం రేటు ఉండగా, తెలంగాణలో ఆ రేటు నాలుగుగా ఉంది. 2013 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 7,126 మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోగా,1,953 మందికి మాత్రమే మార్పిడి జరిగింది. 5,173 మంది బాధితు లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారని వైద్యారోగ్య శాఖ ఆ నివేదికలో తెలిపింది. ట్రామాకేర్ సెంటర్ల లేమి.. అవయవ మార్పిడి రెండు రకాలుగా జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు అవయవాలను సేకరిస్తారు. బతికుండగా బంధువుల సమ్మతి మేరకు కిడ్నీ, లివర్ వంటివి సేకరిస్తారు. ఇతర దేశాల్లో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి కూడా అవయవాలను సేకరిస్తారు. మన దేశంలో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి అవయవాలను సేకరిం చట్లేదు. ఎందుకంటే గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి 20 నిమిషాల్లోనే అవయవాలను సేకరించాలి. అంత తక్కువ సమయంలో సేకరించే వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మన వద్ద లేవని పలువురు అంటున్నారు. అవయవాల సేకరణకు మనకున్న మార్గాలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి లైవ్‌గా సేకరించడమే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది బ్రెయిన్ డెడ్‌కు గురవుతారు. జాతీయ రహదారుల వెంట మనకు ట్రామాకేర్ సెంటర్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లేలోగా వారు చనిపోతున్నారు. ట్రామాకేర్ సెంటర్లలో ప్రమాదాలకు గురైన వారికి వైద్యం చేసి బతికించే అవకాశం ఉంటుంది. లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవా లు సేకరించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరి నుంచైనా అవయ వాలు సేకరించాలంటే చాలామంది ముందుకు రావడంలేదు. వీటి వల్ల తెలంగాణలో చాలామంది అవయవ మార్పిడి చికిత్స అందక మరణిస్తున్నారు. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రం లో డిమాండ్ పెరిగింది. కానీ ఆ మేరకు అం దించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నా రు. అయినా అనేక మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. అవకాశం లేదనో, అవగాహన లేకనో జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. – డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్చార్జి, హైదరాబాద్ -
అవయవదానంపై అవగాహన పెంచాలి
న్యూఢిల్లీ: అవయవదానం గురించి ఒక ఉద్యమంలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని, అప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అవయవ మార్పిడి చేస్తున్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణించిన దాతల నుంచి మార్పిడి, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య భారీ అంతరం ఉందని తెలిపారు. భారత్‌లో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 0.65 అవయవ దాన రేటు ఉందని చెప్పారు. ఢిల్లీలో భారతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. -
అమరావతిలో ‘రేలా’ ఆసుపత్రి
సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అవయవ మార్పిడి ఆసుపత్రి నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవయవ మార్పిడి నిపుణులు, భారత్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ డా.మహమద్ రేలా ముందుకు వచ్చారు. శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మనిషి ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్‌ని అమరావతిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. గుండె, కిడ్నీ, కాలేయం, లంగ్స్, యూట్రిస్ వంటి ప్రధాన శరీర అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు. కాగా, డాక్టర్ రేలా ఇప్పటివరకూ 4,500 లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. కుమార్తెకు పిల్లలు పుట్టకపోతే ఓ తల్లి తన యూట్రెస్‌ను కుమార్తెకు దాన చేసిందని, ఆ ఆపరేషన్ వల్ల కుమార్తెకు బిడ్డ జన్మించినట్లు రేలా వెల్లడించారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాల భూమి అవసరం అవుతుందని, అందుకు సహకారం అందించాలని సీఎంను రేలా కోరారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలతో వస్తే అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ రేలాకు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అప్పారావు, డాక్టర్ రమేష్ కృష్ణన్, డాక్టర్ వి.చౌదరి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. -
ఎవరి గుండె ఎవరికి ఊపిరి !?
సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ 18వ తేదీ. రివ్యానీ రహంగ్డలే ఆరేళ్ల పాప. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన ఆ పాప రోడ్డు పక్కనున్న కుళాయి నుంచి మంచినీళ్లు తాగుతుండగా, ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైన ఆ బాలికను నాగపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పాప మెదడుకు సర్జరీ చేశారు. అయినా స్పృహ రాలేదు. ‘బ్రెయిన్ స్టెమ్ డెడ్’ అని ప్రకటించారు. అది విన్న ఆ పాప తల్లిదండ్రులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అయితే అంతటి విషాదంలో ఆ పాప శరీరంలోని అవసరమైన అన్ని అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు. ‘నా కూతురుకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె శరీరంలోని ఇతర అవయవాలు బాగానే ఉన్నాయికదా, అవెందుకు బతకకూడదు! అని అనిపించిందీ. వాటిని అవసరమైన వారికి డొనేట్ చేయాలని అనుకున్నాను’ అని పోలీసు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధేశ్యామ్ రహంగ్డలే తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన రివ్యానీ గుండె, కాలేయం, కిడ్నీలను వైద్యులు తొలగించి అత్యంత అవసరమైన నలుగురు వ్యక్తులకు అమర్చారు. ఆ అవయవాలు ఎవరికి వెళుతున్నాయో కూడా తెలుసుకోకుండా వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవయవాలు దానం చేసిన మహానుభావుల జాబితాలో రివ్యానీ తల్లిదండ్రులు కూడా చేరి పోయారు. పెరిగిన అవయవ దానాలు భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య ఇలాంటి అవయవదానాలు పెరిగాయి. నగరాల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మధ్య కూడా గ్రీన్ కారిడార్ ద్వారా (ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడే నిలిపివేసి) ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అవయవాలను రవాణా చేస్తున్నారు. కుల, మత, లింగ వివక్షతలు లేకుండా అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది. దేశంలో అవయవ దానాలు పెరుగుతున్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఎక్కువ అవయవదానాలు ఎవరు చేస్తున్నారు? వారి అవయవాలు ఎవరికి వెళుతున్నాయి? అవయవదానాలపై ఆధారపడి దేశంలో బతుకుతున్న వారు ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి అవయవాలు ధనవంతుడిని బతికిస్తున్నాయి. అవయవాలు ఇచ్చేది పేదవాళ్లే అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల పేద వాళ్లే అస్వస్థత కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రెయిన్ డెడ్‌కు గురవుతున్నారు. కొందరు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తున్నారు లేదా అమ్ముకుంటున్నారు. డబ్బున్నవారిలో దాతలు ఉండరని కాదు. చాలా తక్కువ ఉంటున్నారు. అవయవాలు మాత్రం కచ్చితంగా డబ్బున్న వారికే ఊపిరి పోస్తున్నాయి. అందుకు కారణం అవయవ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం అవడమే. ఉదాహరణకు కాలేయం, గుండె మార్పిడికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. సులభమైన కిడ్నీ ఆపరేషన్‌కు కూడా 8 నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంత డబ్బు పెట్టి ఏ పేద వాడు వైద్యం చేయించుకోలేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు చేయరు. కాలేయం, గుండె, మూత్ర పిండాలు లాంటి మానవ అవయవాల మార్పిడి చికిత్సను మొట్టమొదట విజయవంతంగా నిర్వహించిందీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ఆశ్చర్యంగా నేడు 1 నుంచి రెండు శాతం అవయవాల మార్పిడి వైద్య చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే. సరైన వ్యవస్థ లేనిదీ భారత్‌లోనే ఇలాంటి దారణమైన పరిస్థితి భారత్ దేశంలోనే ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు సమాన న్యాయం అనే మౌలిక సూత్రం లేదా అంతర్జాతీయ వైద్య విధాన వ్యవస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాలు నేరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఆ సంస్థ ‘ఈక్వెటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆర్గాన్స్’ అని చెబుతోంది. అంటే, ఓ అవయవం వైద్యం ఖర్చులు భరించే ధనవంతుడికి వెళితే, మరో అవయవం పేదవాడికి వెళ్లాలి. పేద వాడికి ప్రభుత్వ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైవేటు ఆస్పత్రిగానీ ఉచితంగా అవయవమార్పిడి చే యాలి. ఓ గుండె ధనవంతుడికి వెళితే మరో గుండె పేదవాడికి వెళ్లడం, ఓ కాలేయం ధనవంతుడికి వెళితే మరో కాలేయం పేదవాడికి వెళ్లడం సమాన న్యాయం అనిపించుకుంటుంది. అయితే ఏ అవయం ఎవరికి ఎంత అత్యవసరమో అన్న ప్రాతిపదికనే సాధారణ అవయవ మార్పిడి ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. మోదీ ఆలోచించి ఉండాల్సిందీ అవయవాల మార్పిడిలో సమాన న్యాయం జరగాలంటే దానికో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’లో దాన్ని భాగం చేయవచ్చు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయవచ్చు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మానవ అవయవాలను దానం చేయండంటూ పిలుపునిచ్చారు. వాటిని ఎవరి కోసం దానం చేయమంటున్నారో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. అవయవాలను ఎవరికి దానం చేయాలనే విషయాన్ని డోనర్లు లేదా వారి సంబంధీకుల చిత్తానికి వదిలి పెట్టాలని కొందర భావించవచ్చు. అందరూ మన రాధేశ్యామ్లాంటి వారు ఉండకపోవచ్చు. వారిని డబ్బుతో ప్రలోభ పెట్టవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. అందుకని ఓ పటిష్టమైన వ్యవస్థ ఉండాల్సిందే. మన రాధేశ్యామ్ కూతురు రివ్యానీ బతికుంటే మే 5వ తేదీన ఏడవ పుట్టిన రోజును జరుపుకునేది. ఆమె గుండెను ఓ మూడేళ్ల పాపకు అమర్చారు. ప్రతి ఏడాది ఆ పాప పుట్టిన రోజుతోపాటు తన పాప పుట్టిన రోజును కూడా మే 5వ తేదీన జరుపు కోవాల్సిందిగా ఆ పాప తల్లిదండ్రులను మన రాధేశ్యామ్ కోరారు. మరేమీ కోరలేదు. మనం మనవంతుగా అవయవదానంతో పాటు వాటి మార్పిడికి మంచి వ్యవస్థను కోరుదాం. (గమనిక : ముంబైలోని జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ, సర్జన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షర రూపం ఈ వార్తా కథనం) -
ప్రభుత్వ విప్ అవయవదానం
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అవయవదానం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా జీవన్ దాన్ అనే సంస్థకు అవయదానం చేస్తూ సంతకం చేశారు. ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందించారు. గొంగిడి సునీత 2014లో తొలిసారి ఆలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. -
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఏపీని వైద్యఆరోగ్య రంగంలో ఉన్నత స్ధానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. సీఆర్డీఏ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుల జట్టును కామినేని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో తొలి దశలో భాగంగా అవయవాల మార్పిడికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 120 మానవ అవయవాల హార్వెస్టింగ్ పూర్తి అయ్యిందని ఇందులో 30 అవయవాలను బాధితులకు అమర్చినట్లు ఆయన వెల్లడించారు. జీవన్ దాన్ ద్వారా అవయవదానం కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. 500 మంది డాక్టర్స్, 1000 మంది నర్స్‌లు, 16 మంది ఆసుపత్రి అడ్మిన్ స్టేటర్స్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి జీవో జారీ చేశామన్నారు. త్వరలోనే ఈ పోస్ట్‌ల భర్తీకు నియామకాలు పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి తన అవయవాలను దానం ఇస్తే 5 గురు బాధితులకు కొత్త జీవితం లభిస్తుందన్నారు. ఏపీలో ఎయిమ్స్‌ను నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి కామినేని పేర్కొన్నారు. -
గణనీయంగా పెరుగుతున్న అవయవ దానాలు
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 మంది దానం - 24 మందికి అవయవాల మార్పిడి సాక్షి, ముంబై: రెండు వారాల్లో 10 మంది అవయవ దానం వల్ల ఈ ఏడాది దానం చేసిన వారి సంఖ్య 15కు చేరుకుంది. వీరి ద్వారా 24 మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఇటీవల 55 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ హ్యూమరేజ్‌కు గురవ్వడంతో ఆ వ్యక్తి బంధువులు తన రెండు కిడ్నీలు, లివర్ దానం చేశారు. అలాగే మరో 60 ఏళ్ల వృద్ధుడు బ్రెయిన్ హ్యూమరేజ్‌తో మృతిచెందడంతో తన అవయవాలు కూడా దానం చేశారు. గత రెండు వారాలుగా 10 మంది అవయవాలను మార్పిడి చేశామని, 24 మందికి కొత్త జీవితాలు పొందారని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అవయవాలు ఎక్కువగాపొందుతున్నామని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా వస్తుంటారని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇంకా అవయవ దానంలో వెనుకబడి ఉన్నాయన్నారు. అవయవ దానంలో ప్రభుత్వ ఆస్పత్రులు వెనుకబడటానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఫోర్టిస్ ఆస్పత్రికి చెందిన లివర్ మార్పిడి సర్జన్ డాక్టర్ రాకేష్ రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది అవయవ దానం చేసిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం శుభ సూచకం అన్నారు. వివిధ ఆస్పత్రుల నుంచి దానం చేసిన అవయవాలను పొందుతున్నామని, అయితే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైందని అన్నారు. ముంబై జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ.. నగరంలో అవయవ దానం పట్ల మరింత అవగాహన పెంపొందించాలని నిర్ణయించింది. కాగా, 2012లో 26 మంది అవయవ దానం చేశారు. ఆ సమయంలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ లివర్ విఫలం చెంది మరణించడంతో ఈ అంశం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అదేవిధంగా 2014లో 41మంది అవయవ దానం చేయగా 107 మంది ప్రయోజనం పొందారు.