సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ 18వ తేదీ. రివ్యానీ రహంగ్‌డలే ఆరేళ్ల పాప. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన ఆ పాప రోడ్డు పక్కనున్న కుళాయి నుంచి మంచినీళ్లు తాగుతుండగా, ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైన ఆ బాలికను నాగపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పాప మెదడుకు సర్జరీ చేశారు. అయినా స్పృహ రాలేదు. ‘బ్రెయిన్ స్టెమ్ డెడ్’ అని ప్రకటించారు. అది విన్న ఆ పాప తల్లిదండ్రులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అయితే అంతటి విషాదంలో ఆ పాప శరీరంలోని అవసరమైన అన్ని అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు.
‘నా కూతురుకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె శరీరంలోని ఇతర అవయవాలు బాగానే ఉన్నాయికదా, అవెందుకు బతకకూడదు! అని అనిపించిందీ. వాటిని అవసరమైన వారికి డొనేట్ చేయాలని అనుకున్నాను’ అని పోలీసు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధేశ్యామ్ రహంగ్‌డలే తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన రివ్యానీ గుండె, కాలేయం, కిడ్నీలను వైద్యులు తొలగించి అత్యంత అవసరమైన నలుగురు వ్యక్తులకు అమర్చారు. ఆ అవయవాలు ఎవరికి వెళుతున్నాయో కూడా తెలుసుకోకుండా వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవయవాలు దానం చేసిన మహానుభావుల జాబితాలో రివ్యానీ తల్లిదండ్రులు కూడా చేరి పోయారు.
పెరిగిన అవయవ దానాలు
భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య ఇలాంటి అవయవదానాలు పెరిగాయి. నగరాల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మధ్య కూడా గ్రీన్ కారిడార్ ద్వారా (ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడే నిలిపివేసి) ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అవయవాలను రవాణా చేస్తున్నారు. కుల, మత, లింగ వివక్షతలు లేకుండా అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది. దేశంలో అవయవ దానాలు పెరుగుతున్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఎక్కువ అవయవదానాలు ఎవరు చేస్తున్నారు? వారి అవయవాలు ఎవరికి వెళుతున్నాయి? అవయవదానాలపై ఆధారపడి దేశంలో బతుకుతున్న వారు ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి అవయవాలు ధనవంతుడిని బతికిస్తున్నాయి.
అవయవాలు ఇచ్చేది పేదవాళ్లే
అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల పేద వాళ్లే అస్వస్థత కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రెయిన్ డెడ్‌కు గురవుతున్నారు. కొందరు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తున్నారు లేదా అమ్ముకుంటున్నారు. డబ్బున్నవారిలో దాతలు ఉండరని కాదు. చాలా తక్కువ ఉంటున్నారు. అవయవాలు మాత్రం కచ్చితంగా డబ్బున్న వారికే ఊపిరి పోస్తున్నాయి. అందుకు కారణం అవయవ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం అవడమే. ఉదాహరణకు కాలేయం, గుండె మార్పిడికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి.
సులభమైన కిడ్నీ ఆపరేషన్‌కు కూడా 8 నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంత డబ్బు పెట్టి ఏ పేద వాడు వైద్యం చేయించుకోలేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు చేయరు. కాలేయం, గుండె, మూత్ర పిండాలు లాంటి మానవ అవయవాల మార్పిడి చికిత్సను మొట్టమొదట విజయవంతంగా నిర్వహించిందీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ఆశ్చర్యంగా నేడు 1 నుంచి రెండు శాతం అవయవాల మార్పిడి వైద్య చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే.
సరైన వ్యవస్థ లేనిదీ భారత్‌లోనే
ఇలాంటి దారణమైన పరిస్థితి భారత్ దేశంలోనే ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు సమాన న్యాయం అనే మౌలిక సూత్రం లేదా అంతర్జాతీయ వైద్య విధాన వ్యవస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాలు నేరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఆ సంస్థ ‘ఈక్వెటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆర్గాన్స్’ అని చెబుతోంది. అంటే, ఓ అవయవం వైద్యం ఖర్చులు భరించే ధనవంతుడికి వెళితే, మరో అవయవం పేదవాడికి వెళ్లాలి.
పేద వాడికి ప్రభుత్వ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైవేటు ఆస్పత్రిగానీ ఉచితంగా అవయవమార్పిడి చే యాలి. ఓ గుండె ధనవంతుడికి వెళితే మరో గుండె పేదవాడికి వెళ్లడం, ఓ కాలేయం ధనవంతుడికి వెళితే మరో కాలేయం పేదవాడికి వెళ్లడం సమాన న్యాయం అనిపించుకుంటుంది. అయితే ఏ అవయం ఎవరికి ఎంత అత్యవసరమో అన్న ప్రాతిపదికనే సాధారణ అవయవ మార్పిడి ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది.
మోదీ ఆలోచించి ఉండాల్సిందీ
అవయవాల మార్పిడిలో సమాన న్యాయం జరగాలంటే దానికో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’లో దాన్ని భాగం చేయవచ్చు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయవచ్చు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మానవ అవయవాలను దానం చేయండంటూ పిలుపునిచ్చారు. వాటిని ఎవరి కోసం దానం చేయమంటున్నారో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. అవయవాలను ఎవరికి దానం చేయాలనే విషయాన్ని డోనర్లు లేదా వారి సంబంధీకుల చిత్తానికి వదిలి పెట్టాలని కొందర భావించవచ్చు. అందరూ మన రాధేశ్యామ్‌లాంటి వారు ఉండకపోవచ్చు. వారిని డబ్బుతో ప్రలోభ పెట్టవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. అందుకని ఓ పటిష్టమైన వ్యవస్థ ఉండాల్సిందే.
మన రాధేశ్యామ్ కూతురు రివ్యానీ బతికుంటే మే 5వ తేదీన ఏడవ పుట్టిన రోజును జరుపుకునేది. ఆమె గుండెను ఓ మూడేళ్ల పాపకు అమర్చారు. ప్రతి ఏడాది ఆ పాప పుట్టిన రోజుతోపాటు తన పాప పుట్టిన రోజును కూడా మే 5వ తేదీన జరుపు కోవాల్సిందిగా ఆ పాప తల్లిదండ్రులను మన రాధేశ్యామ్ కోరారు. మరేమీ కోరలేదు. మనం మనవంతుగా అవయవదానంతో పాటు వాటి మార్పిడికి మంచి వ్యవస్థను కోరుదాం.
(గమనిక : ముంబైలోని జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ, సర్జన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షర రూపం ఈ వార్తా కథనం)
Comments
Please login to add a commentAdd a comment