kidney operation
-
హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారం జరుగుతోంది. బెంగళూరుకి చెందిన డాక్టర్‌దే కీలకపాత్రగా పోలీసులు తేల్చారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులుగా పోలీసులు నిర్థారించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు డాక్టర్ తీసుకున్నాడు. చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన వైద్యుడు.. బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్‌కి కిడ్నీ మార్పిడి చేశాడు. కిడ్నీ మార్పిడికి డాక్టర్‌కి లాయర్ రూ.55 లక్షలు ఇవ్వగా, నర్స్ రూ.45 లక్షలు ఇచ్చింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్జ భానులను కిడ్నీ డోనర్స్‌గా పోలీసులు గుర్తించారు. కిడ్నీ డోనర్లకు రూ.5 లక్షలు చొప్పున నగదు చెల్లించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి ఆస్పత్రిపై దాడి చేశారు.ఇదీ చదవండి: భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు. -
రెండు మతాలు.. నాలుగు జీవితాలు
చండీగఢ్ : ‘మతం’ నువ్వు సంతోషంగా ఉంటూ.. తోటి వారికి మేలు చేయడానికి నిర్దేశించిన ఓ మార్గం. మనిషికి ప్రశాంతతను చేకూర్చడం.. హద్దు మీరకుండా.. సంఘానికి మేలు చేసే విధంగా జీవించడం ఎలానో వివరించేది మతం. కానీ నేటి సమాజంలో ఈ పరిస్థితులు పూర్తిగా మరిపోయాయి. ముఖ్యంగా ఓ మతం వారిని వేధిస్తూ.. దాడులకు పాల్పడటం.. హింసాకాండను సృష్టించడం నిత్యకృత్యమయ్యింది. ఒకప్పుడు హిందూ ముస్లిం భాయి భాయిగా విలసిల్లిన సంస్కృతి క్రమేపీ క్షీణిస్తుంది. ఇలాంటి రోజుల్లో.. ఇప్పుడు చెప్పబోయే సంఘటన గురించి తెలిస్తే.. మనసుకు సంతోషం కల్గుతుంది. పర్లేదు మన సమాజంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. ఓ ముస్లిం వ్యక్తికి హిందువు.. హిందూ స్త్రీకి ముస్లిం మహిళ కిడ్నీ దానమిచ్చి సాయానికి మతంతో సంబంధం లేదని నిరూపించారు. వివరాలు.. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా కరేరి గ్రామానికి చెందిన అబ్దుల్ అజిజ్ నజర్(53) కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కిడ్నీలో రాళ్లు రావడంతో అతని రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాత కోసం వెతకడం ప్రారంభించాడు. ఫలితం లేకపోవడంతో ఓ ఆన్లైన్ యాప్‌లో తన బ్లడ్ గ్రూప్, సమస్య వివరాలను రిజిస్టర్ చేశాడు. దేవుడి మీద భారం వేసి.. దాత కోసం ఎదురు చూడసాగాడు. అటు బిహార్‌కు చెందిన సుజిత్ కుమార్ సింగ్ భార్య మంజులకు కూడ రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆమె కూడ దాత కోసం గాలిస్తూ.. ఫలితం లేక.. అబ్దుల్లానే యాప్‌లో తన వివరాలు పొందుపరిచింది. అదృష్టవశాత్తు అబ్దుల్ బ్లడ్ గ్రూప్, సుజిత్ బ్లడ్ గ్రూప్‌లు.. అలానే మంజుల, అబ్దుల్ భార్య షాజియా(50)ల బ్లడ్ గ్రూప్‌లు సరిపోయాయి. దాంతో వారు ఒకరికొకరు కిడ్నీ దానం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి సొంత రాష్ట్రాల్లో ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతి లభించలేదు. దాంతో పంజాబ్‌లో వీరికి సర్జరీ నిర్వహించారు. పంజాబ్ మొహాలి ఆస్పత్రి వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎటువంటి సమస్యలు లేవని నిర్థారించిన తర్వాత ఆపరేషన్ చేసి.. కిడ్నీ మార్పిడి చేశారు. డాక్టర్ ప్రియదర్శి రంజన్ ఒక్క రోజు వ్యవధిలోనే ఈ నాలుగు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు డాక్టర్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఇక్కడ సమస్య మతం కాదు.. అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు చాలా ఇబ్బంది కల్గించాయి. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దాతలు, గ్రహీతలకు మూడో రాష్ట్రంలో ఆపరేషన్ నిర్వహించడం చాలా కష్టమైన టాస్క్’ అన్నారు. ‘ఇక్కడ ప్రధానంగా నేను మూడు సమస్యలు ఎదుర్కొన్నాను. మొదటిది వైద్య సంబంధిత ఇబ్బందులు.. రెండు అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు.. మూడు మతం. అయితే వైద్యశాస్త్రంలో మానవత్వానికే మొదటి ప్రాధాన్యత. అందుకే ఈ సమస్యల్ని అధిగమించగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అబ్దుల్ మాట్లాడుతూ.. ‘నా దేహంలో ఒక కిడ్నీ.. హిందువుది అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆపరేషన్‌కు గాను నాకు రూ. 7లక్షలు ఖర్చయ్యింది. అయితే ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం అందలేద’ని వాపోయాడు. సుజిత్ కుమార్, మంజుల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా దేహంలో ఓ ముస్లిం మహిళ అవయవం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నారు మంజుల. -
ఎవరి గుండె ఎవరికి ఊపిరి !?
సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ 18వ తేదీ. రివ్యానీ రహంగ్డలే ఆరేళ్ల పాప. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన ఆ పాప రోడ్డు పక్కనున్న కుళాయి నుంచి మంచినీళ్లు తాగుతుండగా, ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైన ఆ బాలికను నాగపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పాప మెదడుకు సర్జరీ చేశారు. అయినా స్పృహ రాలేదు. ‘బ్రెయిన్ స్టెమ్ డెడ్’ అని ప్రకటించారు. అది విన్న ఆ పాప తల్లిదండ్రులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అయితే అంతటి విషాదంలో ఆ పాప శరీరంలోని అవసరమైన అన్ని అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు. ‘నా కూతురుకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె శరీరంలోని ఇతర అవయవాలు బాగానే ఉన్నాయికదా, అవెందుకు బతకకూడదు! అని అనిపించిందీ. వాటిని అవసరమైన వారికి డొనేట్ చేయాలని అనుకున్నాను’ అని పోలీసు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధేశ్యామ్ రహంగ్డలే తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన రివ్యానీ గుండె, కాలేయం, కిడ్నీలను వైద్యులు తొలగించి అత్యంత అవసరమైన నలుగురు వ్యక్తులకు అమర్చారు. ఆ అవయవాలు ఎవరికి వెళుతున్నాయో కూడా తెలుసుకోకుండా వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవయవాలు దానం చేసిన మహానుభావుల జాబితాలో రివ్యానీ తల్లిదండ్రులు కూడా చేరి పోయారు. పెరిగిన అవయవ దానాలు భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య ఇలాంటి అవయవదానాలు పెరిగాయి. నగరాల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మధ్య కూడా గ్రీన్ కారిడార్ ద్వారా (ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడే నిలిపివేసి) ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అవయవాలను రవాణా చేస్తున్నారు. కుల, మత, లింగ వివక్షతలు లేకుండా అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది. దేశంలో అవయవ దానాలు పెరుగుతున్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఎక్కువ అవయవదానాలు ఎవరు చేస్తున్నారు? వారి అవయవాలు ఎవరికి వెళుతున్నాయి? అవయవదానాలపై ఆధారపడి దేశంలో బతుకుతున్న వారు ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి అవయవాలు ధనవంతుడిని బతికిస్తున్నాయి. అవయవాలు ఇచ్చేది పేదవాళ్లే అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల పేద వాళ్లే అస్వస్థత కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రెయిన్ డెడ్‌కు గురవుతున్నారు. కొందరు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తున్నారు లేదా అమ్ముకుంటున్నారు. డబ్బున్నవారిలో దాతలు ఉండరని కాదు. చాలా తక్కువ ఉంటున్నారు. అవయవాలు మాత్రం కచ్చితంగా డబ్బున్న వారికే ఊపిరి పోస్తున్నాయి. అందుకు కారణం అవయవ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం అవడమే. ఉదాహరణకు కాలేయం, గుండె మార్పిడికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. సులభమైన కిడ్నీ ఆపరేషన్‌కు కూడా 8 నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంత డబ్బు పెట్టి ఏ పేద వాడు వైద్యం చేయించుకోలేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు చేయరు. కాలేయం, గుండె, మూత్ర పిండాలు లాంటి మానవ అవయవాల మార్పిడి చికిత్సను మొట్టమొదట విజయవంతంగా నిర్వహించిందీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ఆశ్చర్యంగా నేడు 1 నుంచి రెండు శాతం అవయవాల మార్పిడి వైద్య చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే. సరైన వ్యవస్థ లేనిదీ భారత్‌లోనే ఇలాంటి దారణమైన పరిస్థితి భారత్ దేశంలోనే ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు సమాన న్యాయం అనే మౌలిక సూత్రం లేదా అంతర్జాతీయ వైద్య విధాన వ్యవస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాలు నేరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఆ సంస్థ ‘ఈక్వెటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆర్గాన్స్’ అని చెబుతోంది. అంటే, ఓ అవయవం వైద్యం ఖర్చులు భరించే ధనవంతుడికి వెళితే, మరో అవయవం పేదవాడికి వెళ్లాలి. పేద వాడికి ప్రభుత్వ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైవేటు ఆస్పత్రిగానీ ఉచితంగా అవయవమార్పిడి చే యాలి. ఓ గుండె ధనవంతుడికి వెళితే మరో గుండె పేదవాడికి వెళ్లడం, ఓ కాలేయం ధనవంతుడికి వెళితే మరో కాలేయం పేదవాడికి వెళ్లడం సమాన న్యాయం అనిపించుకుంటుంది. అయితే ఏ అవయం ఎవరికి ఎంత అత్యవసరమో అన్న ప్రాతిపదికనే సాధారణ అవయవ మార్పిడి ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. మోదీ ఆలోచించి ఉండాల్సిందీ అవయవాల మార్పిడిలో సమాన న్యాయం జరగాలంటే దానికో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’లో దాన్ని భాగం చేయవచ్చు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయవచ్చు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మానవ అవయవాలను దానం చేయండంటూ పిలుపునిచ్చారు. వాటిని ఎవరి కోసం దానం చేయమంటున్నారో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. అవయవాలను ఎవరికి దానం చేయాలనే విషయాన్ని డోనర్లు లేదా వారి సంబంధీకుల చిత్తానికి వదిలి పెట్టాలని కొందర భావించవచ్చు. అందరూ మన రాధేశ్యామ్లాంటి వారు ఉండకపోవచ్చు. వారిని డబ్బుతో ప్రలోభ పెట్టవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. అందుకని ఓ పటిష్టమైన వ్యవస్థ ఉండాల్సిందే. మన రాధేశ్యామ్ కూతురు రివ్యానీ బతికుంటే మే 5వ తేదీన ఏడవ పుట్టిన రోజును జరుపుకునేది. ఆమె గుండెను ఓ మూడేళ్ల పాపకు అమర్చారు. ప్రతి ఏడాది ఆ పాప పుట్టిన రోజుతోపాటు తన పాప పుట్టిన రోజును కూడా మే 5వ తేదీన జరుపు కోవాల్సిందిగా ఆ పాప తల్లిదండ్రులను మన రాధేశ్యామ్ కోరారు. మరేమీ కోరలేదు. మనం మనవంతుగా అవయవదానంతో పాటు వాటి మార్పిడికి మంచి వ్యవస్థను కోరుదాం. (గమనిక : ముంబైలోని జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ, సర్జన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షర రూపం ఈ వార్తా కథనం) -
కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయి..
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల నగరంలో మరో ప్రాణం బలైంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందగా.. నగరంలోని కొత్తపేట ఓజోన్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతిచెందాడు. దీంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుండా ఆలస్యం చేసి ఆపరేషన్ నిర్వహించడంతోనే ఆయన మృతిచెందాడని బంధువులు ఆందోళన చేస్తున్నారు. -
కోలుకుంటున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే
రియాడిజనీరో: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు చికత్స తీసుకున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే(74) కోలుకుంటున్నాడు. కిడ్నీలోని రాళ్ల సమస్యతో బుధవారం సా పాలోస్ ఆల్బర్ట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పీలేకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పీలే కోలుకుంటున్నాడని ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. కిడ్నీలో రాళ్లను తీసిన వేసిన అనంతరం పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నాడు.