సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడిని ప్రోత్సహించాలని, బోధనాసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని బోధనాసుపత్రుల పనితీరుపై ఆదివారం ఆయన నెలవారీ సమీక్ష చేశారు. గర్భిణులకు టిఫాతో పాటు అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని సూచించారు.
ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్లు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు. బోధనాసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని, అనవసరంగా రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్‌ను పంపించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎయిర్ చెకింగ్‌తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చి పంపాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో మూడు నెలల బఫర్ నిల్వలు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు పాడైతే.. వెంటనే వాటిని గంటల్లోనే మరమ్మతులు చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామని వివరించారు. ప్రతి ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రి వేళ పోస్ట్‌మార్టం చేయాలని, హర్ సే వెహికిల్ అందుబాటులో ఉంచి, ఉచితంగా గమ్యానికి చేర్చాలన్నారు.
బోధనాసుపత్రులకు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపామని తెలిపారు. ప్రతి ఆసుపత్రికి 25 నుండి 30 మందిని కేటాయించామని వివరించారు. ఇటీవల కాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, మరింత కచ్చి తత్వంతో సులువుగా చికిత్స అందించేందుకు అధునాతన చికిత్స విధానాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment