సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. వారం రోజుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ ఆధ్వర్యంలో పూర్తిగా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 4,400, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 700, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో దాదాపు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పుడు వీటిలో నాలుగు వేల పోస్టులకు పైనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పచ్చజెండా ఊపారు. గతంలో 2017లో నర్సుల పోస్టుల భర్తీ జరిగింది. అప్పట్లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివిధ చిక్కులున్నాయని చాలా మంది గతంలో కోర్టులో కేసులు వేశారు. వైద్య,ఆరోగ్యశాఖకు కూడా చాలా ఫిర్యాదులు అందాయి.
ఆ పోస్టులకు విపరీతమైన పోటీ
ఇక నర్సింగ్‌కౌన్సిల్‌లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 25 శాతం మందికి పైగా ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మిగతా వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసినా, ఉద్యోగాలు లభించని పరిస్థితి నెలకొనడంతో కొందరు కోర్సుతో సంబంధంలేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భర్తీ చేయబోయే నర్సుల పోస్టులకు భారీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment