Telangana: ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’ | Minister Harish Rao Started The Pilot Project In Siddipet | Sakshi
Sakshi News home page

Telangana: ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’

Published Fri, Jan 6 2023 3:29 AM | Last Updated on Fri, Jan 6 2023 9:18 AM

Minister Harish Rao Started The Pilot Project In Siddipet - Sakshi

గురువారం సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో రక్త పరీక్షల కోసం  శాంపిల్స్‌ ఇస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి  హరీశ్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, సిద్దిపేట: పోలీసుల ఆరోగ్యరికార్డులను రూపొందించాలని వైద్య, ఆరో గ్య శాఖ నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను ముందస్తుగానే తెలుసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లో వారికి మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ లో ప్రతీ ఉద్యోగి పేరు మీద ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’ పేరిట ప్రత్యేక రికార్డు తయారు చేస్తారు.

ఈ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచి, ఎప్పుడంటే అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుకల్పిస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్‌ కేటాయిస్తారు.   హెల్త్‌ ప్రొఫైల్‌ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తారు. పోలీసుల బీపీ, షుగర్‌తోపాటు బ్లడ్‌ గ్రూప్, కిడ్నీ, కాలేయం పనితీరు, బ్లడ్‌ యూరియా, సీరమ్‌ క్రియేటినైన్, ఆల్కలైన్‌ ఫాస్పటేజ్, కొలెస్ట్రాల్, ఈసీజీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు.

వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఇలాంటి పరీక్ష లు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో, లేదా ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏకీకృత నంబర్‌ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం చేయడానికి అవకాశంఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా బయటపడే వీలుంటుందని చెపుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల సీపీలు, ఎస్పీలు పర్యవేక్షిస్తారు. ఇటీవల హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చాలా మంది యువ పోలీస్‌అధికారులు, ఉద్యోగులు పలు రకాల రోగాలతో చికిత్స పొందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. చాలా మంది పని ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నట్లు గమనించారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో ఉద్యోగులకు ప్రత్యేకంగా హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.  

సిద్దిపేటలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం 
గురువారం సిద్దిపేటలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పైలట్‌ ప్రాజెక్టు కింద పోలీసుల హెల్త్‌ ప్రొఫైల్‌ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్నప్పుడు సమస్యలు బయటకు తెలియవని, కానీ వయసు పైపడిన తర్వాత వ్యాధులకు సంబంధించిన బాధలు తెలుస్తాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు ఆరోగ్యరక్ష కార్యక్ర మం చేపట్టామని వెల్లడించారు.

పొలిటికల్, పోలీసులు, ప్రెస్‌.. ఈ మూడు వర్గాలు కలసి నిత్యం సమాజం కోసం శ్రమిస్తుంటాయని, బయట చూసేందుకు బాగానే ఉన్నా.. లోపల వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని వివరించారు. బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని, అశ్రద్ధ చేస్తే మూత్రపిండాలు, కాలేయం, గుండె దెబ్బతిని జీవితం ప్రమాదంలో పడుతుందని మంత్రి పోలీసులకు హితవు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో సిద్దిపేట జిల్లా పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, సీపీ శ్వేత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కాశీనాథ్, రాష్ట్ర నర్సింగ్‌ కమిటీ సభ్యుడు పాల సాయిరాంలు పాల్గొన్నారు. 

సాధారణ ప్రజలకూ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు.. 
తెలంగాణలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ ప్రొఫైల్‌ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రజలకు ఆరోగ్య ప్రొఫెల్‌ చేపట్టారు. మిగిలిన జిల్లాల్లో తాత్కాలికంగా వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement