Health protection
-
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
Telangana: ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: పోలీసుల ఆరోగ్యరికార్డులను రూపొందించాలని వైద్య, ఆరో గ్య శాఖ నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను ముందస్తుగానే తెలుసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లో వారికి మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ లో ప్రతీ ఉద్యోగి పేరు మీద ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’ పేరిట ప్రత్యేక రికార్డు తయారు చేస్తారు. ఈ వివరాలను ఆన్లైన్లో పొందుపరచి, ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుకల్పిస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. హెల్త్ ప్రొఫైల్ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తారు. పోలీసుల బీపీ, షుగర్‌తోపాటు బ్లడ్ గ్రూప్, కిడ్నీ, కాలేయం పనితీరు, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియేటినైన్, ఆల్కలైన్ ఫాస్పటేజ్, కొలెస్ట్రాల్, ఈసీజీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఇలాంటి పరీక్ష లు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో, లేదా ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏకీకృత నంబర్ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం చేయడానికి అవకాశంఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా బయటపడే వీలుంటుందని చెపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల సీపీలు, ఎస్పీలు పర్యవేక్షిస్తారు. ఇటీవల హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చాలా మంది యువ పోలీస్అధికారులు, ఉద్యోగులు పలు రకాల రోగాలతో చికిత్స పొందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. చాలా మంది పని ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నట్లు గమనించారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో ఉద్యోగులకు ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం గురువారం సిద్దిపేటలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టు కింద పోలీసుల హెల్త్ ప్రొఫైల్ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్నప్పుడు సమస్యలు బయటకు తెలియవని, కానీ వయసు పైపడిన తర్వాత వ్యాధులకు సంబంధించిన బాధలు తెలుస్తాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు ఆరోగ్యరక్ష కార్యక్ర మం చేపట్టామని వెల్లడించారు. పొలిటికల్, పోలీసులు, ప్రెస్.. ఈ మూడు వర్గాలు కలసి నిత్యం సమాజం కోసం శ్రమిస్తుంటాయని, బయట చూసేందుకు బాగానే ఉన్నా.. లోపల వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని వివరించారు. బీపీ, షుగర్ లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని, అశ్రద్ధ చేస్తే మూత్రపిండాలు, కాలేయం, గుండె దెబ్బతిని జీవితం ప్రమాదంలో పడుతుందని మంత్రి పోలీసులకు హితవు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో సిద్దిపేట జిల్లా పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, సీపీ శ్వేత, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, రాష్ట్ర నర్సింగ్ కమిటీ సభ్యుడు పాల సాయిరాంలు పాల్గొన్నారు. సాధారణ ప్రజలకూ హెల్త్ ప్రొఫైల్ తయారు.. తెలంగాణలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ ప్రొఫైల్ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రజలకు ఆరోగ్య ప్రొఫెల్ చేపట్టారు. మిగిలిన జిల్లాల్లో తాత్కాలికంగా వాయిదా వేశారు. -
మంచి మాట: మౌనం మంచి భాషణం
మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా, ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం. మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు. అయితే ఇలా కనులు మూసుకున్నపుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు. మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్ మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం. ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. మూడవది కాష్ఠమౌనం. ఇది మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
మూగ జీవాలకు హెల్త్ కార్డులు
పాలకొండ రూరల్: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, యజమానులు, కాపలాదారులకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్సార్ పశుసంరక్షణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా... వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పాడి పెంపకం ఆ తర్వాతి స్థానంలో ఉంటూ రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ క్రమంలో యానిమల్ కార్డుల ద్వారా దాదాపు లక్ష మంది పశు సంపద కలిగిన రైతులకు, పాడి పరిశ్రమల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రా మ సచివాలయాలకు అనుసంధానం చేసిన పశువైద్య సహాయకులు ఈ కార్డుల మంజూరుకు అర్హులైన రైతులకు సహకరిస్తారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గల ( 085–00–00–1962, 1907) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఈ పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షకు పైబడి మూగప్రాణులకు ఈ కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశువు ఆరోగ్య సంరక్షణకు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, పోషకాలు, పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఆర్బీకే కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటుచేసి వాటి ఆరోగ్య తాజా స్థితిగతులు గుర్తిస్తారు. ఈ నేప థ్యంలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు కలిపి జిల్లావ్యాప్తంగా సుమారు 16 లక్షల 96వేల పైబడి ఉన్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు. పథకం తీరుతెన్నులు.. ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు. ఏడాది కాలంలో రూ.1.35 కోట్లు గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయి న అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పా డి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరి పోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్బీకేల ద్వారా అందిస్తాం. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని సది్వనియోగపర్చుకోవాలి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. – డాక్టర్ ఆరిక ఈశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ -
ఏజెన్సీకి ఆరోగ్య రక్ష
ఐటీడీఏ పరిధిలో కొత్త కార్యక్రమం అందరికి కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులు వ్యకుల వారీగా ఆరోగ్య వివరాల నమోదు పీహెచ్‌సీలతో వివరాలు అనుసంధానం ఇప్పటికి 68 వేల మంది వివరాల సేకరణ సాక్షిప్రతినిధి, వరంగల్ : వైద్య సేవలకు దూరంగా ఉండే గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మంచిరోజులు వస్తున్నాయి. ఇంటి వద్దకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైంది. అందరికీ ఒకే రకమైన వైద్యం, మందులు అనే పాత విధానానికి స్వస్తి చెబుతున్నారు. ఎవరికి ఏ వైద్యం అవసరమో అదే అందించే కొత్త కార్యక్రమానికి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ స్వయంగా రూపొందించిన ఈ కార్యక్రమం త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని ప్రతి కుటుంబానికి అవసరమైన సందర్భాల్లో వైద్య సేవలు అందించే లక్ష్యంతో దీన్ని అమలు చేయనున్నారు. ఏజెన్సీ పరిధిలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ‘కుటుంబ సంరక్షణ కార్డు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.అమయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఐటీడీఏ పరిధిలోని ప్రతి కుటుంబానికి ఒక ‘కుటుంబ సంరక్షణ కార్డు’ను అందిస్తారు. కుటుంబంలోని వ్యక్తుల వారీగా వివరాలను నమోదు చేసేందుకు ఈ కార్డులో ప్రత్యేకంగా పేజీలు ఉంటాయి. వ్యక్తుల వారీగా... పేరు, చిరునామా, ఆర్థిక పరిస్థితులు, వృత్తి, రక్తం గ్రూపు, బీపీ, షుగర్ వంటి అంశాలతోపాటు ధీర్ఘకాలిక, స్వల్పకాలిక అనారోగ్య లక్షణాలను ఈ కార్డులో పేర్కొంటారు. ఇవే వివరాలను పొందుపరిచిన మరో కార్డును ఆయా గ్రామాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెడతారు. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇలా వివరాలు సేకరించిన అనంతరం వ్యక్తుల వారీగా అవసరమైన వైద్య సేవలను అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంటి వద్దకు వెళ్లడం లేదా పీహెచ్‌సీలకు రప్పించి వైద్య సేవలు చేస్తారు. ప్రతి పీహెచ్సీ సిబ్బంది విధిగా నెలలో రెండుసార్లు అన్ని గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరు పీహెచ్‌సీల సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికి ఏ వైద్యం, మందులు అవసరమో వాటినే అందిస్తారు. మొదటి దశలో వ్యక్తుల వివరాల సేకరణ జరుగుతోంది. ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, భూపాలపల్లి, ములుగు, నల్లబెల్లి, నర్సంపేట, కొత్తగూడ, ఖానాపురం, గూడూరు, మహబూబాబాద్ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి నిర్దేశిత జనాభా ఉంది. 14,267 కుటుంబాలకు చెందిన 68,222 మంది వివరాలను సేకరించారు. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఆధారంగా వ్యక్తిగతంగా వ్యాధుల వివరాలను పేర్కొంటున్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అందించాలో కార్డులో నమోదు చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాల్లోని వంద శాతం కుటుంబాల అన్ని గ్రామాల వివరాలను సేకరించనున్నారు. రెండో దశ వివరాల నమోదు ప్రక్రియ బుధవారం నుంచి మొదలవుతోంది. 104 వాహనాలకు జీపీఆర్ఎస్... కుటుంబ సంరక్షణ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగిస్తూనే వేగంగా వైద్య సేవలను అందించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐటీడీఏ పరిధిలో 104 వాహనాలు 20 ఉన్నాయి. ఈ ఇరవై వాహనాల్లోనూ పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని 104 వాహనాలకు జీపీఆర్ఎస్ వ్యవస్థను అమర్చుతున్నారు. జీపీఆర్ఎస్తో... ఏ వాహనం ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. రోజువారీగా చేసిన సేవల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సంరక్షణ కార్డులు పొందిన వారికి అసరమైన సమయాల్లో వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని జీపీఆర్ఎస్తో పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వైద్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అతి కీలకమైనది. ఏజెన్సీలోని ప్రతి కుటుంబానికి మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేస్తున్నాం. వ్యక్తుల వారీగా ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నాం. దీని వల్ల ఎవరికి ఎప్పుడు ఎలాంటి వైద్యం, మందులు అవసరమో తెలుస్తాయి. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది.