మంచి మాట: మౌనం మంచి భాషణం | Enlightenment Benefits of Silence | Sakshi
Sakshi News home page

మంచి మాట: మౌనం మంచి భాషణం

Published Mon, Mar 14 2022 12:18 AM | Last Updated on Mon, Mar 14 2022 12:21 AM

Enlightenment Benefits of Silence - Sakshi

మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా,
ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది.


మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని  ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు  చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు.  

ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం.

మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా  రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని  కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు.

అయితే ఇలా కనులు మూసుకున్నపుడు  ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది.  కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది.
బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు.  

మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్‌ మౌనం.
వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం.  ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది.  మూడవది కాష్ఠమౌనం. ఇది  మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది.  కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. 

– దాసరి దుర్గా ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement