enlightenment
-
బుద్ధుని తపస్సు ఎలా సాగింది? బుద్ధగయలో నేడు ఏం చేస్తారు?
బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ నాటికీ బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. బుద్ధ పూర్ణిమను ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పౌర్ణమిని మే 23న జరుపుకోనున్నారు. బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు.బీహార్‌లోని బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం కోసం బయలుదేరిన బుద్ధుడు గయలోని ధుంగేశ్వరి పర్వతంపై ఉన్న ప్రాగ్బోధి గుహకు చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆ గుహలో కఠిన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ తపస్సు సమయంలో, ఆయన ఆహారంతో పాటు నీటిని కూడా స్వీకరించలేదని చెబుతారు. ఫలితంగా బుద్ధుని శరీరం అస్థిపంజరంలా మారింది. నేటికీ అస్థిపంజరం రూపంలో ఉన్న బుద్ధుని విగ్రహం బుద్ధగయలో కనిపిస్తుంది. దుంగేశ్వరిలో మాతా దుర్గేశ్వరి ఆలయం ఉంది. అక్కడే బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది.బుద్ధుడు తన ధ్యాన సమయం ముగిశాక కాలినడకన ఇక్కడ నుండి బయలుదేరాడు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్రౌర్ గ్రామానికి చేరుకుని, అక్కడి మర్రిచెట్టు కింద తిరిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుజాత అనే మహిళ బుద్ధుని అస్థిపంజర రూపాన్ని చూసి, అతనికి ఒక కప్పు ఖీర్ అందించింది. దానిని స్వీకరించిన బుద్ధ భగవానుడు అక్కడ నుండి బుద్ధగయకు బయలుదేరాడని చెబుతారు.బుద్ధగయలోని ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాక పూర్ణిమ రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. పలువురు బౌద్ధ అనుచరులు ఇక్కడికి తరలివస్తారు. బుద్ధ భగవానుడు ఇక్కడ నుండే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. బుద్ధగయలోని మహాబోధి ఆలయం అంతర్జాతీయ వారసత్వ సంపదలో భాగంగా గుర్తింపు పొందింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే శ్రావ్యమైన కీర్తన ప్రతిధ్వనిస్తోంది. -
ధర్మ జ్ఞానోదయం
సూర్యోదయం అయ్యింది. సూర్యుని చేత కిరణాలు దట్టమైన చెట్ల చిటారు కొమ్మలపై పడుతున్నాయి. లేలేత ఎరుపు రంగులో ఉన్న కొమ్మల చివుర్లు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. చల్లని గాలి చెట్ల మధ్య దూరి కొమ్మల్ని తాకుతూ పయనిస్తుంది. అప్పుడే నదిలో స్నానం చేసి వచ్చి పాలవృక్షం క్రింద కూర్చున్నాడు బుద్ధుడు. ఆ ఉషోదయ తేజస్సు అంతా అతని ప్రశాంత వదనంలోంచి ఉదయిస్తోంది! పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కనురెప్పలు మెల్లగా వాలాయి! ఆలోచనల ΄÷రలు తెరచుకున్నాయి!తాను జ్ఞానోదయం ΄పొంది ఇది నలభై తొమ్మిదో రోజు. అంటే సిద్దార్థుడు బుద్ధిని పొంది, బుద్ధుడైన రోజు. అప్పటికి రెండు నెలల క్రితం నిరంజనా నదీ తీరంలో తన ఐదుగురు మిత్రులతో కలిసి కఠోర తపస్సు చేశాడు. చిక్కిశల్యమై నీరసించి పడిపోయాడు. జ్ఞానసాధనకు అది సరైన మార్గం కాదని నిర్ణయించుకున్నాడు. నిరాహార వ్రతం మానాడు. మిత్రులు తనని దూషించి వెళ్ళిపొంయారు. అయినా నిరాశపడలేదు. గయకు చేరాడు. అక్కడ నదీతీరంలోని రావిచెట్టు కింద ధ్యానదీక్ష కొనసాగించాడు. అంతకాలంగా వెదుకుతున్న దుఃఖానికి కారణం తెలిసింది కాబట్టి దానికి నివారణ మార్గం కూడా తెలిసింది. ఆ నిదారణా మార్గమే అష్టాంగ మార్గం! అష్టాంగమార్గ ఆవిష్కరణే బుద్ధునికి జ్ఞానోదయం. ఏ విషయంలోనూ అతి ఉండకూడదు అనేది అవగతం అయ్యింది. తిండి మాని శరీరాన్ని ఎండగట్టుకోవడం ఎంత త΄్పో, అతిగా తిని శరీరాన్ని సోమరిగా చేయడం అంతే తప్పు. నిద్రాహారాలు మాని పగలూ రేయి అవిశ్రాంతంగా పని చేయడం ఎంత త΄్పో, పనీ ΄ాటా మాని తిని తిరగడం అంతే తప్పు. ఇలా... రెండు అంచులకు చేరకుండా మధ్యస్థంగా ఉండడం వల్ల కర్తవ్య ΄ాలన చిరకాలం సాగించగలం. దీన్నే మధ్యమమార్గం అంటాం. ఈ మార్గమే బుద్ధుని బోధనలకు పునాది. ఈ మార్గాన్ని ఎంచుకునే అష్టాంగ మార్గాన్ని రూపొందించాడు. అదే బుద్ధునికి జ్ఞానోదయం. బుద్ధుని ఆలోచనల్లో ప్రశాంత వెలుగులు నింపిన ఆరోజు వైశాఖ పున్నమి. బుద్ధత్వం సిద్ధించిన రోజు. బుద్ధుడు సంబోధిని పొందిన రోజు. నేడు ప్రపంచానికి పండుగరోజు. దుఃఖ నివారణా మార్గాన్ని సాధించిన బుద్ధుడు వెంటనే అక్కడినుంచి లేచి వెళ్ళి΄ోలేదు. తాను ΄పొందిన జ్ఞానాన్ని ప్రకటించుకోలేదు. ఆ మార్గాన్ని దాని ఆచరణలో కలిగే అవరోధాల్ని, అసలు ఆ మార్గం ప్రజలకు అర్థమవుతోందా? లేదా? అనే విషయాల్ని పలు పలు విధాలుగా తర్కించుకున్నాడు. తర్కించి తర్కించి.. చివరికి తనది సరైన మార్గమే అని నిర్ణయించుకున్నాడు.మెదటివారం అంతా తనకు ఏ చెట్టుకింద జ్ఞానోదయం కలిగిందో.. ఆ చెట్టుకిందే కూర్చున్నాడు. మానవుల పుట్టుక, మరణాల మధ్య ఉన్న దశల్ని పన్నెండు భాగాలుగా విభజించుకుని ఒక్కో దశ గురించి దీర్ఘంగా ఆలోచించాడు. అవిద్య, సంస్కారాల పరంపరలో ముసలితనం, మరణం కలుగు తాయని, ఆ మరణం వల్లే శోకం, రోదనం, దుఃఖం, బాధలు కలుగుతాయని తెలుసుకున్నాడు. ఈ దుఃఖ బాధలకు కారణం అలవిమాలిన కోరిక (తృష్ణ), కాబట్టి కోరికల్ని నశింపచేసుకుంటే మనస్సు దుఃఖ రహితమవుతుందని గ్రహించాడు. దానితో తన ఆలోచనలకి మరింత బలం చేకూరింది. అలా మొదటి వారం గడిచింది. రెండోవారం కూడా ఆ బోధి వృక్షం కిందే ఉండి ధ్యానానందాన్ని పొందాడు. మూడోవారం ఆ చెట్టుకు కొద్ది దూరంగా వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చొని, బోధివృక్షాన్ని పరిశీలిస్తూ తన మార్గాన్ని మరింత విస్తృత పరుచుకుంటూ గడి΄ాడు. అక్కడి నుండి లేచి, అక్కడికి దగ్గరలో ఒక కొలనుగట్టున ఉన్న ఒక మందిరంలో చేరాడు. అక్కడే ‘అభిధర్మాన్ని’ పరిష్కరించాడు. ధ్యానసాధనా సో΄ానాల్ని, మనస్సుని కేంద్రీకరించే విధానాన్ని రూపొందించుకున్నాడు. మనస్సు నిర్మలం అయింది. బుద్ధుని ముఖంలోంచి తేజస్సు ప్రకాశించింది. తల చుట్టూ ఆరు రంగుల కాంతి .... వెల్గులు ప్రసరించింది. అది ఒక జ్ఞాన కాంతిపుంజం.మరలా ఆ తేజోమూర్తి అక్కడి నుండి లేచాడు. అజ΄ాల అనే మర్రి చెట్టు కిందికి చేరాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో – చెడ్డ పనులు ఎవరు చేయరో, మోహరాగాల నుండి ఎవరు ముక్తులవుతారో, స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ, సర్వోన్నత జ్ఞానిగా ఎవరు ఉంటారో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణత్వం అలా సిద్ధిస్తుంది గాని, పుట్టుకను బట్టి కాదు. అని బుద్ధుడు చె΄్తాడు. ‘సత్యాన్ని తెలుసుకుని, ఏకాంతంగా గడపడం సుఖం. మంచి పనులు చేయడం అంతకంటే సుఖం. జీవుల పట్ల కరుణ, మైత్రి కలిగి జీవించడం అన్నింటికంటే పరమసుఖం. అని బోధిస్తాడు. జనులు కోర్కెలతో, క్లేశాలు అనే వాసాలతో ఇల్లు నిర్మించుకుంటారు. వాటిని తృష్ణ అనే తాళ్ళతో గట్టిగా బంధించుకుంటారు. ఆ తాళ్ళను తెంచి, వాసాలు దించి, ఆ కోర్కెల కొంపను కూల్చుకుంటేనే దుఃఖం నుండి విముక్తి అనే విషయాన్ని ఆవిష్కరించగలుగుతారు. కోర్కెల వాసాలతో దుఃఖం అనే ఇంటిని నిర్మించుకుని ప్రజలు అందులో జీవిస్తున్నారు. ఆ ఇంటికి బలం కోర్కెలనే వాసాలు. జ్ఞానం అనే గొడ్డలితో ఆ కోర్కెల్ని కూల్చితే దుఃఖం దూరమై΄ోతుంది. ఇదే బుద్ధునికి కలిగిన జ్ఞానోదయం. దుఃఖం లేని జగతికి సూర్యోదయం. ధర్మ అరుణోదయం.– డా. బొర్రా గోవర్ధన్(23, గురువారం బుద్ధ పూర్ణిమ) -
మంచి మాట: మౌనం మంచి భాషణం
మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా, ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం. మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు. అయితే ఇలా కనులు మూసుకున్నపుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు. మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్ మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం. ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. మూడవది కాష్ఠమౌనం. ఇది మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
బాలసైన్యం
ఆ రోజుల్లో పిల్లలకు కూడా సైనిక శిక్షణ ఇవ్వటం రివాజుగా వుండేది. దళాలుగా విభజించటం, ప్రత్యేకంగా హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చెయ్యటం, ప్రతి ఏడాదీ విన్యాసాలు చేయించటం అంతా యుద్ధరంగానికెళ్లే సైనికులకిచ్చిన ట్రెయినింగు లాంటిదే. పెద్దవాళ్లకు ఈ సైన్యంతో ఏ సంబంధమూ లేదు. అన్ని హోదాలలోనూ, వృత్తుల్లోనూ పిల్లలే. అయితే సైన్యానికి తగిన అభ్యర్థుల్ని ఎంపిక చెయ్యటం మాత్రంపెద్దల బాధ్యత. అలాగే శిక్షణ కోర్సు రూపొందించటంలో కూడా సీనియర్లు సలహాలివ్వటం తప్పనిసరి.ఈ మిలటరీ అకాడెమీకి దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి పిల్లాడి కలా అందులో చేరటమే. కాని ప్రవేశ పరీక్షలు మహా కఠినంగా ఉండేవి. శరీర దారుఢ్యం మాత్రమే కాదు, తెలివితేటల్ని కూడా పరిగణలోకి తీసుకునేవారు. పరీక్షరాయటానికి కనీస వయసు ఆరేడేళ్లుగా నిర్ధారించారు. ప్రవేశం సంపాదించిన వాళ్లకు అన్ని రంగాలలోనూ అద్భుత శిక్షణ దొరికేది. తరువాత జీవితంలో కూడా చిన్నప్పుడు ఇలాంటి ట్రెయినింగు తీసుకున్నానని చెప్పుకోవటం ఎవరికైనా గర్వకారణం. శిక్షణ కేంద్రాల నిర్వాహణలో, ప్రమోషన్లలో పెద్దల ప్రమేయం ఇసుమంతయినా ఉండదని మరోసారి చెప్పుకోవాలి. పద్నాలుగేళ్లు దాటిన వాళ్లకు అకాడెమీలోకి ప్రవేశం నిషిద్ధం. సైన్యం నాలుగు డివిజన్లతో త్రివిధ దళాలు, పదాతిదళం, లైట్ అల్టలరీ, మెడికల్ సర్వీస్ కాప్స్గా విస్తరించి ఉంది. అర్హులైన బాలికలకు సైన్యంలో నర్సులుగా, వాలంటీర్లుగా ఉద్యోగాలు దొరికాయి.ఒకసారి అకస్మాత్తుగా చిన్న పొరుగుదేశం కయ్యానికి కాలు దువ్వింది. ఎన్నో రెట్లు శక్తివంతమైన పెద్ద దేశంతో యుద్ధం ఎలా చెయ్యగలమని కూడా ఆ దేశ ప్రభువులు ఆలోచించలేదు. కాని ఎంత అవమానం! ఉఫ్ అంటే ఎగిరిపోయే బుడతలు తమను కవ్విస్తారా? సమవుజ్జీలతోనే యుద్ధం చెయ్యటం నీతిమంతుల లక్షణం. కాని చాలెంజ్ చేసినప్పుడు? గుణపాఠం నేర్పక తప్పదు. ‘‘పెద్దవాళ్లెందుకు? మేము చాలు,’’ అంటూ ముందుకొచ్చింది బాలసైన్యం. ఇది సంచలన వార్త. పిల్లల శౌర్య పరాక్రమాలను కీర్తించారు కొందరు. హాహాకారాలు చేశారు మరికొందరు. తర్జన భర్జనల తర్వాత, యుద్ధం కాని ఈ యుద్ధానికి బాలసైన్యం చాలని నిర్ణయించింది ప్రభుత్వం.దేశమంతా మనసారా ఆశీర్వదించింది బాల సైనికుల్ని.విదేశాంగశాఖ పొరుగుదేశానికి ఆచరణీయం కాని ఒక ప్రతిపాదన పంపింది. వాళ్ల ప్రతిస్పందన కోసం నిరీక్షించకుండా ఇరవైనాలుగ్గంటల్లోనే సైన్యాన్ని సరిహద్దుల మీద మోహరించారు. ప్రతిపాదన అంగీకరించలేదని అధికారికంగా తెలిసిన క్షణాన యుద్ధం ప్రకటించారు. సైనిక పరాక్రమాన్ని గురించి ఎవరికే సందేహం లేదు. విజయం తథ్యం. రణభేరి మోగింది. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. బాలయోధుల మీద పుష్ప వర్షం కురిసింది. కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ రాజధానిలో ప్రతిజ్ఞలు చేశారు. ‘‘శత్రువును తుదముట్టించిగాని తిరిగిరాం’’ అని. దేశం కోసం ప్రాణాలొడ్డటమే ప్రతి సైనికుడికి లభించగలిగిన అత్యున్నత గౌరవం. బాలవాక్కులు ప్రజలందర్నీ ఉత్తేజిత్తుల్ని చేశాయి. పన్నెండేళ్ల పసివాడు సైన్యానికి అధినాయకుడు. ఇప్పుడు దేశానికి సూపర్ హీరో. కాని అందరూ చిన్న పిల్లలు. వాళ్లను చూసి కంటతడి పెట్టని తల్లి లేదు. ఒక వైపు గర్వం, మరోవైపు దిగులు. సైనిక బ్యాండు మోగింది. శత్రుహననమే ఏకైక లక్ష్యంగా ముందుకు కదిలారు బాలలు.గుండెను కలిచివేసే దృశ్యాలెన్నో! తల్లి చేతుల్లో ఒదిగి నాలుగేళ్ళ కుర్రాడు ‘‘నేనూ యుద్ధానికి పోతాను’’ అంటూ మారాం చేశాడు. ‘‘నువ్వింకా చిన్న పిల్లాడివిరా’’ అంటూ ఎంత చెప్పినా వినడు. సాయంకాలపు పత్రికల నిండా ఇలాంటి హృదయ విదారకమైన వార్తా కథనాలే. అంతిమ విజయం గురించి ఎవరికీ సందేహం లేదు. ఉపన్యాసాలు, సైన్యం కదలిక వంటి కార్యక్రమమంతా రేడియోలో ప్రత్యక్ష ప్రసారమైంది. సైన్యం సరిహద్దులు దాటిన రోజు నుండే శత్రువు ఓటమి గురించిన సమాచారం వచ్చింది. ఒక సెక్టార్లో ఎదిరించిన వాళ్లందర్నీ నిశ్శేషంగా సంహరించారు పిల్లలు. ఈ అఖండ విజయానికి దేశమంతా పండగ చేసుకుంది. సంతోషంతో బాణాసంచా కాల్చారు. పత్రికల నిండా బాలల సాహసగాథలే. మృత్యుముఖంలో కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని పరాక్రమం. ప్రతి యుద్ధం కొత్త హీరోలను సృష్టిస్తుంది. అప్పటిదాకా నంబర్లుగా మిగిలిన పిల్లల పేర్లు ఇప్పుడు అందరికీ సుపరిచితం. ఆనందం పట్టలేక పిల్లల కోసం చాక్లెట్లూ, స్వీట్లూ పంపించారు తల్లులు. అవన్నీ ఏం చేసుకోవాలో తెలియక చివరికి సైనిక కమాండ్ అందరికీ విజ్ఞాపన చెయ్యాల్సి వచ్చింది. మరీ ఎక్కవగా తింటే యుద్ధపటిమ తగ్గిపోదూ! అపజయాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది.శత్రు భూభాగంలో బాగా లోపలిదాకా పురోగమించింది బాలసైన్యం. అక్కడక్కడా కొంత ప్రతిఘటన ఎదురు కాలేదని కాదు. అలాంటి సందర్భాల్లో వ్యూహరీత్యా బాల సైన్యం వెనక్కు తగ్గి తిరిగి మెరుపు దాడులు చేసింది. జూలై నెలలో చివరిసారిగా చావు దెబ్బకు సర్వసన్నద్ధమైంది సైన్యం. రిజర్వు బలగాలు కూడా వచ్చి చేరాయి. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లలకు ఉత్సాహమెక్కువ. మృత్యుభయం ఉండదు. ఈ పర్యాయం నిర్ద్వంద్వంగా విజయం వరించింది. కాని భారీ నష్టం జరిగింది. పరాజితులైన శత్రువులు కాలికి బుద్ధి చెప్పారు. సైన్యం వాళ్లను తరిమి తుదముట్టించాల్సింది. శత్రువులు యువకులు. మధ్య వయస్కులు. వాళ్ల కాళ్లు పొడుగు. అంగలు పెద్దవి. పిల్లలకందకుండా తప్పించుకున్నారు. మొత్తమ్మీద యుద్ధంలో గుండెకాయ లాంటి సెంట్రల్ సెక్టార్ వీళ్ల వశమైంది. ఇక అవలీలగా రాజధానిని ముట్టడించవచ్చు. భీకర యుద్ధం జరిగింది. ప్రతి పత్రికలోనూ యుద్ధ వార్తలే పతాక శీర్షికలు. రేడియోలో మిగతా కార్యక్రమాలన్నీ రద్దు చేసి గంటగంటకూ మారిన పరిస్థితిని ప్రసారం చేశారు. యుద్ధ విలేకరులు నిర్విరామంగా రిపోర్టు చేస్తూనే ఉన్నారు. బాలల పరాక్రమం వర్ణించనలవి కాదు. వీళ్ల ముందు పెద్దవాళ్ల ధైర్య సాహసాలు దిగదుడుపు. ఇందులో అత్యుక్తి ఎంత మాత్రం లేదు. ఎంత క్రమశిక్షణ! మృత్యువు వాళ్లకు భయపడి పారిపోయింది. కాళ్లు తెగిన వాళ్లు, పొట్టలు చీలి పేగులు బైటపడిన వాళ్లు ఎందరో! కాని ఎవరి మొహంలోనూ బాధలేదు. తుదిశ్వాస విడుస్తున్నప్పుడు కూడా శత్రు నిర్మూలనే లక్ష్యంగా ముందుకు లంఘించారు బాల సైనికులు. తమను పొడిచిన బాయ్నెట్లు లాక్కుని శత్రువు గుండెలు చీల్చారు. మాతృభూమి మీద జయకేతనం ఎగరవేయాలని చిరునవ్వుతో చివరి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఎదురెదురుగా యుద్ధం చేసినప్పుడు హతులైన పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. నాలుగు వేల మంది శత్రువులూ, ఏడు వేలమంది బాల సైనికులూ నేలకొరిగారు. ఇదంతా రహస్య నివేదికల అంచనా. విజయం దక్కింది గాని చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ యుద్ధం గురించి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయొచ్చు. దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమది. పిల్లలు పెద్దవాళ్ళ కన్నా చాలా సమర్థంగా యుద్ధం చెయ్యటమే కాదు, వ్యూహ రచనల్లో కూడా తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. అయితే తాత్కాలికంగా పరాజయం అంగీకరించి, వెనక్కు తగ్గిన శత్రువును తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించిన వారూ ఉన్నారు. నిజమే. చివరి దశలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. విజయం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారినంత పనైంది. ఒకరకంగా చూస్తే శత్రువు యుద్ధానికి సన్నద్ధం కాలేదు. కాని పోరాట క్రమంలోనే కొత్త మెలకువలు నేర్చుకున్నట్టు అనిపించింది. ప్రతి యుద్ధమూ క్రితం దానికన్నా క్లిష్టతరంగా తయారైంది. ఎంత ధైర్య సాహసాలున్నా పిల్లలు పిల్లలే. ఒక బాయ్నెట్ పోటుతో ఇద్దరు ముగ్గుర్ని నేల కూల్చవచ్చు. ఇక ఎదురెదురు పోరాటంలో గట్టిగా తన్నినా పిల్లలు కింద పడక తప్పదు. అయితే బాల సైన్యానికి సంఖ్యాబలం ఎక్కువ. అందువల్ల యుద్ధ రంగంలో ఎటుచూసినా వాళ్లే అన్నట్టుగా పోరాటం చేశారు. బుడతలు కదా. శత్రువుల కాళ్ల కిందికి దూరి గాయపర్చారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఎలాగో యుద్ధవ్యూహంలో వాళ్లు నేర్చుకోవడం వేరు. ఎదిరించటం వేరు. చిన్న చిన్న క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం వేరు. పిల్ల రాక్షసులని వాళ్లకు పేరొచ్చిందంటే కారణముంది మరి. బాల సైనికుల జయజయ ధ్వానాలతో పొరుగు దేశం మార్మోగిపోయింది. అక్కడి జనాభాకు ముద్దొచ్చే పసిపిల్లలేం కాదు వీళ్లు. ‘వయసుతో ప్రమేయమేముంది? శత్రువు శత్రువే– వీధుల్లో విజయ విహారం చేస్తున్నప్పుడు కాల్పులు జరిపారు. కొందర్ని పట్టుకుని శూలాలకు గుచ్చి ఎగరేశారు. మరి కొందరి కళ్లు పీకారు’ అని చెప్పుకున్నారు. యుద్ధంలో ‘నిజం’ ఎప్పుడూ ఎవరికీ తెలియదు. ఓడిపోయిన వాళ్లకు క్రౌర్యమెక్కువ. అణచుకోలేని కోపాన్ని, ద్వేషాన్ని అనేక వికృత పద్ధతుల్లో ప్రదర్శిస్తారు. తేళ్ల లాగ, జెర్రుల్లాగ, విషనాగుల్లాగ నేల ఈనినట్టుగా పిల్లలు! ఎంత మందిని చంపగలరు? కాలరాచినా మళ్ళీ మళ్ళీ పుట్టే కీటకాల్లాగ పడుతూ లేస్తూ పరిగెత్తుకొస్తూనే ఉన్నారు పిల్లలు. పసివాళ్లకు మాత్రం కోపం రాదా! ఊళ్లకు వూళ్లే తగలపెట్టారు. జనం గుమిగూడిన చోటల్లా తూటాలు కురిపించారు. కాని హింసవల్ల ఎప్పుడూ సద్దుమణగదు. తమ పిల్లలు వీరమరణం పొందారని తెలిసి తల్లిదండ్రులకు నెత్తురు సలసలా కాగింది. పైన పరదేశంలో పరాజితులైన సైనికుల స్థానంలో గెరిల్లాలు పుట్టుకొచ్చారు. గెరిల్లాలు ఎదిరించి యుద్ధం చెయ్యరు. పొంచి ఉండి దొంగ దెబ్బ తీస్తారు. ఇలాంటి సంఘటనలు రోజూ పునరావృతమవుతున్నప్పుడే, ఆక్రమిత ప్రాంతంలో జరిగిన ఒక దారుణంతో దేశప్రజల కోపం హద్దులు తెంచుకుంది.గ్రామప్రాంతంలో గస్తీకి వచ్చిన ఒక బాల లెఫ్ట్‌నెంట్ కాలువ దగ్గర బట్టలుతుకుతున్న ఒక స్త్రీని ‘ఊరికి దారెటు?’ అంటూ అడిగాడు. అసలే సైనికుడు. చెబితే ఏం ఘాతుకం చేస్తాడోనని భయపడి,‘‘నీకెందుకు నాయనా? ఇంకా మీసాలైనా మొలవలేదు. మీ అమ్మ దగ్గరకెళ్లు’’ అంటూ మందలించింది ఆవిడ. కోపంతో రెచ్చిపోయిన లెఫ్ట్‌నెంట్ చంపటానికి కత్తి దూశాడు. కాని ఆమె ఆ కుర్రాణ్ణి ఒడుపుగా పట్టుకుని, మోకాళ్ల మీదికి వంచి దుడ్డుకర్రతో ముడ్డిమీద నాలుగు తగిలించింది. ఆ తర్వాత మన సైనికుడు చాలా రోజులపాటు కూర్చోవటానికి ఇబ్బంది పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి సిగ్గుతో ముడుచుకుపోయిన కుర్రాడు ఆమె వదిలిన తర్వాత తల వంచుకుని పరిగెత్తాడు. అవమానంతో ఎవరి కంటా పడలేదు. కాని ఆక్రమిత ప్రాంతంలో ప్రజల దుందుడుకు చర్యల గురించి కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించాలని ఓ రూలుంది. అందువల్ల లెప్టినెంట్ అయిష్టంగానైనా ఈ సమాచారం చేరవేయక తప్పలేదు. యుద్ధంలో మరణం అనివార్యం. రెండు వైపులా నష్టాలుంటాయి. కాని ఇలాంటి అవమానాన్ని భరించడం అసాధ్యం. ‘విజేత’ మీద చేయి చేసుకున్న ఆ మహిళ శత్రుదేశ పౌరులకు హీరోయిన్గా మారింది. ఆమె ధీరోదాత్త చర్య జాతికి గర్వకారణమన్నారు. ఆమె గురించి గేయాలు, స్పెషల్ ఫీచర్స్, కథలు రాశారు. ఆదర్శమహిళగా కీర్తించారు. శత్రువులు ఆమెను వెంటనే కాల్చి చంపారని ఒక కథనమూ, దీర్ఘకాలం జీవించి అందరి మన్ననలూ అందుకున్నదని మరో కథనమూ ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద ఈ సంఘటన వల్ల రెండు దేశాల మధ్య వైరం మరింత తీవ్రరూపం దాల్చింది. అంటే యుద్ధనీతిని మరిచి పరస్పరం వినాశనమే తమ లక్ష్యరూపం దాల్చింది. అంటే యుద్ధనీతిని మరిచి పరస్పరం వినాశనమే తమ లక్ష్యమని ప్రకటించుకున్నాయి. ఆకురాలు కాలం మధ్యలో హింస పరాకాష్ఠకు చేరుకుంది. అనేక సెక్టార్లలో ఒకర్నొకరు తెగనరుక్కున్నారు. కొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా మిగలలేదు. ఎక్కడా సైనికులు కనిపించకపోవటంతో యుద్ధం ముగిసింది కాబోలుననుకున్నారు సామాన్య పౌరులు. కాని అంతలోనే కొత్త బలగాలు వచ్చాయి. సమరం పునఃప్రారంభమైంది. కొన్నిసార్లు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శత్రువులను గుర్తించలేక సైనికులు తమవాళ్లనే చంపుకున్న సంఘటనలూ లేకపోలేదు. ఎవరి తూటాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. నలుదిశలూ శవాల గుట్టలు దర్శనమిచ్చాయి.యుద్ధం ముగిసింది. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. పైగా అదో ఆట. చీకట్లో, బురదలో, మురికిలో ఆడుతూ పాడుతూ గడిపారు. శత్రువులకు మాత్రం ఇదంతా సుఖంగా లేదు. పెద్ద శరీరాలు కలుగుల్లో ముడుచుకుని ఎంతకాలం ఉండగలవు? బూడిదరంగు యూనిఫారాల్లో, మొహాలకు గ్యాస్ మాస్క్‌లతో ఇలాగే పుట్టాం కాబోలు అన్నట్టుగా నిర్విరామంగా కేరింతలు కొట్టారు పిల్లలు. ఎలుకల్లా చిన్న శరీరాలు. ఉన్న కాసింత చోటులో ఆటలాడుకున్నారు. దాడి జరిగినప్పుడు క్షణంలో తిరుగుకాల్పులు జరిపారు.శత్రువుకు అసలేం జరుగుతున్నదో అంతుపట్టలేదు. చిన్న పిల్లలకా సమస్య లేదు. వాళ్లు అర్థం చేసుకోకుండానే ప్రతిస్పందిస్తారు. అంటే పెద్దలకన్నా పిల్లలే మంచి సైనికులు. మృత్యుభయం కాదు, వినోదం ముఖ్యం వాళ్లకు. వార్ ఈజ్ ఫన్. సైనికుల్లో ఐకమత్యం అవసరం. జత కట్టడం బాలలకు సహజలక్షణం.చలికాలం మాత్రం కష్టాలు తప్పలేదు. శీతగాలికి తోడు కుండపోతగా వర్షం. కాని కష్టాల్లో ఉన్నామని కూడా చెప్పుకోలేని పసిపిల్లలు. దేశం మాత్రం వాళ్లకు బ్రహ్మరథం పట్టింది. సినిమా హాళ్లలో రోజూ బాలసైనికుల కవాతు దృశ్యాలు, కమాండర్ ఇన్ చీఫ్‌తో ఇంటర్వ్యూలు. జనం ఎగబడి చూశారు. క్రిస్మస్ సీజన్లో తల్లిదండ్రుల హృదయాలు పిల్లలకోసం తపించాయి. క్రిస్మస్ చెట్ల మీద ఎన్ని దీపాలు వెలగనీ–వాళ్లు లేని ఇల్లు ఎడారి. పిల్లలకు పండగ స్పృహ కూడా లేదు. సాయంత్రానికి గాని క్రిస్మస్ బహుమతుల పార్శెళ్లను తెరచి చూడలేదు. యుద్ధానుభవం వాళ్లలో బాల్యాన్ని హరించి వేసింది. శత్రువుల శరీరాలను తూటాలతో జల్లెడ చెయ్యటమే ఏకైక లక్ష్యం. అదే జీవితం. అందుకే మరణం. ఓ కుర్రాడు పాత జ్ఞాపకాలతో ఏడ్చాడు. వాణ్ణందరూ ‘పాలపీక’ అంటూ ఆట పట్టించారు. ఆ తర్వాత కోర్ట్ మార్షల్ చేశారు. సుదీర్ఘ యుద్ధంలో శత్రువు మనోస్థైర్యం తగ్గింది. ఎన్నాళ్లు గడిచినా ‘విజయం’ కనుచూపు మేరలో కనిపించలేదు. కొత్త సంవత్సరం వచ్చింది. యుద్ధంలో నిర్ణాయకమైన దశ వచ్చింది. అత్యాధునిక సామూహిక మారణాయుధాలను సమకూర్చుకుంది బాలసైన్యం. రాత్రనక, పగలనక దళాల కదలికలు కొనసాగాయి. పిల్లలు ఓ సంవత్సరం ఎదిగారు. అంటే యుద్ధ విద్యలో మరింత ఆరితేరారు. శత్రువు కూడా చివరి ప్రయత్నంగా ప్రతిఘటన ప్రారంభించింది. అతి భీకర యుద్ధం జరిగింది. శవాలు, క్షతగాత్రులు, శతఘ్నులు, క్షిపణలు, ట్యాంకులు, ఇతర సాయుధ శకటాలు శత్రువును నిలబడనీయలేదు. ఇక శత్రువుది ఓటమినంగీకరించక తప్పని పరిస్థితి. కాని ఇంత త్యాగం చేసిన బాలసైన్యం లొంగిపోయిన వాళ్లను యుద్ధ ఖైదీలుగా అంగీకరించటానికి ఇష్టపడలేదు. బందీలలో చాలామందిని కాల్చివేశారు.ఆధునిక చరిత్రలో ఇది అత్యంత ప్రముఖ యుద్ధం. మిలటరీ అకాడమీలలో దీన్ని పాఠ్యాంశంగా చేర్చారు. వ్యూహ ప్రతివ్యూహాల్ని గురించి చర్చలు, పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా ‘శత్రువును చుట్టుముట్టి చంపటం ఎలా?’ అన్నది సైనికులందరూ తప్పక నేర్చుకోవల్సిన విషయం. డెబ్భై ఏళ్ల తర్వాత 2048లో జరిగిన యుద్ధంలో జనరల్ స్లడెల్స్నార్ప్ ఈ వ్యూహంతోనే స్లివోక్వార్క్ల మీద విజయం సాధించాడు.యుద్ధం ముగిసింది. మిగిలిన ఖైదీలతో బాలసైన్యం రాజధానిలో ప్రవేశించింది. స్వాగత తోరణాలు అలంకరించారు. వీధులలో విజయగీతాలు గానం చేశారు. పరాజితులకు ‘శాంతి షరతులు’ విధించవలసిన సమయం వచ్చింది. తల వొంచుకున్న శత్రు సైనికుల మీద, విజయోత్సాహంతో వెలిగిన బాలల మీద కెమెరాలు లెన్సులు గురి చేశాయి. రేడియోలో వీరి ఆగమన సందోహమంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కమాండర్ ఇన్ చీఫ్ షరతులొక్కొక్కటి చదివాడు. పరాజితులు దేశం మీది సార్వభౌమాధికారం తమకు ధారాదత్తం చేయాలి. బందీల రక్షణ, పోషణ ఖర్చులు వాళ్లే భరించాలి. రెండు దేశాల యుద్ధ వ్యయం కూడా వాళ్లే చెల్లించాలి. ఆ ప్రభుత్వ తలబిరుసు నిర్ణయం వల్లే యుద్ధం జరిగింది గనుక ఇది తప్పదు. హాలులో çశ్మశాన నిశ్శబ్దం వ్యాపించింది. పెట్టమన్న చోటల్లా పరాజితులు సంతకాలు పెట్టారు. అప్పుడు వినిపించిన ఒకే ఒక శబ్దం బంగారు పాళీ కాగితం మీద చేసిన బరబర.ఇంత చరిత్రాత్మకమైన డాక్యుమెంటును జాతీయ మ్యూజియంలో భద్రపరచారు. యుద్ధం తర్వాత బాల సైనికులకు సెలవులిచ్చారు. ఇప్పుడు వాళ్ల అవసరం కూడా లేదు. చివరిగా రాజధాని వీధుల గుండా వాళ్లు చేసిన కవాతులో పిల్లలు ఎలుగెత్తి జై కొట్టారు. ముఖ్యంగా అంధులై కొందరు, కాళ్లూ చేతులూ తెగి కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వాళ్లు కొందరు, అత్యంత సహజంగా ఉన్న ఈ అవయవాలను ప్రేక్షకులు గుర్తించలేకపోయారు.ఒక దేశ చరిత్రలో సువర్ణ ఘట్టాలనేకం ఉండొచ్చు కాని ఇంత అత్యద్భుతమైన, జాతికే గర్వకారణమైన క్షణం మరొకటి రాదు. ఆ రోజును ‘విజయదివస్’గా పండుగ చేసుకుంది దేశం.ప్రతి ఏడూ స్కూల్ పిల్లలు చేతుల్లో జాతీయ జెండాలతో మరసైనికుల సమాధులను దర్శిస్తారు. పిల్లలుగదా అతి చిన్న తెల్లటి శిలువలు.పూలు చల్లి, వాళ్ల త్యాగాన్ని గుర్తు చేసుకుని వస్తారు సందర్శకులు. మరో కొత్త యుద్ధం వస్తే సైన్యంలో చేరటానికి కొత్త తరం పిల్లలు సిద్ధంగా ఉన్నారు. -
ఆదిశేషుడి అంశగా...
శ్రీ కృష్ణుడి అవతారం ముగిసి ద్వాపరయుగం అంతరించింది. కలియుగంలో అధర్మం విజృంభిస్తున్నది. పరీక్షిత్తు, జనమేజయుడి తరువాత ధర్మపాలన కరువైపోయింది. వేదాలను పరిహసించి వ్యతిరేకించి ధర్మం తప్పి చరించే వితండ వాదాలు, మతాలు పెరిగిపోయాయి. విచ్చలవిడి జీవనం సామాన్యమైంది. నాస్తికుల ఆగడాలకు అంతులేదు. ఆస్తికులు అవమానాలపాలవుతున్నారు. నైతిక విలువలు సన్నగిల్లి కలికాలపు పోకడలు వీరవిహారం చేస్తున్నాయి. నారాయణుడు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాడు. మనకు కనిపించే దృశ్యమానమైన జగత్తు మాత్రమే సర్వం కాదు. ఈ పథ్వీప్రకృతి మండలానికి ఆవల సప్తావరణల మీదట, అప్రాకృతమైన, విలక్షణమైన పరమపావనమైన ప్రదేశం ఒకటుంది. ఆ దివ్యప్రదేశాన్ని శ్రీవైకుంఠమని అంటారు. అది క్షతిలేని నిత్యవిభూతి. అక్కడికి చేరిన జీవులకు మళ్లీ పుట్టుక ఉండదు. వారిని ముక్తులని అంటారు. అక్కడ నారాయణుని ప్రేమ వలె విరజానది అనునిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ముక్తజీవి ఆ నదిలోస్నానం చేస్తే ఆత్మకు అంటియున్న సూక్ష్మశరీరపు వాసనలన్నీ తొలగిపోయి దివ్యశరీరం వస్తుంది. అక్కడ ఇరమ్మదమనే సరస్సు, దాని ప్రక్కన అశ్వత్థ (రావి) వృక్షం కూడా ఉన్నాయి. అక్కడ ముక్తులతో పాటు నిత్యసూరులు ఉంటారు. నిత్యులు (నిత్యసూరులు) అంటే– నిరంతరం నారాయణుని సేవించే అనంతుడనే మహాసర్పము, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన వారు అక్కడ నివసిస్తుంటారు. నారాయణుడు శయనించినపుడు మెత్తని పరుపుగానూ, కూర్చున్నపుడు మంచి ఆసనంగానూ, హరి ప్రతికదలికకు అనుగుణంగా తనను తాను అనుగుణంగామార్చుకుంటూ ఉండే అనంతుడు అత్యంత ప్రియసేవకుడు. అంతులేనంతగా విస్తరించగల శక్తిమంతుడు కనుక ఆ మహాసర్పాన్ని అనంతుడని అంటారు. మొట్టమొదటి శేషుడు కనుక ఆదిశేషుడనీ అంటారు. త్రిలోకాలలో స్వామిని ఎక్కడికైనా తీసుకుని వెళ్లగల అద్భుతమైన సజీవ వాహనం గరుత్మంతుడు. అపారమైన విష్ణు గణాల సేనలకు సేనానాయకుడు, సేనానాథుడు విష్వక్సేనుడు. జీవులై సంసారబంధాల్లో చిక్కుకున్నా, భగవంతుడిని ఆరాధించి, హరి దివ్యానుభూతిని అనుభవించి, నారాయణుని అనుగ్రహంతో ముక్తిపొంది పరమపదం చేరి పరంధాముని సేవలో మునిగిపోయే అనేకమంది ముక్తులు వైకుంఠ వాసులు. చింతాక్రాంతుడైన శ్రీహరి ఆ వైకుంఠనగరిలో ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో చెప్పడం కష్టం. అదొక ఆనందవనం, ఆనంద నిలయం. అమృత సరస్సులు, మనోహరమైన ఉద్యానవనాలు, కాంతి పుంజాల తోరణాలు, నిర్మలమైన సుగంధ వాయువులు, అపురూపమైన ఫలవృక్షాలు, బంగారు మేడలు, రత్న ఖచిత ప్రాకారాలు, ఆలయాలు, మంటపాలు గోపురాలతో అలరారే సువిశాల ప్రదేశం. ఆ వైకుంఠంలో మణిమయమైన వేయి స్తంభాల మంటపంలో దివ్యచందన సుగంధాల మధ్య తనకు పరుపుగా అమరిన అనంతునిపై హరి శయనించి ఉన్నాడు ఆ హరి పసుపుపచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు (పీతాంబరుడు), ఓ పక్కన భూదేవి, మరో పక్క శ్రీదేవి ఉన్నారు. అతను నాలుగు చేతులలో శంఖ చక్ర గదాయుధాలు ధరించి మరో చేత పద్మం పట్టుకుని ఉంటాడని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి. ఆనందం తప్పమరేదీ ఉండని ఆ మహాలోకంలో నారాయణుడు ఉన్నా మనసులో విచారం హరి వదనంలో ప్రతిఫలిస్తున్నది. విచారవదనాన్ని గమనించి అనంతుడు. ఆ ‘‘ఏమిటి స్వామీ చింతాక్రాంతులైనారు?’’ అనడిగాడు. ఈ మానవులకు మంచికోసం ఇచ్చిన శరీరాన్ని బుద్ధిని మంచికి ఉపయోగించడం లేదే, ఇతరుల స్త్రీలను, సంపదలను హరించడానికి వినియోగిస్తున్నారే, పరమ స్వార్థపరులై పరమపదాన్నే మరిచారే అని హరి ఆలోచిస్తున్నాడు. ఆ విషయమే అనంతుడికి వివరించారు.హరి: దేహమే ఆత్మ అనుకునే అజ్ఞానులకు, బుద్ధి వక్రీకరించి దుర్మార్గంలో జీవించే మూఢులకు జ్ఞానోదయం కలించడం ఎలా అని మధనపడుతున్నాను.అనంత: సంభవామి యుగేయుగే అంటూ ధర్మసంస్థాపనకు సంభవిస్తారు కదా స్వామీ, మళ్లీ అవతరించే సమయం ఆసన్నమయినట్టున్నది కదాహరి: ఈసారి నేను కాదు, నీవు పుడమిలో అవతరించాలి. ఓ రెండొందల సంవత్సరాలు జీవులను ఉద్ధరించి మరలి రావాలి.అనంత: స్వామీ... మిమ్మల్ని విడిచి రెండు శతాబ్దాలా? అయినే నేనేం చేయగలను? రామావతారంలో లక్ష్మణుడిగా మీ వెంటే ఉన్నాను. మీరు శ్రీకృష్ణుడైనపుడు బలరాముడిగా కాపాడుకున్నాను. మీరు లేకుండా నేను భూమిపై నిలువలేను. మీరు లేకుండా మీవలె మహాయుద్ధాలు చేయగలనా? మీరు శంఖ చక్రగదాశార్ఞ ధరులు. నాకా ఏ ఆయుధాలూ లేవు. హరి: అనంతా, ఇప్పుడు యుద్ధాలతో పనిలేదు. ఆయుధాల అవసరమే లేదు. నీవు వేనోళ్లతో విజ్ఞానం పంచాలి. నీ వేయిపడగలతో ఆధ్యాత్మిక జ్ఞాన కాంతులు విరజిమ్మాలి, వైకుంఠానికి నిచ్చెనలు వేయాలి. పాపాత్ములను కడిగి పరమాత్మునివైపు నడిపించాలి. నీవే ఆచార్యుడివై వెళ్లాలి. బోధకుడవై సాధించాలి. నీకు జ్ఞానమే ఆయుధం. జీవులను పంచ సంస్కారములతో సంస్కరించు నాయనా. నారాయణుడికన్న గురువే గొప్పయని నీవు జీవించి చూపాలి. యాగాలు చేయాలని, కఠినమైన తపస్సులు చేయాలని కష్టాలు పెట్టకూడదు. భూరి దానాలు చేయాలనే సంక్లిష్ఠమైన నిర్బంధాలు, బాధలు ఏమీ లేకుండా శరణుతో సులభమైన తరుణోపాయములు నీవు చెప్పవలసి ఉంటుంది. ఆచార్యుని సేవతోనే జ్ఞాన సముపార్జనతోనే హరి లభిస్తాడని నీవు వివరించాల్సి ఉంటుంది. నా నిత్యవిభూతికి నీవెవరిని పంపినా కాదనను. నన్ను కాదని నిన్నాశ్రయించినా నాకు ఆనందమే. బద్దుడైన జీవిని బాగుచేయడానికి నీ మాట ఏదయినా నామాటే. నిన్ను కాదని నేనెవరకీ మోక్షమీయను, నీకిష్ఠుడే నాకిష్ఠుడు, నీ మాటే నామాట, నీమతమే నా మతము, నీ మంత్రమే నా మంత్రము, నీ ధ్యానమే నా ధ్యానం. నీకు నాకు మధ్య భేదమే లేదు. నిన్ను ఆశ్రయించిన వారి పక్షాన నీవు శరణాగతి చేసినా నాకు సమ్మతమే. నీవారు నావారనే భేదం చూపను.భవబంధాలలో చిక్కుకున్న ఈ బద్ధుడు ఏ విధంగానైనా బాగుపడితే ఇక నాకు కావలసిందేముంది? అని నారాయణుడు వివరించాడు.ఇది చాలా విశేషం. మోక్షాధికార ముద్రను హరి అనంతుడికి ఇచ్చారన్నమాట. అంటే అనంతుడి ఆజ్ఞలేకుండా మోక్షం ఎవరికీ దొరకదు. దీన్ని ఉభయ విభూతి నిర్వహణాధికారం అంటారు. విభూతిద్వయాధిపత్యంతో రామానుజుడై ఆదిశేషుడు అవతరించడానికి హరి ఆదేశించాడు.హరి ఆజ్ఞను అనంతుడు వేయిపడగలు వంచి శిరసావహించాడు. భూతపురి శ్రీ పెరుంబుదూర్ అది దక్షిణ భారతదేశంలోని శ్రీపెరుంబుదూరు. భూతపురమనీ, అరుణారణ్యము అనీ పిలుస్తారు. శంకరుడు దిగంబరుడై నాట్యం చేస్తూ ఉంటే భూతములు పరిహాసాస్పదంగా నవ్వినారట. శివుడు కోపించి అధోలోకంలోకి వారిని శాపగ్రస్తుల్ని చేసి తోసేసారట. శాపం నుంచి విముక్తి కోసం ఆ భూతములు ఈ అరుణారణ్య క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మిమ్మల్ని శివుడు అనుగ్రహిస్తాడని వరమిచ్చాడు.‘‘నేను ఇక్కడ నివసిస్తాను, ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యమైన పురంగా నిర్మించండి’’అని ఆ భూతాలను హరి ఆదేశించాడు. భూతములు నిర్మించిన పురము కనుక దీనికి భూతపురమనే పేరు వచ్చింది. ఆదిశేషుడు రాబోయే కాలంలో అక్కడ అవతరిస్తారనే కాబోలు, మాధవుడు కేశవుడైవెలిసాడని ప్రతీతి.ఆసూరి కేశవసోమయాజి అనే శ్రీవైష్ణవస్వామి. యామునా చార్యుల శిష్యుడు శ్రీశైలపూర్ణుడు (తిరుమలనంబి). వీరి చెల్లెలు కాంతిమతిని ఆయన వివాహం చేసుకున్నారు. స్థిరమైన బుధ్ది, మితభాషణం, నిత్యానుసంధాన లక్షణాలతో అత్యంత నిష్ఠాగరిష్ఠులు కేశవ సోమయాజి. నీతిమంతుడు. అసత్యమాడడు. ఆయనకు నిరంతరం హరి నామస్మరణమే. కాని ఆ జంట సంతానంలేక పరితపిస్తున్నారు. నోములు వ్రతాలుచేస్తున్నారు. జపాలు తపాలు చేస్తున్నారు. పెద్దలు సూచిస్తే చంద్రగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేశారు. ఆ తరువాత దానధర్మాలు చేశారు. పుత్రకామేష్ఠి చెన్నై(మద్రాస్) నగరంలో దివ్యదేశమైన తిరువళ్లికేన్ ఉంది. అక్కడ కైరవిణి పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడ వెలసిన పార్థసారథి పెరుమాళ్ కు పూజలు చేశారు. అక్కడే పుత్రకామేష్ఠి యాగాన్ని కూడా చేసినారు. పార్థుడికి గీత బోధించి జగద్గురువైన పార్థసారథి కరుణతో కేశవసోమయాజి కాంతిమతీ దంపతుల సంతానరూపంలో మరొక జగద్గురువు రాబోతున్న శుభ ఘడియలు అవి.దశరథుడి తరువాత పుత్రకామేష్ఠి యాగాన్ని కేశవసోమయాజులే చేసినట్టు కనిపిస్తుంది. పుత్రకామేష్ఠి యాగం తరువాత రాముడు జన్మించినట్టే, కాంతిమతీ కేశవులకు రామానుజుడు పింగళ నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ పంచమి, గురువారం కర్కాటక లగ్నం మధ్యాహ్నం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినాడు. అది నవవసంతం.శ్లోకం: మేషార్ద్ర సంభవం, విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే(అర్థం: మేషం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టి, విష్ణువును చేరే మతాన్ని నిర్ధారించిన వాడైన రామానుజుడినే భజిస్తాను)కుమారుడు ఉదయించాడని కేశవ సోమయాజి ఆనందించి భూతపురములో ఇంటింటికీ చెరుకు ముక్కలు పంపించినాడు. తిరుమలలో నున్న తన బావమరిది శ్రీ శైల పూర్ణులకు పుత్రోదయ శుభవార్త పంపినాడు. వెంటనే శ్రీశైలపూర్ణులు పెరుంబుదూరు వచ్చి మేనల్లుడిని పరికించాడు. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు...ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. ఈతనెవరు? నమ్మాళ్వార్ చెప్పిన భవిష్యదాచార్యుడు ఇతడేనా? కన్నులు అశ్రుపూరితములైనాయి.‘‘ఏమిటన్నయ్యా అంతగా చూస్తున్నావు?’’... అంది కాంతిమతి. ‘‘కాంతిమతీ. నీ జన్మధన్యమైందమ్మా’’ అని మాత్రం అన్నాడు. మిగిలిన విషయాలు కాలాంతరంలో తెలుస్తాయన్న ఉద్దేశంతో. నామకరణం చేసే ఘడియ వచ్చింది. శ్రీశైలపూర్ణుల పైనే ఆ బాధ్యత పడింది. లక్ష్మణుడు జన్మించిన లగ్నంలో పుట్టినవాడు కనుక లక్ష్మణుడనీ, రామానుజుడనీ (రాముని తమ్ముడు) నామకరణం చేశారు. అదే సమయంలో మధురమంగళంలోని కాంతిమతి చెల్లెలు దీప్తిమతి, కమలనయనభట్టులకు పుత్రుడు జన్మించాడు. అతనికి మేనమామ గోవిందుడని నామకరణం చేశారు.ఒకరోజు బ్రహ్మోత్సవాలలో కేశవస్వామి రథం ఆసూరివారింటి ముందు ఆగింది. కాంతిమతీ కేశవసోమయాజి దంపతులు కర్పూర హారతి ఇచ్చి మంగళాశాసనం చేసినారు. తరువాత కదలవలసిన రథం ఎంతలాగినా కదలడం లేదు. కేశవస్వామి ఉత్సవమూర్తి ఆసూరి వారి ఇంటివైపు మరలి ఉంది. కేశవమూర్తి దంపతులకు ఈ మధ్యనే తేజోవంతుడైన పుత్రుడుదయించాడని తెలిసిన అర్చకులు రథం ఆగడంలో ఏదో మర్మముందనుకొని, ఆసూరిదంపతులతో మీ పుత్రుడిని కొనిరండని కోరారు. వారిని రామానుజుని తీసుకుని వచ్చి కేశవస్వామికి చూపిన స్వామి ఆశీస్సులు, అర్చకుల అక్షింతలు అందుకున్న తరువాత రథం కదిలింది. వైష్ణవస్వాములంతా ఆశ్చర్యపోయారు.స్వామి కూడా చూడాలనుకుంటున్నాడు, ఎవరీ బాలుడు శేషుడా లేక విష్వక్సేనుడా? అనుకున్నారు. ఊరేగింపు ముగిసిన తరువాత వచ్చి కొందరు ఈ బాలుడిని చూసారు. నిద్రలో బుసలు కొడుతున్నట్టు పడకలో కుండలిగా నున్నట్టు వారికి తోచింది. ఆ బాలుడికి దిష్టి తగులుతుందని తల్లికి భయం. మీరు ఈతడు మహర్జాతకుడని అందరికీ చెప్పకండి. మా అన్నకు పట్టిన పిచ్చి మీకూ పట్టినట్టుంది. మనమేం పుణ్యం చేసామని మనకు భగవంతుడో ఆతని సేవకుడో పుత్రుడై పుడతాడు? ఇవన్నీ అందరితో అంటూ నా కొడుక్కు దృష్టిదోషం తగిలేట్టు చేయకండి. నరుడి చూపుకు నల్ల రాయి కూడా పగులుతుందంటారు. అని కర్పూరంతో దిష్ఠి తీసిందాతల్లి. మిరపకాయల దిష్టి తీసి మంటలో వేస్తే పెళ పెళ లాడే చప్పుడుతో కాలిపోయాయి. ఈమె కూడా చిటచిట మెటికలు విరిచింది. చెడు చూపులు సోకుతాయని అలంకరించడం మానేసింది. ఓరోజు బాలుడు పాలు తాగకపోతే దిష్టి సోకడం వల్లనే అని ఆమె అనుమానం. మరోసారి బాలుడు పాలు తాగకపోతే ఏమిటా అని బాలుని తీసుకుని ఆరుబయట మంచిగాలిలో పక్కమీద పడుకోబెడితే కిలకిలమని నవ్వుతాడట. తల్లి చంకనుండి జరజరపాకుతూ సర్రున తలెత్తి చూస్తాడట. బోర్లపడి రొమ్ముతో పాకుతాడట. అతని అమితమైన తేజస్సులో మేనమామకు అద్భుతమైన భవిష్యత్తు దర్శనమైంది. గ్రహచార లక్షణాలను పరిశీలించాడు. ఇతను సామాన్యుడు కాడని శ్రీశైలపూర్ణుడు ఊహించాడు. చెవిదాకా విస్తరించిన కన్నులు... ఈతను కంటితోనే వింటాడా ఏమి? తల మీద విష్ణుపాదముల గుర్తుల వలె ఉన్నాయి. ఇది మహాసర్పలక్షణం. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
చెవిలో మంత్రం
చెవిలో పూలు పెట్టడం విన్నారు కదా. ఈసారి చెవిలో మంత్రాలు ఊదడం గురించి వినండి. ఈ స్వామీజీకి జ్ఞానోదయం కన్నా.. కర్ణోదయమే ఎక్కువ. కర్ణోదయం అంటే? చదవండి. అర్థమౌతుంది. తోక బిట్టు ఏంటంటే... ఈసారి ఏ స్వామీజీ దగ్గరకు వెళ్లినా నోరు మూసుకుని ఉండండి. ఆ తర్వాత ఆయన నోరు విప్పడం కష్టమే. రాజేశ్వర్‌రావు ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ఆయన ఆలోచనలు కోర్టులో పచార్లు చేస్తున్నాయి! తను కోర్టు హాల్లోకి అడుగుపెట్టగానే అందరూ లేచి నిలబడతారు. సవినయంగా నమస్కరిస్తారు. సీట్లో తను ఆసీనుడైన తర్వాతనే వాళ్లు కూర్చుంటారు. మాట్లాడడానికి తన అనుమతి కోసం ఎదురుచూస్తారు. మాట్లాడే హక్కు ఉన్న దేశం మనది. అలాంటిది కోర్టులో తన అనుమతిలేకుండా ఎవరూ మాట్లాడకూడదు! మాట్లాడితే శిక్షించే అధికారం తనకు ఉంది. న్యాయమూర్తిగా రాజ్యాంగం తనకా హక్కును ఇచ్చింది. అయితే... ఈ గౌరవాలేవీ సర్వీస్ మేటర్స్లో నిత్యం తనకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేవి కావు... రాజేశ్వర్‌రావు ఆలోచనలకు ఫుల్స్టాప్ పడడం లేదు. చట్టాన్ని కంఠతా పట్టిన తనకు ఎలాంటి కేసులోనైనా న్యాయాన్ని సమంగా తూచడమే తెలుసు. కానీ వ్యక్తిగా తనకు న్యాయం జరిగేలా తీర్పు దొరికే సెక్షన్ మన పీనల్ కోడ్‌లోనే ఉండదు.. అనుకుంటూ రాకింగ్ చైర్లో కూర్చుని చేతికందేటంత దగ్గరగా ఉన్న షెల్ఫ్లోంచి ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో సెల్‌ఫోన్ మోగింది. ఆత్మీయుడైన స్నేహితుని నుంచి ఆ ఫోన్ కాల్. రాజేశ్వర్రావుకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడా స్నేహితుడు. వాదించే సహనం లేకపోయింది రాజేశ్వర్రావుకి. ‘సరే సుధాకర్, నీ ఇష్టం. అలాగే వస్తాను’ అని ఫోన్ పెట్టేశాడు. ఎక్కడికి వెళ్లాడు? హైదరాబాద్‌లోని ఎల్బి నగర్ మెయిన్ రోడ్డులో ఓ షో రూమ్. పక్కనే రోడ్డు. లోపలికి వెళ్తే సాయి నగర్ రెసిడెన్షియల్ కాలనీ. ఓ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులో ఫ్లాట్. కార్పొరేట్ ఆఫీసును తలపిస్తోంది. వచ్చిన వాళ్లంతా రిసెప్షన్లో పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాలి. తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా వచ్చిన వాళ్లలో రాజేశ్వర్‌రావు, మిత్రులు కూడా ఉన్నారు. ఓ అరగంట తర్వాత ఆఫీస్ బాయ్ తమ నంబరు పిలవగానే అందరూ లోనికెళ్లారు. ఎ.సి గదిలో కర్టెన్లు కదులుతుంటే లావెండర్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్ పిల్ల తెమ్మెరలా వ్యాపిస్తోంది. విశాలమైన టేక్ ఉడ్ టేబుల్‌కు అవతలి వైపున కూర్చుని ఉన్నాడా వ్యక్తి. చిరునవ్వుతో ఆహ్వానించి కుర్చీలు చూపించాడు. ఆ వ్యక్తి వస్త్రధారణ కొంత వింతగానూ, కొంత విచిత్రంగానూ అనిపిస్తోంది రాజేశ్వర్రావుకి. జుట్టు పెంచి తీరుగా దువ్వి భుజాల కిందకు వదిలేశాడు. గడ్డాన్ని పద్ధతిగా ట్రిమ్ చేశాడు. గాలికి రెపరెపలాడే కాసాయం పట్టు దుస్తులు ధరించాడు. ‘ఓం’ అనే అక్షరాలు ఉన్న కాశ్మీర్ శాలువా, వేళ్లకు రంగురంగు రాళ్లు పొదిగిన ఉంగరాలు. మణికట్టుకి రుద్రాక్షల దండ. దానిని రుద్రాక్షమాల అనవచ్చా, ఫ్యాన్సీ బ్రేస్లెట్ అనుకోవాలా! మెడలో బంగారులో పొదిగిన రుద్రాక్షల దండ పారదర్శకంగా ఉన్న పట్టు వస్త్రాలలోంచి తన ఉనికిని చాటుకుంటోంది. మరో చేతికి ఖరీదైన రిస్ట్ వాచ్. మోడరన్‌గా ఉన్నాడా, ట్రెడిషనల్‌గా ఉన్నాడా అర్థం కావడం లేదు. అక్కడేం జరిగింది? వీళ్లలా కూర్చోగానే రాజేశ్వర్‌రావు కళ్లలోకి చూస్తూ ‘నీ ఉద్యోగం ఫలానా కోర్టులోనే కదా! సర్వీస్ మ్యాటర్స్‌లో ట్రబుల్స్ సృష్టిస్తున్నది ఎవరో గ్రహించావా? అన్నట్లు గత ఏడాది నీకు ప్రమోషన్ రావాల్సింది, వచ్చినట్టే వచ్చి ఆగిపోయినట్లుంది రాజేశ్వర్రావ్’ అన్నాడు స్వామీజీ. రాజేశ్వర్‌రావు ఆశ్చర్యపోయాడు. ‘టేబుల్ మీద చెట్టు కొమ్మలాంటి స్టాండుకి వెళ్లాడుతున్న రుద్రాక్ష మాలను చేతిలోకి తీసుకున్నాడు స్వామీజీ. బొటనవేలు, మధ్య వేలి మధ్యలో ఉంచి చూపుడు వేలితో ఒక్కో రుద్రాక్షను కదిలిస్తూ... ‘గ్రహదోషం పోవడానికి పూజ చేయించుకో. ఈ ఏడాది ప్రమోషన్ ఖాయంగా అందుకుంటావు’ అన్నాడు సాలోచనగా శూన్యంలోకి చూస్తూ. రాజేశ్వర్రావుకి భూమి గిర్రున తిరుగుతున్నట్లయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. అలాగే సుధాకర్‌నీ పేరుతో సంబోధించి అతడి కుటుంబ సమస్యను కూడా ప్రస్తావించాడు. రాజేశ్వర్రావుకి ఆశ్చర్యం, సంభ్రమం ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఇదెలా సాధ్యం! ఇదెలా సాధ్యం? ఏకకాలంలో ఆశ్చర్యం... సందేహం. అక్కడి నుంచి బయటికొచ్చిన వెంటనే తనకు తెలిసిన ఓ మిత్రుడికి ఫోన్ చేశాడు. ఆస్తిపూజలు, అష్టైశ్వర్యాలు! రాజేశ్వర్‌రావు అనుభవం ఇలా ఉంటే... కొందరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి హైటెక్ స్వామీజీని సంప్రదిస్తున్నారు. మరికొందరు ఆస్తి వివాదాల పరిష్కారం కోసం దర్శించుకుంటున్నారు. ఆరోగ్యప్రదాయిని పూజ, అష్టైశ్వర్య పూజ, సకల కార్యాభివృద్ధి వ్రతం... ఇలా రకరకాల పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు స్వామీజీ. ఆ స్వామీజీ మంత్రం వేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవేవీ ఆఫీసో, ఆశ్రమమో అర్థం కాని ఆ ఫ్లాట్‌లో జరగవు. భక్తుల ఇళ్లలోనూ జరగవు. ‘ఎక్కడ జరిపిస్తారో ఆ స్వామికైనా తెలుసో లేదో’ ఆవేశం ఆక్రోశం కలగలిసిన స్వరంతో ఓ మహిళ ఉడికిపోతోంది. కుటుంబ తగాదాను పరిష్కరిస్తానని ఆమె దగ్గర మూడు సార్లు పూజలకని 17 వేలు రాబట్టారు స్వామి ఆఫీస్ సిబ్బంది. ఆస్తి వివాదాన్ని చేత్తో తీసేసినట్లు తీసేస్తానని, అవతలి వారి మనసును ఇట్టే మార్చేసి మీకనుకూలంగా మలుస్తానని మరో పెద్దాయన దగ్గర ముప్ఫై వేలు రాబట్టారు. గుట్టు బట్టబయలు! సాయంత్రం ఆరున్నర. ఈవెనింగ్ వాక్ పూర్తి చేసుకుని గార్డెన్లో కుర్చీలో కూర్చుని పేపర్ తీశాడు రాజేశ్వర్‌రావు. ఉదయం చదవగా మిగిలిపోయిన వార్తల కోసం ఆయన కళ్లు వెతుకుతున్నాయి. మిత్రుడు సుధాకర్ నుంచి ఫోన్ కాల్. ‘ఎల్బీ నగర్లో మనం కలిసిన స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారట’. షాక్ తిన్నాడు రాజేశ్వర్‌రావు. ‘వారిదంతా ఒట్టి మోసమేనట. మనం టోకెన్ తీసుకుని రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నప్పుడు మనతో ఓ వ్యక్తి మాటలు కలిపాడు చూడు... అతడు కూడా స్వామీజీ ఏజెంటే. భక్తులలాగా టోకెన్లు తీసుకుని భక్తులతో కలిసి పోయి కూర్చుంటారు. తమకు తెలిసిన ఎవరో చెప్పగా వచ్చినట్లు, స్వామీజీ గురించి గొప్పగా ప్రమోట్ చేస్తారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నట్లు మాటలు కలుపుతారు. మనచేత మన పేరు, వివరాలు, మన సమస్య చెప్పిస్తారు. ఇదీ ఇక్కడ మోసం. నీకు గుర్తుందా... మనతో మాట్లాడిన వ్యక్తి మనకంటే ముందే లోపలికి స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. మరి కనిపించలేదు. ఆ వెంటనే మనకు పిలుపు వచ్చింది. ఈ ఏజెంట్లకు విషయాన్ని రెండు-మూడు వాక్యాల్లో వివరించేటట్లు శిక్షణ కూడా ఇస్తారట...’ సుధాకర్ చెప్పుకుంటూ పోతున్నాడు. ‘అలాగా... నేను మళ్లీ ఫోన్ చేస్తాను సుధాకర్’ అని ఆ ఫోన్ కట్ చేసిన రాజేశ్వర్‌రావు వెంటనే జనవిజ్ఞాన వేదిక మిత్రునికి ఫోన్ చేశాడు. ‘నిజమే రాజేశ్వర్రావ్, ఆ రోజు మీరు ఫోన్ చేసి ఆ స్వామీజీ కలిసినట్లు చెబుతూ... మీ పేరు, ఎందుకు వచ్చారనే వివరాలు కచ్చితంగా చెప్పాడని, నిజంగానే దివ్యశక్తి ఏదైనా ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగారు గుర్తుందా? అప్పటి నుంచి మేము మా దర్యాప్తు ప్రారంభించాం. దానికి ఇది క్లైమాక్స్’ అంటూ నవ్వేశాడాయన. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (కథనంలో వ్యక్తుల పేర్లు మార్చాం.) మారువేషంలో వెళ్లి... జనవిజ్ఞాన వేదిక మిత్రులు నిర్వహించిన దర్యాప్తులో... ఇలా మోసపోయిన వారి జాబితా పెద్దదిగానే తయారైంది. సందేహాన్ని నిర్ధారించుకోవడానికి మారువేషంలో అక్కడికి వెళ్లారు. తర్వాత మిగిలిన కార్యకర్తల చేత నిఘా పెట్టించారు. భక్తుల పేర్లు, వారి సమస్యలను ఎలా రాబడుతున్నాడో తెలిసిపోయింది. వారిలో కొంతమంది కలిసి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో స్వామీజీ అరెస్టయ్యాడు. -
శ్రేష్ఠమైన దానం
సిద్ధార్ధ రాకుమారుడు రాజ్యం వదిలి, దాదాపు ఆరేళ్లు ధ్యానం చేసి, జ్ఞానోదయం పొంది, బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన సంవత్సరానికి తిరిగి తన కపిలవస్తు రాజ్యానికి వచ్చాడు. అప్పటికే బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొడుకు ఒక భిక్షువుగా వచ్చాడని ఆయన తల్లిదండ్రులు కొంత బాధపడ్డా, కుమారునికి మంచి వస్త్రాన్ని బహూకరించాలని అనుకున్నారు. బుద్ధుని తల్లి గౌతమి తాను స్వయంగా అందమైన వస్త్రాన్ని నేసి కుమారుని దగ్గరకు తీసుకు వెళ్లింది. ‘‘నాయనా.. ఇది నా కానుక. తీసుకో’’ అంది. అందుకు బుద్ధుడు, ‘‘అమ్మా.. నీ వాత్సల్యానికి సంతోషం. ఈ వస్త్రాన్ని మా బౌద్ధ సంఘానికి బహూకరించు’’ అన్నాడు. ‘‘లేదు నాయనా. ఇది నీ కోసమే అల్లాను. నీవు నీ సంఘానికి నాయకుడవు. గొప్పవాడవు. పైగా నా బిడ్డవు’’ అంది గౌతమి. ‘‘నిజమే. కానీ అమ్మా.. ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే మరింత గొప్పది. ఉన్నతుడైన ఒక వ్యక్తి కంటే చెడ్డవారితో ఉన్నప్పటికీ ఆ సంఘమే గొప్పది. సంఘమే ఉన్నతమైనది. వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది. వ్యక్తి కంటే సంఘానికి చేసే దానమే శ్రేష్ఠమైన దానం’’ అన్నాడు. బుద్ధుని మాటలు విని గౌతమి ఆ నూతన వస్త్రాన్ని సంఘానికి దానం చేసింది. - బొర్రా గోవర్ధన్ -
తన కోపమే తన శత్రువు
ప్రేరణ ‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి. ఎప్పుడూ కోపంతో మండిపడే తన కుమారుడికి ఓ తండ్రి ఎలా జ్ఞానోదయం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అతడి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుందాం.. ప్రతి చిన్న విషయానికి ఆవేశమొద్దు: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరానికి సమీపంలో ఉండే నవయువకుడు మార్టిన్ ఎంతో చురుకైనవాడు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాడు. కానీ అతడిలో ఉన్న దుర్గుణం ఏమిటంటే.. విపరీతమైన కోపం. ప్రతిచిన్న విషయానికీ తీవ్ర ఆవేశానికి లోనవుతుంటాడు. కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కఠినమైన పదజాలంతో దూషిస్తుంటాడు. అలాంటి మాటలు ఎంత చేటు చేస్తాయో కూడా కోపం కోరల్లో చిక్కిన మార్టిన్ గుర్తించలేడు. తన కుమారుడి కోపావేశాలు బాగా తెలిసిన మార్టిన్ తండ్రి.. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. మార్టిన్‌కు ఓ సంచి నిండా మేకులు ఇచ్చాడు. ఇకపై కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఇంటి వెనకున్న చెక్కలోకి దిగగొట్టమని సూచించాడు. అప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడోగానీ మార్టిన్ దీనికి వెంటనే అంగీకరించాడు. మొదటిరోజు అతడి ప్రకోపానికి 35 మేకులు ఖర్చయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ చెక్కలోకి దిగుతున్న మేకుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఎందుకంటే.. కోపం వచ్చిన ప్రతిసారీ మేకు, సుత్తి తీసుకొని ఇంటి వెనక్కి వెళ్లడం మార్టిన్‌కు కష్టంగా తోచసాగింది. దీనికంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అని అనిపించింది. దీనివల్ల అతడు ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు తగ్గాయి. చివరగా ఒకరోజు ఒక్క మేకుకు కూడా పనిచెప్పే పరిస్థితి రాలేదు. అంటే.. ఆ రోజు అతడికి ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఈ పరిస్థితి మార్టిన్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. తనలో వచ్చిన మార్పును నమ్మలేకపోయాడు. వెంటనే తండ్రికి ఈ విషయాన్ని తెలిపాడు. అనకూడని మాటలతో ప్రతికూల ప్రభావాలెన్నో: కుమారుడికి నేర్పాల్సిన పాఠం ఇంకా మిగిలే ఉండడంతో.. తండ్రి ఇప్పుడు మార్టిన్‌కు మరో పని అప్పజెప్పాడు. అదేమిటంటే.. ఒక్కసారి కూడా కోపం రాని రోజు ఒక్కో మేకును చెక్కలోంచి బయటకు తీయమని సూచించాడు. మార్టిన్ తన తండ్రి చెప్పినట్టే చేశాడు. రోజురోజుకి అతడు తీస్తున్న మేకుల సంఖ్య పెరగసాగింది. కొన్ని నెలల తర్వాత అన్ని మేకులు తిరిగొచ్చాయి. మార్టిన్‌కు ఇది మళ్లీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. మార్టిన్‌ను తండ్రి తమ ఇంటి వెనకున్న చెక్క దగ్గరికి తీసుకెళ్లాడు. ‘‘మార్టిన్! నువ్వు నేను చెప్పినట్లే చేశావు. నీవు చేసిన పనికి నేనెంతగా గర్విస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీవు కొట్టిన మేకుల వల్ల చెక్కలో ఏర్పడిన రంధ్రాలను చూశావా? రంధ్రాలతో అందవిహీనంగా మారిన చెక్కను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమా? నీ కోపం కూడా అలాంటిదే. ఆవేశంలో ఒళ్లు మరిచి మాట్లాడే మాటలు వికృతమైన మరకలను సృష్టిస్తాయి. తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు కోరుకున్నా.. ఆ మరకలను చెరిపివేయలేం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావని ఆశిస్తున్నా...’’ అంటూ మార్టిన్ తండ్రి తన హితబోధను పూర్తిచేశాడు. ఈ ఆచరణాత్మక బోధనతో మార్టిన్‌లో పూర్తిగా మార్పు కలిగింది. ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు: మార్టిన్‌కు అతడి తండ్రి నేర్పిన పాఠం మనకు సైతం విలువైనదే. ఇది మనసులో నాటుకుపోతే ఇకపై అనర్థదాయకమైన కోపానికి గురయ్యే అవకాశం ఉండదు. ప్రశాంతచిత్తంతో వ్యవహరిస్తే అనుబంధాలు మెరుగవుతాయి. ఇరుగుపొరుగు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడతారు. మిమ్మల్ని అమితంగా గౌరవిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఇతరులు సైతం మీతో అలాగే ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. మార్టిన్ లాగా మేకులు దిగగొట్టడం లాంటి ఏదైనా ఒక చిన్న శిక్ష వేసుకోండి. ఆ శిక్ష అనుభవించడం కంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే సులభమని మీరు తప్పకుండా గుర్తిస్తారు. కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధించలేమన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆవేశానికి లోనుకాకూడదు: కాగితంపై పెన్సిల్‌తో రాసిన దాన్ని చెరిపేయాలనుకుంటే రబ్బర్(ఎరేజర్) ఉపయోగిస్తాం. అక్షరాలను చెరిపేసినా అక్కడ మరక మాత్రం పూర్తిగా పోదు. ‘క్షమాపణ’ కూడా ఎరేజర్ లాంటిదే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి క్షమాపణలు కోరినంత మాత్రాన వ్యక్తులపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండడమే సదా మంచిది. ఆవేశం వల్ల అనర్థాలెన్నో: ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో మనుషులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అనకూడని మాటలు అంటే అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతో నష్టాన్ని తెస్తున్నాయి. సెల్ఫోన్లలో ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్ల వంటి వాటి విషయంలో జాగరూకత అవసరం. ఇతరులపై ఉన్న కోపంతో వారికి వ్యతిరేకంగా ఏదైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు వెంటనే పంపించకుండా కొద్దిసేపు ఓపిక పట్టండి. దాన్ని ‘డ్రాఫ్ట్ బాక్స్’కే పరిమితం చేయండి. ఆవేశపడి ‘సెండ్’ చేయొద్దు, దాని ఫలితం అనుభవించొద్దు. సహనం కోల్పోతే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటామన్న విషయాన్ని తెలుసుకోవాలి. కోపం తెచ్చుకోనని బలంగా అనుకోండి: ఈసారి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కొద్దిసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పండి. ఇకపై ఎప్పుడూ కోపగించుకోనని తీర్మానించుకోండి. కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం మీకు శత్రువుల్ని సృష్టించకుండా జాగ్రత్తపడండి. మీలో రావాల్సిన మార్పును ఈరోజే ప్రారంభించండి. ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో