చెవిలో మంత్రం | The mantra in the ear | Sakshi
Sakshi News home page

చెవిలో మంత్రం

Published Mon, Jan 25 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

చెవిలో మంత్రం

చెవిలో మంత్రం

చెవిలో పూలు పెట్టడం విన్నారు కదా.
ఈసారి చెవిలో మంత్రాలు ఊదడం గురించి వినండి.
ఈ స్వామీజీకి జ్ఞానోదయం కన్నా..
కర్ణోదయమే ఎక్కువ.
కర్ణోదయం అంటే?
చదవండి. అర్థమౌతుంది.
తోక బిట్టు ఏంటంటే...
ఈసారి ఏ స్వామీజీ దగ్గరకు వెళ్లినా  నోరు మూసుకుని ఉండండి.
ఆ తర్వాత ఆయన నోరు విప్పడం కష్టమే.

 
రాజేశ్వర్రావు ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ఆయన ఆలోచనలు కోర్టులో పచార్లు చేస్తున్నాయి! తను కోర్టు హాల్లోకి అడుగుపెట్టగానే అందరూ లేచి నిలబడతారు. సవినయంగా నమస్కరిస్తారు. సీట్లో తను ఆసీనుడైన తర్వాతనే వాళ్లు కూర్చుంటారు. మాట్లాడడానికి తన అనుమతి కోసం ఎదురుచూస్తారు. మాట్లాడే హక్కు ఉన్న దేశం మనది. అలాంటిది కోర్టులో తన అనుమతిలేకుండా ఎవరూ మాట్లాడకూడదు! మాట్లాడితే శిక్షించే అధికారం తనకు ఉంది. న్యాయమూర్తిగా రాజ్యాంగం తనకా హక్కును ఇచ్చింది. అయితే... ఈ గౌరవాలేవీ  సర్వీస్ మేటర్స్‌లో నిత్యం తనకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేవి కావు... రాజేశ్వర్రావు ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పడడం లేదు.  

చట్టాన్ని కంఠతా పట్టిన తనకు ఎలాంటి కేసులోనైనా న్యాయాన్ని సమంగా తూచడమే తెలుసు. కానీ వ్యక్తిగా తనకు న్యాయం జరిగేలా తీర్పు దొరికే సెక్షన్ మన పీనల్ కోడ్‌లోనే ఉండదు.. అనుకుంటూ రాకింగ్ చైర్‌లో కూర్చుని చేతికందేటంత దగ్గరగా ఉన్న షెల్ఫ్‌లోంచి ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో సెల్‌ఫోన్ మోగింది. ఆత్మీయుడైన స్నేహితుని నుంచి ఆ ఫోన్ కాల్. రాజేశ్వర్రావుకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడా స్నేహితుడు. వాదించే సహనం లేకపోయింది రాజేశ్వర్రావుకి. ‘సరే సుధాకర్, నీ ఇష్టం. అలాగే వస్తాను’ అని ఫోన్ పెట్టేశాడు.

ఎక్కడికి వెళ్లాడు?
హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్  మెయిన్ రోడ్డులో ఓ షో రూమ్. పక్కనే రోడ్డు. లోపలికి వెళ్తే సాయి నగర్ రెసిడెన్షియల్ కాలనీ. ఓ అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులో ఫ్లాట్. కార్పొరేట్ ఆఫీసును తలపిస్తోంది. వచ్చిన వాళ్లంతా రిసెప్షన్‌లో పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాలి. తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా వచ్చిన వాళ్లలో రాజేశ్వర్రావు, మిత్రులు కూడా ఉన్నారు. ఓ అరగంట తర్వాత ఆఫీస్ బాయ్ తమ నంబరు పిలవగానే అందరూ లోనికెళ్లారు. ఎ.సి గదిలో కర్టెన్లు కదులుతుంటే లావెండర్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్ పిల్ల తెమ్మెరలా వ్యాపిస్తోంది. విశాలమైన టేక్ ఉడ్ టేబుల్‌కు అవతలి వైపున కూర్చుని ఉన్నాడా వ్యక్తి. చిరునవ్వుతో ఆహ్వానించి కుర్చీలు చూపించాడు. ఆ వ్యక్తి వస్త్రధారణ కొంత వింతగానూ, కొంత విచిత్రంగానూ అనిపిస్తోంది రాజేశ్వర్రావుకి. జుట్టు పెంచి తీరుగా దువ్వి భుజాల కిందకు వదిలేశాడు. గడ్డాన్ని పద్ధతిగా ట్రిమ్ చేశాడు. గాలికి రెపరెపలాడే కాసాయం పట్టు దుస్తులు ధరించాడు. ‘ఓం’ అనే అక్షరాలు ఉన్న కాశ్మీర్ శాలువా, వేళ్లకు రంగురంగు రాళ్లు పొదిగిన ఉంగరాలు. మణికట్టుకి రుద్రాక్షల దండ. దానిని రుద్రాక్షమాల అనవచ్చా, ఫ్యాన్సీ బ్రేస్‌లెట్ అనుకోవాలా! మెడలో బంగారులో పొదిగిన రుద్రాక్షల దండ పారదర్శకంగా ఉన్న పట్టు వస్త్రాలలోంచి తన ఉనికిని చాటుకుంటోంది. మరో చేతికి ఖరీదైన రిస్ట్ వాచ్. మోడరన్‌గా ఉన్నాడా, ట్రెడిషనల్‌గా ఉన్నాడా అర్థం కావడం లేదు.
 
అక్కడేం జరిగింది?

వీళ్లలా కూర్చోగానే రాజేశ్వర్రావు కళ్లలోకి చూస్తూ ‘నీ ఉద్యోగం ఫలానా కోర్టులోనే కదా! సర్వీస్ మ్యాటర్స్‌లో ట్రబుల్స్ సృష్టిస్తున్నది ఎవరో గ్రహించావా? అన్నట్లు గత ఏడాది నీకు ప్రమోషన్ రావాల్సింది, వచ్చినట్టే వచ్చి ఆగిపోయినట్లుంది రాజేశ్వర్రావ్’ అన్నాడు స్వామీజీ. రాజేశ్వర్రావు ఆశ్చర్యపోయాడు.

‘టేబుల్ మీద చెట్టు కొమ్మలాంటి స్టాండుకి వెళ్లాడుతున్న రుద్రాక్ష మాలను చేతిలోకి తీసుకున్నాడు స్వామీజీ. బొటనవేలు, మధ్య వేలి మధ్యలో ఉంచి చూపుడు వేలితో ఒక్కో రుద్రాక్షను కదిలిస్తూ... ‘గ్రహదోషం పోవడానికి పూజ చేయించుకో. ఈ ఏడాది ప్రమోషన్ ఖాయంగా అందుకుంటావు’ అన్నాడు సాలోచనగా శూన్యంలోకి చూస్తూ.  రాజేశ్వర్రావుకి భూమి గిర్రున తిరుగుతున్నట్లయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. అలాగే సుధాకర్‌నీ పేరుతో సంబోధించి అతడి కుటుంబ సమస్యను కూడా ప్రస్తావించాడు. రాజేశ్వర్రావుకి ఆశ్చర్యం, సంభ్రమం ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఇదెలా సాధ్యం! ఇదెలా సాధ్యం? ఏకకాలంలో ఆశ్చర్యం... సందేహం. అక్కడి నుంచి బయటికొచ్చిన వెంటనే తనకు తెలిసిన ఓ మిత్రుడికి ఫోన్ చేశాడు.

ఆస్తిపూజలు, అష్టైశ్వర్యాలు!
రాజేశ్వర్రావు అనుభవం ఇలా ఉంటే... కొందరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి హైటెక్ స్వామీజీని సంప్రదిస్తున్నారు. మరికొందరు ఆస్తి వివాదాల పరిష్కారం కోసం దర్శించుకుంటున్నారు. ఆరోగ్యప్రదాయిని పూజ, అష్టైశ్వర్య పూజ, సకల కార్యాభివృద్ధి వ్రతం... ఇలా రకరకాల పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు స్వామీజీ.  ఆ స్వామీజీ మంత్రం వేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవేవీ ఆఫీసో, ఆశ్రమమో అర్థం కాని ఆ ఫ్లాట్‌లో జరగవు. భక్తుల ఇళ్లలోనూ జరగవు. ‘ఎక్కడ జరిపిస్తారో ఆ స్వామికైనా తెలుసో లేదో’ ఆవేశం ఆక్రోశం కలగలిసిన స్వరంతో ఓ మహిళ ఉడికిపోతోంది. కుటుంబ తగాదాను పరిష్కరిస్తానని ఆమె దగ్గర మూడు సార్లు పూజలకని 17 వేలు రాబట్టారు స్వామి ఆఫీస్ సిబ్బంది. ఆస్తి వివాదాన్ని చేత్తో తీసేసినట్లు తీసేస్తానని, అవతలి వారి మనసును ఇట్టే మార్చేసి మీకనుకూలంగా మలుస్తానని మరో పెద్దాయన దగ్గర ముప్ఫై వేలు రాబట్టారు.

గుట్టు బట్టబయలు!
సాయంత్రం ఆరున్నర. ఈవెనింగ్ వాక్ పూర్తి చేసుకుని గార్డెన్‌లో కుర్చీలో కూర్చుని పేపర్ తీశాడు రాజేశ్వర్రావు. ఉదయం చదవగా మిగిలిపోయిన వార్తల కోసం ఆయన కళ్లు వెతుకుతున్నాయి. మిత్రుడు సుధాకర్ నుంచి ఫోన్ కాల్. ‘ఎల్బీ నగర్‌లో మనం కలిసిన స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారట’.

షాక్ తిన్నాడు రాజేశ్వర్రావు. ‘వారిదంతా ఒట్టి మోసమేనట. మనం టోకెన్ తీసుకుని రిసెప్షన్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు మనతో ఓ వ్యక్తి మాటలు కలిపాడు చూడు... అతడు కూడా స్వామీజీ ఏజెంటే. భక్తులలాగా టోకెన్లు తీసుకుని భక్తులతో కలిసి పోయి కూర్చుంటారు. తమకు తెలిసిన ఎవరో చెప్పగా వచ్చినట్లు, స్వామీజీ గురించి గొప్పగా ప్రమోట్ చేస్తారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నట్లు మాటలు కలుపుతారు. మనచేత మన పేరు, వివరాలు, మన సమస్య చెప్పిస్తారు. ఇదీ ఇక్కడ మోసం. నీకు గుర్తుందా... మనతో మాట్లాడిన వ్యక్తి మనకంటే ముందే లోపలికి స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. మరి కనిపించలేదు. ఆ వెంటనే మనకు పిలుపు వచ్చింది. ఈ ఏజెంట్లకు విషయాన్ని రెండు-మూడు వాక్యాల్లో వివరించేటట్లు శిక్షణ కూడా ఇస్తారట...’ సుధాకర్ చెప్పుకుంటూ పోతున్నాడు.
 ‘అలాగా... నేను మళ్లీ ఫోన్ చేస్తాను సుధాకర్’ అని ఆ ఫోన్ కట్ చేసిన రాజేశ్వర్రావు వెంటనే జనవిజ్ఞాన వేదిక మిత్రునికి ఫోన్ చేశాడు. ‘నిజమే రాజేశ్వర్రావ్, ఆ రోజు మీరు ఫోన్ చేసి ఆ స్వామీజీ కలిసినట్లు చెబుతూ... మీ పేరు, ఎందుకు వచ్చారనే వివరాలు కచ్చితంగా చెప్పాడని, నిజంగానే దివ్యశక్తి ఏదైనా ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగారు గుర్తుందా? అప్పటి నుంచి మేము మా దర్యాప్తు ప్రారంభించాం. దానికి ఇది క్లైమాక్స్’ అంటూ నవ్వేశాడాయన.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఇన్‌పుట్స్: టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్
 (కథనంలో వ్యక్తుల పేర్లు మార్చాం.)
 
మారువేషంలో వెళ్లి...
జనవిజ్ఞాన వేదిక మిత్రులు నిర్వహించిన దర్యాప్తులో... ఇలా మోసపోయిన వారి జాబితా పెద్దదిగానే తయారైంది. సందేహాన్ని నిర్ధారించుకోవడానికి మారువేషంలో అక్కడికి వెళ్లారు. తర్వాత మిగిలిన కార్యకర్తల చేత నిఘా పెట్టించారు. భక్తుల పేర్లు, వారి సమస్యలను ఎలా రాబడుతున్నాడో తెలిసిపోయింది. వారిలో కొంతమంది కలిసి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో స్వామీజీ అరెస్టయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement