డిప్యూటీ సీఎంకు స్వామిజీలు, హిందూ సంఘాల సూటిప్రశ్న
టీటీడీ పరిపాలనా భవనం ఎదుట స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధుల నిరసన
ముంతాజ్ హోటల్ నిర్మాణాలు
వెంటనే ఆపాలని, అనుమతులను రద్దు చేయాలని డిమాండ్
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరుపతి సభలో హిందూ డిక్లరేషన్ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మానికి విరుద్ధంగా సాగుతున్న విషయాలపై ఎందుకు నోరు మెదపటం లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని నిలదీశారు. తిరుమలలో అపచారాలు, తిరుమల కొండకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శనివారం స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి గోవింద నామస్మరణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..
సనాతన ధర్మం రక్షణ అంటే ఇదేనా?
తిరుమల శ్రీవారు తమ కులదైవమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. హిందూ డిక్లరేషన్ అంటూ పవన్‌కళ్యాణ్ సభపెట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్ట విరుద్ధంగా ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇస్తూ దగా చేయడం దుర్మార్గం. చెప్పిందొకటి చేసేది మరొకటిగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉంది. – శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అధ్యక్షుడు, ఏపీ సాధు పరిషత్
పవిత్రతకు భంగం కలిగిస్తే శంఖారావం పూరిస్తాం
తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులకు స్వస్తి చెప్పకపోతే గోవింద శంఖారావం పూరించి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాం. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మ విరుద్ధ పనులు సాగుతున్నా ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. మందు, మాంసాహార విందుల సౌకర్యాలతో కూడిన ముంతాజ్ హోటల్ ఏర్పాటును హిందూ సమాజం వ్యతిరేకిస్తోంది. – తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు
రాజకీయం చేయడం దుర్మార్గం
తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చి ధర్మబద్ధతకు తూట్లు పొడవడం విడ్డూరం. సనాతన ధర్మం పేరుతో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్‌కళ్యాణ్ నేడు తిరుమలలో సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు సాగుతున్నా మాట్లాడకపోవడం దారుణం. ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం హేయమైన చర్య. తిరుమలకు మాంసాన్ని తీసుకెళ్లి పవిత్రతను దెబ్బతీసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించడం చేతకానితనానికి నిదర్శనం. – శివానంద స్వామీజీ, ఏపీ సాధు పరిషత్ ప్రతినిధి
హోటల్ అనుమతులు రద్దు చేయాలి
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అలిపిరి సమీపంలో చట్టవిరుద్ధంగా చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులును వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో పవిత్రత దెబ్బతీసే కార్యక్రమాల పట్ల పటిష్ట చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పరిరక్షణను విస్మరించడం శోచనీయం. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్ర మంటగలుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం
– విజయ భాస్కర్, హిందూ సంఘాల ప్రతినిధి, కర్ణాటక
పుట్టగతులుండవు
తిరుమల శ్రీవారితో చెలగాటాలాడితే పుట్టగతులుండవు. సనాతన ధర్మ పరిరక్షణ, తిరుమల ప్రక్షాళనే లక్ష్యమన్న కూటమి అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. తిరుమలకు మాంసం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. – సాధు మహరాజ్, శ్రీజ్ఞానపీఠం ప్రతినిధి
ధర్మరక్షణకు చర్యలు చేపట్టాలి
తిరుమలలో వరుసగా సాగుతున్న అపవిత్ర కార్యక్రమాలకు స్వస్తి పలికి సనాతన ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగితే ఆందోళనలు చేపట్టక తప్పదు.– కిరణ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment