‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్‌ ఎక్కడ?’ | Tirupathi Pub Incident: Bhumana Ask Where Is Pawan | Sakshi
Sakshi News home page

‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్‌ ఎక్కడ?’

Published Wed, Dec 18 2024 4:25 PM | Last Updated on Wed, Dec 18 2024 6:16 PM

Tirupathi Pub Incident: Bhumana Ask Where Is Pawan
  • పవిత్ర నగరంలో ఏరులై పారుతున్న మద్యం
  • తిరుచానూరు సమీపంలో పబ్ తరహా ఈవెంట్
  • చంద్రబాబు కళ్ళుమూసుకోవడం వల్లే ఈ అకృత్యాలు
  • సనాతన ధర్మ ప్రతినిధి పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ?
  • వైఎస్సార్‌సీపీ నేత భూమన నిలదీత

తిరుపతి, సాక్షి:   కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. 

తిరుపతి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.

సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్‌ కల్యాణ్‌  ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు.  

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమం
తిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement