
బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ నాటికీ బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. బుద్ధ పూర్ణిమను ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పౌర్ణమిని మే 23న జరుపుకోనున్నారు. బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు.
బీహార్‌లోని బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం కోసం బయలుదేరిన బుద్ధుడు గయలోని ధుంగేశ్వరి పర్వతంపై ఉన్న ప్రాగ్బోధి గుహకు చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆ గుహలో కఠిన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ తపస్సు సమయంలో, ఆయన ఆహారంతో పాటు నీటిని కూడా స్వీకరించలేదని చెబుతారు. ఫలితంగా బుద్ధుని శరీరం అస్థిపంజరంలా మారింది. నేటికీ అస్థిపంజరం రూపంలో ఉన్న బుద్ధుని విగ్రహం బుద్ధగయలో కనిపిస్తుంది. దుంగేశ్వరిలో మాతా దుర్గేశ్వరి ఆలయం ఉంది. అక్కడే బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది.
బుద్ధుడు తన ధ్యాన సమయం ముగిశాక కాలినడకన ఇక్కడ నుండి బయలుదేరాడు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్రౌర్ గ్రామానికి చేరుకుని, అక్కడి మర్రిచెట్టు కింద తిరిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుజాత అనే మహిళ బుద్ధుని అస్థిపంజర రూపాన్ని చూసి, అతనికి ఒక కప్పు ఖీర్ అందించింది. దానిని స్వీకరించిన బుద్ధ భగవానుడు అక్కడ నుండి బుద్ధగయకు బయలుదేరాడని చెబుతారు.
బుద్ధగయలోని ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాక పూర్ణిమ రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. పలువురు బౌద్ధ అనుచరులు ఇక్కడికి తరలివస్తారు. బుద్ధ భగవానుడు ఇక్కడ నుండే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. బుద్ధగయలోని మహాబోధి ఆలయం అంతర్జాతీయ వారసత్వ సంపదలో భాగంగా గుర్తింపు పొందింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే శ్రావ్యమైన కీర్తన ప్రతిధ్వనిస్తోంది.