విశాఖపట్నం: నగరంలోని ఎగువ రెల్లివీధిలో వెలసిన శివాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాఘ పౌర్ణమి పుణ్యదినాన నాగసర్పం ఒకటి శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఆలయంలో సంచరించిన నాగేంద్రుడు చేసిన విన్యాసాలు భక్తులను పరవశింపజేశాయి. మాఘ పౌర్ణమి రోజున మహాశివుని దర్శనంతో పాటు నాగేంద్రుడు స్వయంగా స్వామి భక్తిని ప్రదర్శించడం కనులారా చూశామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
మూడేళ్ల కిందట వెలుగులోకి..
సుమారు మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన సమయంలో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. దశమంతుల మాణిక్యాలరావు(వైఎస్సార్ సీపీ నాయకుడు) ఇంటి సమీపంలో కొండచరియలు విరిగిపడగా, శివలింగాన్ని ఆయనే గుర్తించారు. అప్పట్లో ఆ శివలింగం చుట్టూ మూడు, నాలుగు పాములు సంచరించేవి అని, కొంత సమయం తర్వాత వాటంతట అవే వెళ్లిపోయేవని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని పూజారి దృష్టికి తీసుకువెళ్లగా, శివలింగం ఎక్కడ లభించిందో అక్కడే ప్రతిష్టించాలని సూచించారు. దీంతో మాణిక్యాలరావు ఆ ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మించారు.
శివలింగంతో పాటు పార్వతీ సమేత గణనాథుని విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో తరచూ పాములు ఆలయంలోకి వస్తుంటాయని, అయితే అవి ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదని మాణిక్యాలరావు తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగుపాము ఆలయంలోకి ప్రవేశించడాన్ని మాణిక్యాలరావు స్వయంగా చూసి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ పాము శివాలయం ప్రాంగణమంతా కలియతిరుగుతూ, పార్వతీ సమేత గణనాథుడి విగ్రహం వద్ద, శివుని చిత్రపటం వద్ద పడగ విప్పి కొంతసేపు నిలబడిందన్నారు. సుమారు 10 నిమిషాల పాటు శివలింగానికి చుట్టుకుని కనిపించిందని ఆయన వివరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
— greatandhra (@greatandhranews) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment