రాష్ట్రవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు
వైభవంగా కార్తీక దీపాలంకరణ, జ్వాలా తోరణం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భక్తులు కార్తీక పౌర్ణమిని భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. నదుల్లో, బీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి దాదాపు లక్షన్నర మంది భక్తులు మంగినపూడిబీచ్‌కు వచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా నిర్వహించారు.
పట్టిసంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజా కార్యక్రమం నిర్వహించారు. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మహిళలు కాల్వలో స్నానాలు చేసి గట్టున కార్తిక దీపాలు వెలిగించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని స్నానఘట్టాలు కిటకిటలాడాయి. నది ఒడ్డున, ఆయా ఆలయాల్లో పౌర్ణమి పూజలు చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో స్నానమాచరిస్తున్న భక్తులు కార్తిక దీపాలను నదిలో విడిచిపెట్టారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నరసరావుపేట కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరేశ్వర ఆలయం, పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు తెల్లవారుజామునే చేరుకుని పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా సూర్యలంకలోని సముద్ర తీరానికి భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుదా నదీ తీరాల్లో కార్తీక దీపాలు వదిలారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శుక్రవారం కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి, పొలతల మల్లేశ్వరస్వామి, రాయచోటి, అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్రస్వామి, అత్తిరాల త్రేతేశ్వరస్వామి, నందలూరు సౌమ్యనాథస్వామి, బ్రహ్మంగారిమఠం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తదితర ఆలయాల్లో పూజలు చేశారు.
కార్తిక దీపాలంకరణ, జ్వాలాతోరణం, ఆకాశ దీపోత్సవం కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జ్వాలా తోరణ మహోత్సవం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం శ్రీ గౌరి జ్ఞానలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించారు.
దీపాల వరుసను వెలిగించారు. నర్సీç³ట్నం మండలంలో బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి వెలసిన త్రిశూల పర్వతంపై శుక్రవారం రాత్రి వెలిగించిన అఖండ జ్యోతిని భక్తులు దర్శించుకున్నారు. రాంబిల్లి మండలంలోని పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరస్వామి వెలసిన ఫణిగిరి చుట్టూ సుమారు 10 వేల మంది గిరి ప్రదక్షిణ చేశారు.
దేదీప్యమానం.. జ్వాలా తోరణం
శ్రీశైలం టెంపుల్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో జ్వాలాతోరణం నిర్వహించారు. ఆలయం ఎదురుగా గంగాధర మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్వాలాతోరణం చుట్టూ మూడుసార్లు స్వామి అమ్మవార్ల పల్లకీని తిప్పారు.
పాతాళగంగ వద్ద కృష్ణానదికి విశేష పూజలు, కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నదీమతల్లికి ఏకాదశ (పదకొండు) హారతులను సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను వెలిగించారు.
Comments
Please login to add a commentAdd a comment