సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్‌లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్‌లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్‌లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్‌లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్‌లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ)
అత్యంత సులభ విధానంలో బుకింగ్
ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment